'కాంగ్రెస్​కు కాలం చెల్లింది- రిజర్వేషన్లకు ఆ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకమే!'

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2024, 3:31 PM IST

Updated : Feb 7, 2024, 4:34 PM IST

PM Modi Rajya Sabha Speech Today

PM Modi Rajya Sabha Speech Today : కాంగ్రెస్ పార్టీ తన పనిని అవుట్ సోర్సింగ్​కు అప్పగించిందని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్‌ పార్టీ అవాస్తవ కథనాలను సృష్టిస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌వి కాలం చెల్లిన సిద్ధాంతాలని విమర్శించారు.

PM Modi Rajya Sabha Speech Today : కాంగ్రెస్‌ పార్టీ ఆలోచనా విధానానికి కాలం చెల్లిందని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ తన పనిని అవుట్‌ సోర్సింగ్‌కు ఇచ్చిందన్నారు. ప్రతిపక్ష పార్టీ ఆ స్థాయికి దిగజారడం తమకు సంతోషం కానప్పటికీ, సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ప్రధాని చెప్పారు. రిజర్వేషన్ల విషయంలోనూ ఆ పార్టీది ప్రతికూల వైఖరేనని విమర్శించారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు బుధవారం సమాధానం ఇచ్చిన క్రమంలో కాంగ్రెస్‌పై మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

రాష్ట్రాల మధ్య విభజన తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నం!
అధికార దాహంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాత్రికిరాత్రే రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలను రద్దు చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. ప్రజాస్వామ్యం గొంతును నులిపేసిందన్నారు. ఇప్పుడు ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య విభజన తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని మోదీ ధ్వజమెత్తారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల గురించి కాంగ్రెస్‌కు తెలుసని, వాటిని పరిష్కరించేందుకు ఏమీ చేయలేదని విమర్శించారు.

"కాంగ్రెస్‌లో వారి నాయకులు, విధానాలకే ఎలాంటి గ్యారంటీ లేదు. అలాంటి వారు మోదీ గ్యారంటీలను ప్రశ్నిస్తున్నారు. దళితులు, గిరిజనులకు కాంగ్రెస్‌ వ్యతిరేకం. మాజీ ప్రధాని నెహ్రూను వారు గుడ్డిగా అనుసరిస్తున్నారు. రిజర్వేషన్లను ఆయన గట్టిగా వ్యతిరేకించారు. మా హయాంలో ఎస్​సీ, ఎస్​టీలకు అన్ని పదవుల్లో విశేష ప్రాధాన్యం ఇచ్చాం. తొలిసారి ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతిని చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. కాంగ్రెస్‌ పాలకులు వారి కుటుంబీకులకు మాత్రమే అత్యున్నత పురస్కారాలను అందించారు. 1990లో కేంద్రంలో మా మద్దతుతో ఉన్న ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను భారతరత్నతో సత్కరించింది. బ్రిటిష్ వారి నుంచి కాంగ్రెస్ స్ఫూర్తి పొందింది. దశాబ్దాలుగా బానిసత్వ చిహ్నాలను కొనసాగించింది."

-- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ఖర్గేకు ఆ స్వేచ్ఛ ఎలా వచ్చిందో!
"ఇటీవల బంగాల్‌ నుంచి కాంగ్రెస్‌కు ఓ సవాల్‌ (మమతా బెనర్జీ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ) ఎదురైంది. హస్తం పార్టీ 40 స్థానాలు కూడా సాధించలేదని అన్నారు. కనీసం మీరు 40 సీట్లైనా గెలవాలని నేను కోరుకుంటున్నా" అని ప్రధాని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభలో ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ప్రసంగాన్ని కూడా ప్రస్తావించారు. "వచ్చే ఎన్నికల్లో మాకు 400 సీట్ల మెజార్టీ వస్తుందని ఖర్గే అంచనా వేశారు. అది మాకు ఆశీర్వాదంగా భావిస్తున్నా. కచ్చితంగా ఆయన అంచనా నిజమవుతుంది. ఆరోజు ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఆయనకు అంత స్వేచ్ఛ ఎలా లభించిందని నేను ఆశ్చర్యపోయా. బహుశా ఆ రోజు వారి స్పెషల్‌ కమాండర్లు (కేసీ వేణుగోపాల్‌, జైరాం రమేశ్‌ను ఉద్దేశిస్తూ) సభకు రాలేదేమో" అని వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

'స్టార్టప్‌' యువరాజ్‌
అటు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై ప్రధాని మోదీ విమర్శల వర్షం కురిపించారు. "కాంగ్రెస్‌ పార్టీ పదే పదే ఒకే ఉత్పత్తిని (రాహుల్‌ను ఉద్దేశిస్తూ) ఆవిష్కరించాలని ప్రయత్నిస్తోంది. అందుకే వారి దుకాణం త్వరలోనే మూతపడనుంది. వారు తమ యువరాజును స్టార్టప్‌గా తీసుకురావాలని భావిస్తున్నారు. కానీ, ఆయన స్టార్ట్ కారు" అని ఎద్దేవా చేశారు.

'విపక్షాల హోదా మారదు- మా మూడో టర్మ్​లో అతిపెద్ద నిర్ణయాలు- వెయ్యేళ్లకు పునాది వేస్తాం'

రాజకీయ కారణాలతో దేశ సంస్కృతినే అవమానించారు!: మోదీ

Last Updated :Feb 7, 2024, 4:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.