రోజూ పాలు తాగితే చెడు కొలెస్ట్రాల్​ తగ్గుతుందా? నివేదికలు ఏం చెబుతున్నాయంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 1, 2024, 5:07 PM IST

How to control bad Cholesterol

Can Milk Raise Your Bad Cholesterol Level : నేటి కాలంలో చాలా మంది కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. మరి ఇలాంటి వాళ్లు ప్రతిరోజూ పాలు తాగవచ్చా? లేదా? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Can Milk Raise Your Bad Cholesterol Level : ఇటీవల కాలంలో చాలా మందిని కొవ్వు (కొలెస్ట్రాల్) సమస్య వేధిస్తోంది. దీని కారణంగా శరీర బరువు భారీగా పెరిగిపోతోంది. ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్న వారు ఏం తినాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంటారు. ఏం తింటే ఏమవుతుందో అనే సందేహం వారిని వెంటాడుతుంటుంది. ఈ లిస్టులో మొదటి స్థానంలో వచ్చేది పాలు. అధిక కొవ్వుతో బాధపడుతున్న వారు రోజూ పాలు తాగొచ్చా? ఒకవేళ వీరు రోజూ పాలు తాగితే ఏమవుతుంది? అనే దానికి అధ్యయన నివేదికలు చెబుతున్న సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం.

పాలలోని పోషకాలు
పాలు సంపూర్ణ ఆహారం. వీటిలో క్యాల్షియం, ఏ, బీ2, బీ12, డీ విటమిన్లతో పాటు మినరల్స్ ఉంటాయి. కొంతమంది రోజూ పాలు తాగకుండా ఉండలేరు. ఒక కప్పు పాలలో దాదాపు 150 కేలరీలు, 8 గ్రాముల ప్రోటీన్, 8 గ్రాముల కొవ్వు ఉంటాయి. కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు రోజూ ఒక కప్పు వెన్నతీసిన పాలను (స్కిమ్ మిల్క్) తాగొచ్చు. ఎందుకంటే స్కీమ్​ మిల్క్​లో దాదాపు 66 కేలరీలు తక్కువగా ఉంటాయి. కొవ్వు నామమాత్రంగా ఉంటుంది. ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఏమాత్రం తగ్గవు. కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ను తగ్గించాలని భావించే వారు ప్రతిరోజూ సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ (సంతృప్త కొవ్వుల)ను 12 గ్రాములలోపు ఉండేలా చూసుకోవాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తెలిపింది. మందులు లేకుండా కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలని భావించే వారు ఆహార విషయాల్లో తప్పకుండా ఇలాంటి స్వీయ నిబంధనలను పాటించాలని సూచించింది.

చెడు కొలెస్ట్రాల్ వర్సెస్ మంచి కొలెస్ట్రాల్
'యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌' 2018 సంవత్సరంలో ఒక అధ్యయనం చేసింది. దీని ప్రకారం, అధ్యయనంలో పాల్గొన్న వారిలో కొందరు మూడు వారాల పాటు ప్రతిరోజూ వెన్న తీసిన పాలను (స్కిమ్ మిల్క్)ను తాగారు. మరికొందరు సాధారణ పాలను (హోల్ మిల్క్)ను తాగారు. ఆ మూడు వారాలు గడిచిన తరువాత వారు కాస్త ఛేంజ్ చేశారు. స్కీమ్ మిల్క్ తాగినవారు సాధారణ పాలను, హోల్​ మిల్క్​ తాగిన వారు వెన్న తీసిన పాలను మరో మూడు వారాల పాటు తాగారు. సాధారణ పాలను తాగినప్పుడు వారి శరీరంలోని మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయులు పెరిగాయి. అయితే స్కిమ్ మిల్క్ తాగినా, హోల్ మిల్క్ తీసుకున్న వారెవరిలోనూ చెడు కొలెస్ట్రాల్ పెరగలేదు. దీన్ని బట్టి చూస్తే పాల వల్ల చెడు కొలెస్ట్రాల్​ పెరగదని అధ్యయనంలో తేలింది.

పిల్లల్లో ఇలా
'పీఎల్​ఓఎస్​ వన్' జర్నల్‌లో 2022 సంవత్సరంలో ఒక అధ్యయన నివేదిక పబ్లిష్ అయింది. పిల్లల్లో స్థూలకాయాన్ని తగ్గించేందుకు అనుసరించాల్సిన ఆహార ఫార్ములాపై అందులో ప్రస్తావించారు. దాని ప్రకారం, అధ్యయనంలో పాల్గొన్న కొందరు పిల్లలకు ఆకుపచ్చ కూరగాయలు, బీఫ్, డైరీ బటర్ వంటి కనిష్టంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను అందించారు. వారంతా ప్రతిరోజూ సగటున 10 ఔన్సుల సాధారణ పాలను తాగారు. ఈ స్టడీలో పాల్గొన్న ఇతర పిల్లల సమూహానికి సాధారణ ఆహారాన్ని అందించారు. కొన్ని నెలల తర్వాత, రెండో గ్రూపులోని పిల్లలకు కూడా కనిష్ఠంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను అందించారు. ఈ మార్పు కారణంగా రెండో గ్రూపులోని పిల్లల్లో కూడా గణనీయంగా మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరిగినట్లు వెల్లడైంది. అంతేకాదు వారి కొలెస్ట్రాల్​/ హెచ్​డీఎల్​ కొలెస్ట్రాల్​ రేషియో కూడా తగ్గింది. అంటే వారి గుండె ఆరోగ్యం కూడా పదిలంగా ఉంటుందని నిర్దరణ అయ్యింది.

హార్ట్ స్ట్రోక్ రిస్క్ సంగతేంటి?
న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం అంశంపై విడుదలైన '2021 మెటా ఎనాలిసిస్' నివేదికలో పలు కీలకమైన అంశాలు వెలుగుచూశాయి. తక్కువ కొవ్వు ఉన్న పాలను తాగితే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆ నివేదిక తెలిపింది. అధిక కొవ్వుతో కూడిన పాలను తాగితే హార్ట్ స్ట్రోక్ రిస్క్ పెరుగుతుందని పేర్కొంది. తక్కువ కొవ్వు ఉన్న పాలను రోజూ తాగినా పెద్దగా హెల్త్ రిస్క్ ఉండదని స్పష్టం చేసింది. తక్కువ కొవ్వున్న పాలు తాగితే కొలొరెక్టల్ క్యాన్సర్, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ముప్పు తగ్గుతుందని నివేదిక చెప్పింది. రోజూ 7 ఔన్స్​ల​ పాలు తాగితే మెటబొలిక్ సిండ్రోమ్ ప్రమాదాన్ని 13 శాతం, ఊబకాయం ముసురుకునే ముప్పును 16 శాతం తగ్గిస్తాయని తెలిపింది. పాలు తాగడం వల్ల ఆస్టియోపోరోసిస్ (బోలు ఎముకల వ్యాధి) వచ్చే రిస్క్ కూడా 40 శాతం తగ్గుతుంది. పై అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, పాలు తాగడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. పైగా మంచి కొలెస్ట్రాల్ లభిస్తుందని స్పష్టమవుతోంది.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

బియర్డ్‌ ఆయిల్‌ Vs బియర్డ్‌ బామ్‌- స్టైలిష్‌ లుక్ కోసం ఏది బెటర్ ?

చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా? ఈ తైలం అప్లై చేస్తే సమస్యకు చెక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.