ETV Bharat / business

అదిరిపోయేలా అంబానీ ప్రీవెడ్డింగ్!​- కళ్లు చెదిరే ఈవెంట్లు, స్పెషల్​ సర్​ప్రైజ్​లు- అబ్బో చాలా ఉన్నాయ్! ​

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2024, 5:44 PM IST

Anant Ambani Pre Wedding Invitation Card : అపర కుబేరుడు అంబానీ ఇంట పెళ్లి సందడి అంటే ఆ విశేషాలు మామూలుగా ఉండవు. ప్రతిదీ అట్టహాసంగా జరుగుతుంది. ముకేశ్​ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ- రాధికా మర్చంట్‌ ప్రీవెడ్డింగ్‌ వేడుక కూడా అలానే జరగనుంది. అందులో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత అతిరథ మహారథులను ఆహ్వానించేందుకు కళ్లు చెదిరే ఆహ్వాన పత్రికను సిద్ధం చేశారు. అందులో అతిథులకు ఇచ్చే పార్టీలు, అలరించే ఈవెంట్​లను పొందుపరిచారు. అతిథులకు 2,500 రకాల వంటకాలతో భోజనాలు వడ్డించనున్నారు. అంబానీల ప్రీవెడ్డింగ్​ గురించి పూర్తి వివరాలు మీకోసం.

Anant Ambani Pre Wedding Invitation Card
Anant Ambani Pre Wedding Invitation Card

Anant Ambani Pre Wedding Invitation Card : ప్రపంచ కుబేరుల్లో ఒకరు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్​ ప్రీవెడ్డింగ్​ వేడుకకు అదిరిపోయే ఇన్విటేషన్ సిద్ధం చేశారు. పెళ్లికి ముందు మూడు రోజుల పాటు జరిగే ఈవెంట్​కు, ప్రపంచ ప్రఖ్యాత అతిథులను ఆహ్వానిస్తున్నారు. వీరిని ఆహ్వానించేందుకు రూపొందించిన వీడియోలో, 8 పేజీల ఇన్విటేషన్​ కార్డు ఉంది. అందులో వేడుక జరిగే స్థలం, సమయం, వివిధ ఈవెంట్​లకు పెట్టిన డ్రెస్​కోడ్​లు వంటి వివరాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్​ అవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ ఆహ్వాన పత్రికలో ఇంకా ఏఏ విశేషాలు ఉన్నాయో చూద్దాం పదండి.

అక్షరాలతో మొదలు
ఆహ్వాన పత్రిక మొదటి పేజీలో అనంత్​, రాధిక పేర్ల నుంచి మొదటి అక్షరాన్ని హిందీలో రాశారు. దాన్ని ఒక లోగో ఆకారంలో తీర్చిదిద్ది చుట్టూరా ఎర్రగులాబీలు డిసైన్​ వేశారు. ఆ తర్వాతి పేజీలో అంబానీలు ఒక సందేశాన్ని రాశారు. అయితే ఈ పేజీని అనంత్​ అభిరుచికి అనుగుణంగా దీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. అనంత్​కు ప్రకృతి, జంతువులు అంటే ఇష్టం. దీంతో ఈ పేజీలో ప్రకృతితో మమేకమైన పక్షులు, జంతువుల డిజైన్​ వేశారు.

స్పెషల్​ సర్​ప్రైజ్
మార్చి 1న కాక్​టెయిల్​ పార్టీతో ప్రీవెడ్డింగ్ వేడుక ప్రారంభమవుతుంది. సాయంత్రం 5.30 మొదలయ్యే ఈ పార్టీకి 'ఎలిగంట్ కాక్‌టెయిల్' డ్రెస్​కోడ్​ను సూచించారు. అయితే అతిరథమహారథులకు మొదటి రోజు ఒక స్పెషల్ సర్​ప్రైజ్​ ఇవ్వనున్నట్లు ఇన్విటేషన్ కార్డులో చెప్పారు. అదేంటో తెలియాలంటే మార్చి 1 వరకు ఆగాల్సిందే.

