14 గంటలు ఉపవాసం ఉంటున్నారా? - మీ బాడీలో జరిగే మార్పులు ఇవే!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 1, 2024, 5:27 PM IST

Fasting

Health Benefits of Fasting : మీరు పండగల సమయంలో ఫాస్టింగ్ ఉంటున్నారా? లేదా బరువు తగ్గాలని ఉపవాసం ఉంటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే రోజులో 14 గంటలు ఉపవాసం ఉంటే మీ శరీరంలో ఈ మార్పులు చోటుచేసుకుంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Fast For 14 Hours Health Benefits : మనలో చాలా మంది దేవుడిపై భక్తితో ఉపవాసం ఉంటారు. ఇంకొందరు బరువు తగ్గడానికి ఫాస్టింగ్ ఉంటారు. పురాతన కాలం నుంచి వస్తున్న ఉపవాస నియమాన్ని ఎక్కువ మంది పండగల సమయంలో పాటిస్తుంటారు. మరికొందరు మాత్రం వారానికి ఒక రోజైనా ఫాస్టింగ్(Fasting) ఉంటుంటారు. అయితే, ఈ రోజుల్లో ఎక్కువసేపు కడుపును ఖాళీగా ఉంచే ఉపవాస పద్ధతులు(ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌) చాలా ట్రెండ్ అవుతున్నాయి. అలాగే ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తున్నట్టు ఆధునిక పరిశోధనలు సైతం పేర్కొంటున్నాయి. అయితే, ఇంటర్​మిటెంట్ ఫాస్టింగ్​లో 14 గంటలు ఉపవాసం ఉంటూ, ఆపై 10 గంట‌ల్లో రోజుకు స‌రిప‌డా ఆహ‌రం తీసుకునే విధానం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్టు ఇటీవల కింగ్స్ కాలేజ్ లండ‌న్‌కు చెందిన ప‌రిశోధ‌కులు చేప‌ట్టిన అధ్య‌య‌నంలో వెల్లడైంది.

ముఖ్యంగా ఈ పద్ధతిని పాటించడం ద్వారా కొలెస్ట్రాల్‌, షుగ‌ర్ లెవెల్స్ అదుపులో ఉండ‌ట‌మే కాకుండా బ‌రువు త‌గ్గుతూ ర‌క్త‌పోటు నియంత్ర‌ణ‌లో ఉండ‌టం వంటి ప‌లు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు చేకూర‌తాయ‌ని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, చాలా మంది ఆరోగ్యపరంగా సానుకూల ఫలితాలు పొందేందుకు కఠిన ఉపవాస నియమాలు పాటిస్తుంటారు. ఇందులో అంతటి కఠిన నియంత్రణలు పాటించాల్సిన అవసరం లేదని రోజులో ప‌ది గంటల స‌మ‌యంలో భోజ‌నాల‌ను ముగించడం, మిగిలిన 14 గంట‌లు ఏమీ తిన‌కుండా ఉంటే చాల‌ని అధ్య‌య‌నంలో వెల్ల‌డైందని పరిశోధకులు స్పష్టం చేశారు. అలాగే ఈ విధానాన్ని చాలా మంది అనుస‌రించే వెసులు బాటు ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఇక ఈ ఇంట‌ర్‌మిటెంట్ ఫాస్టింగ్‌తో అధ్య‌య‌నంలో పాల్గొన్న‌వారిలో ఎన‌ర్జీ లెవెల్స్‌, మూడ్‌, ఆక‌లి వంటివి మెరుగ‌య్యాయ‌ని కూడా తేలింది.

ఉపవాసం మంచిదేనా? పరిశోధనల్లో ఏం తేలిందో తెలుసా?

14 గంటల పాటు ఉపవాసం ఉండటం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు :

గ్లైకోజెన్ క్షీణత, కీటోసిస్ : సుమారు 14 గంటల ఉపవాసం తర్వాత శరీరం దాని గ్లైకోజెన్ నిల్వలను తగ్గిస్తుంది. ఇది కార్బోహైడ్రేట్ల నుంచి ఉత్పన్నమయ్యే ప్రాథమిక శక్తి వనరు. గ్లైకోజెన్ తక్కువగా ఉన్నప్పుడు, శరీరం ఇంధనం కోసం కొవ్వును విచ్ఛిన్నం చేస్తుంది. అంటే కీటోసిస్​ స్థితికి దారితీస్తుంది. ఈ టైమ్​లో కాలేయం కీటోన్స్ అనే రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి మెదడు, కండరాలకు తగిన శక్తిని అందిస్తాయని చెబుతున్నారు నిపుణులు.

ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంపుదల : 14 గంటల ఉపవాసం బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. అంటే తక్కువ ఇన్సులిన్ స్థాయిలు కొవ్వును కరిగించడంలో సహాయపడడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. మొత్తంగా ఈ ఉపవాసం ఇన్సులిన్ నిరోధకత, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు .

హార్మోన్ల నియంత్రణ : ఉపవాసం.. పెరుగుదల హార్మోన్, గ్రెలిన్‌తో సహా వివిధ హార్మోన్‌లను ప్రభావితం చేస్తుంది. దాదాపు 14 గంటల ఉపవాసం తర్వాత గ్రోత్ హార్మోన్ స్రావం పెరుగుతుంది. అలాగే ఈ ఫాస్టింగ్ పద్ధతి జీవక్రియ, కండరాల పెరుగుదల, మరమ్మతును ప్రోత్సహిస్తుంది.

ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ తగ్గింపు : ఈ ఉపవాసం వల్ల శరీరంలో మంట తగ్గుతుందని తేలింది. C-రియాక్టివ్ ప్రొటీన్ (CRP), ఇంటర్‌లుకిన్-6 (IL-6) వంటి ఇన్‌ఫ్లమేటరీ మార్కర్‌ల దిగువ స్థాయిలు ఉపవాస సమయాల్లో గమనించవచ్చంటున్నారు నిపుణులు. తగ్గిన ఇన్​ఫ్లమేషన్ వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా మెరుగైన హృదయనాళ ఆరోగ్యం, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Intermittent Fasting Tips : ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి?.. దీని వల్ల కచ్చితంగా బరువు తగ్గుతారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.