ETV Bharat / health

మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలా? - వీటి జోలికి పోవద్దంటున్న నిపుణులు!

మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన, తినకూడని ఆహారాలు వివరిస్తున్న నిపుణులు!

Foods to Avoid for Kidney Health
Foods to Avoid for Kidney Health (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : May 8, 2025 at 2:06 PM IST

3 Min Read
Choose ETV Bharat

Foods to Avoid for Kidney Health: శరీరంలో కిడ్నీల పాత్ర ప్రధానమైనది. ఇవి శరీరంలోని వ్యర్థాలను, మలినాలను బయటకు పంపిచడానికి తోడ్పడుతాయి. ఇవి సమర్థంగా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే చాలా మంది హార్ట్​, లివర్​ హెల్త్​ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా, కిడ్నీల విషయానికి వచ్చే సరికి నిర్లక్షం చేస్తారు. ఫలితంగా మూత్రపిండాల్లో రాళ్లు సహా ఇతర సమస్యలు వేధిస్తాయి. ఈ క్రమంలోనే కిడ్నీలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాల జోలికి పోవద్దని సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూసేయండి.

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం : సోడియం ఎక్కువగా తీసుకోవడం అనేది అధిక రక్తపోటుకు కారణం అవుతుందని అందరికీ తెలిసిన విషయమే. దీర్ఘకాలికంగా ఈ పరిస్థితి మూత్రపిండాలపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే హైబీపీ సమస్యతో బాధపడేవారిలో కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు వల్ల మూత్రపిండాల్లోని రక్తనాళాలపై ఒత్తిడి కలుగుతుందని, దీనివల్ల రక్తనాళాలు బలహీనమై క్రమంగా కిడ్నీలు పనిచేయవని తెలియజేస్తున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్నవారు ఆహారంలో తక్కువ ఉప్పును తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఉప్పు
ఉప్పు (Getty image)

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్: ఇన్​స్టంట్ నూడుల్స్, చిప్స్, రెడీ టు ఈట్ లాంటి పదార్థాలు సోడియం, అనారోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. వీటిని తరుచూ తీసుకోవడం వల్ల ఒబెసిటీ బారిన పడడంతో పాటు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి దారితీస్తుందని National Library of Medicine పేర్కొంది. వీటికి ప్రత్యామ్నాయంగా కూరగాయలు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మూత్రపిండాల ముప్పు తగ్గుతుందని నిపుణులు వివరిస్తున్నారు.

సాఫ్ట్ డ్రింక్స్
సాఫ్ట్ డ్రింక్స్ (Getty image)

శీతల పానీయాలు : కూల్​డ్రింక్స్​లో షుగర్​, కార్బోనేటేడ్ వాటర్​ అధిక మొత్తంలో ఉంటాయని, ముఖ్యంగా కోలా వంటి ఫాస్పోరిక్ ఆమ్లం అధికంగా ఉండే పానీయాలు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయని National Library of Medicine పేర్కొంది. ఇందులో ఉండే కాల్షియం జీవక్రియను ప్రభావితం చేయడంతో పాటు మూత్రపిండాలపై అదనపు భారాన్ని కలిగిస్తాయని వివరిస్తున్నారు. వీటికి బదులుగా నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు, తాజాగా ఉన్న పండ్ల రసాలు తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య తొలగిపోవడంతో పాటు మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయని వివరిస్తున్నారు.

రెడ్ మీట్
రెడ్ మీట్ (Getty image)

రెడ్ మీట్ : శరీరానికి ప్రొటీన్ తప్పనిసరి అయినప్పుటికీ రెడ్ మీట్​ను అధికంగా తీసుకోవడం వల్ల యూరియా, క్రియాటిన్​ ఉత్పత్తి పెరుగుతుందని, వీటిని తొలగించడానికి మూత్రపిండాలకు ఎక్కువ సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది దీర్ఘకాలంలో మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. రెడ్ మీట్​కు బదులుగా మూంగ్ దాల్, రాజ్మా, చనా, పనీర్, పెరుగు లాంటివి తీసుకోవడం వల్ల తగినంత ప్రొటీన్​తో పాటు మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయని సూచిస్తున్నారు.

చక్కెర ఎక్కువగా తీసుకోవడం : షుగర్ అధికంగా తీసుకుంటే డయాబెటిస్ వస్తుందని చాలా మందికి తెలిసిన విషయమే. అయితే మన రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో లేకపోవడం వల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ నియంత్రణలో లేకపోవడం వల్ల మూత్రపిండాలలోని రక్త నాళాలు దెబ్బతింటాయని National Kidney Foundation పేర్కొంది. ఈ పరిస్థితి కారణంగా కిడ్నీలకు రక్తంలో ఉన్న వ్యర్థాలను ఫిల్టర్‌ చేసే సామర్థ్యం తగ్గిపోతుందని, ఇది దీర్ఘకాలికంగా కొనసాగితే కిడ్నీలు పనిచేయకుండా పోతాయని హెచ్చరిస్తున్నారు.

డీప్ ఫ్రై చేసిన స్నాక్స్
డీప్ ఫ్రై చేసిన స్నాక్స్ (Getty image)

డీప్ ఫ్రై చేసిన స్నాక్స్ : పదేపదే ఉపయోగించిన నూనెలు, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల ఒబెసిటీ, రక్తపోటు సమస్యలు వేధిస్తాయని, దీర్ఘకాలంలో ఈ సమస్యలు మూత్రపిండాల ఆరోగ్యంతో ముడిపడి ఉంటాయని నిపుణులు అంటున్నారు. డీప్ -ఫ్రై చేసిన స్ట్రీట్ ఫుడ్, ప్లాస్టిక్ కవర్స్​లో విక్రయించే స్నాక్స్ అనేవి దీర్ఘకాలంలో కిడ్నీ సమస్యలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

"షుగర్ తగ్గడానికి మందులతో పాటు ఇవీ ముఖ్యమే" - వైద్య నిపుణులు ఏం చెప్తున్నారంటే!

పీసీఓఎస్​తో అధిక బరువు ఇబ్బందా? - వెయిట్​ లాస్​కోసం ఈ టిప్స్ పాటిస్తే బెటర్ అంటున్న నిపుణులు!