వైల్డ్​సైడ్​ వాక్​
మార్చి 2న రెండు ఈవెంట్లను ప్లాన్​ చేశారు. ఉదయాన అంబానీ కుటుంబం 3000 ఎకరాల్లో అభివృద్ధి చేసిన జంతు సంరక్షణ కేంద్రం 'వన్​తారా'లో వైల్డ్​సైడ్​ వాక్ అనే కార్యక్రమం చేపడతారు. దీనికోసం 'జంగల్​ ఫీవర్'​ డ్రెస్సులను ధరించాల్సిందిగా అతిథులకు సూచించారు. ఇక సాయంత్రం జరిగే కార్నివాల్​లో డ్యాన్సింగ్ షూలు వేసుకోవాల్సిందిగా చెప్పారు.

ప్రకృతి ఒడిలో అతిథులకు విందు
చివరగా మార్చి 3న ప్రపంచ నలుమూలల నుంచి హాజరైన అతిథులకు ప్రకృతి మధ్యలో మధ్యాహ్న భోజనం వడ్డించనున్నారు అంబానీలు. ఆ తర్వాత జరిగే కార్యక్రమంలో అతిథులను భారత సంప్రదాయ దుస్తులను ధరించమని కోరారు. ఇక ఇన్విటేషన్ చివరి పేజీలో వధూవరుల తల్లిదండ్రుల పేర్లతో సహా అంబానీ, మర్చంట్​ కుటుంబాలకు చెందిన వారి పేర్లను రాశారు.

ఇంటర్నేషనల్ కళాకారులు- కళ్లుచెదిరే ఈవెంట్​లు
ప్రపంచంలోని వివిధ దేశాల అధినేతలు, ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలకు చెందిన సీఈఓలు సహా దాదాపు 1200 మంది ఈ ప్రీవెడ్డింగ్ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వారిని అలరించడానికి, అడుగడుగునా ఈవెంట్లు ప్లాన్​ చేశారు. ఈ ఈవెంట్లలో దేశంలోని ఆర్టిస్టులతో పాటు ప్రంపచంలోని ప్రముఖ కళారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అందులో అమెరికన్​ సింగర్ రిహాన్నా సహా అర్జీత్ సింగ్, దిల్​జీత్ దోసంగ్ తదితరులు ఉన్నారు. ఇక ప్రముఖ అమెరికన్​ ఇల్యూషనిస్ట్​ డేవిడ్​ బ్లేయిన్ కూడా ప్రదర్శన ఇవ్వనున్నట్లు సమాచారం.

హ్హ హ్హ హ్హ భోజనంబు- 2500 రకాల వంటకాలు
ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగే మూడు రోజుల పాటు అతిథులకు వడ్డించేందుకు ప్రత్యేక మెనూ సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందుకోసం మధ్యప్రదేశ్​లోని ఇందౌర్‌ నుంచి 21మంది చెఫ్‌లను పిలిపించినట్లు తెలుస్తోంది. ఆహ్వానితులకు భారతీయ వంటకాలతో పాటు జపనీస్‌, మెక్సికన్‌, థాయ్‌, పార్సీ ఇలా పలు రకాల సంప్రదాయ వంటలను రుచి చూపించనున్నారు. మొత్తంగా 2,500 రకాల వంటకాలను అతిథులకు వడ్డించనున్నారు.

బ్రేక్‌ఫాస్ట్‌లో 75 వెరైటీలు, లంచ్‌లో 225, డిన్నర్‌లో 275 రకాల వంటకాలను వడ్డించనున్నారు. మిడ్‌నైట్‌ స్నాక్స్‌ కూడా ఏర్పాటుచేయనున్నారట. అర్ధరాత్రి 12 నుంచి 4 గంటల వరకు 85 వంటకాల్లో అతిథులు ఏది కోరుకుంటే అది అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కచోరీ, పోహా, జిలేబీ, భుట్టె కా కీస్‌, ఖోప్రా ప్యాటిస్ తదితర ఇందౌరీ వంటకాలను ప్రత్యేకంగా చేయించనున్నారని తెలుస్తోంది.

అంబానీ ఇంట పెళ్లి సందడి- అనంత్ ప్రీ వెడ్డింగ్​కు గెస్ట్​ల లిస్ట్​ ఇదే- ఏర్పాట్లు వేరే లెవెల్​!

అంబానీ సంపద రూ.7లక్షల కోట్లు.. కాబోయే కోడలు ఫ్యామిలీ ఆస్తి ఎంతంటే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.