ETV Bharat / bharat

'విపక్షాల హోదా మారదు- మా మూడో టర్మ్​లో అతిపెద్ద నిర్ణయాలు- వెయ్యేళ్లకు పునాది వేస్తాం'

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 5, 2024, 6:15 PM IST

Updated : Feb 5, 2024, 7:33 PM IST

PM Modi Parliament Speech : లోక్​సభలో రాష్ట్రపతి ప్రసంగానికి శుక్రవారం ధన్యవాదాలు తెలిపిన మోదీ, విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చాలా కాలం విపక్షాలు ప్రతిపక్ష హోదాలోనే ఉంటాయని, వాటి దుస్థితికి కాంగ్రెస్​ కారణమని ఎద్దేవా చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లలో, ఎన్​డీఏ 400లకు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని అన్నారు.

PM Modi Parliament Speech
PM Modi Parliament Speech

PM Modi Parliament Speech : రాష్ట్రపతి ప్రసంగానికి లోక్​సభలో సోమవారం ధన్యవాదాలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. దాదాపు 100 నుంచి 125 రోజుల వ్యవధిలో జరగనున్న 2024 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు వస్తాయని, ఎన్​డీఏ కూటమి 400కు పైగా సీట్లు గెలుస్తుందని మోదీ జోస్యం చెప్పారు. ఎన్​డీఏ మూడో టర్మ్​లో అతిపెద్ద నిర్ణయాలు తీసుకుంటామని మోదీ స్పష్టం చేశారు. వెయ్యేళ్లకు అవసరమైన బలమైన పునాది వేస్తామని చెప్పుకొచ్చారు. విపక్షాలు చాలాకాలం ప్రతిపక్షంలోనే ఉండాలని సంకల్పం తీసుకున్నాయని ఎద్దేవా చేశారు. దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్నందున మళ్లీ దశాబ్దాల పాటు విపక్షంలో ఉండాలని వారు భావిస్తున్నారని అన్నారు. విపక్షాల కోరికను భగవంతుడు నెరవేరుస్తారని తాను భావిస్తున్నట్లు తెలిపారు.

ఎన్నికల తర్వాత విపక్ష నేతలు ప్రేక్షకుల సీట్లకు పరిమితమవుతారని మోదీ జోస్యం చెప్పారు. ఎన్నికల్లో ఓటమి కోసమే విపక్షాలు తీవ్రంగా కష్టపడుతున్నాయన్నారు. విపక్షాల తీరుపై దేశ ప్రజలు తీవ్ర నిరాశ చెందారని, ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియని స్థితిలో విపక్షాలు ఉన్నాయి విమర్శించారు. జాతి మొత్తం ఆరోగ్యకరమైన ప్రతిపక్షాన్ని కోరుకుంటోందని, విపక్షాల దుస్థితికి కాంగ్రెస్‌ పార్టీ జవాబుదారీ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

'నేతలు మారినా రాగం అదే'
'కొన్ని నిర్మాణాత్మక సూచనలు చేసేందుకు విపక్షాలకు బడ్జెట్‌ సమావేశాలు మంచి అవకాశం. కానీ ప్రతిపక్ష సభ్యులు ఆ సదావకాశాన్ని కూడా వదులుకున్నారు. మీరు దేశాన్ని భ్రమలో ముంచి వెళ్లిపోయారు. కాంగ్రెస్​లో నాయకులు మారారు కానీ అదే రాగం కొనసాగుతోంది. ఇది ఎన్నికల సమయం, ప్రతిపక్షాలు మరి కాస్త కష్టపడి, ప్రజలకు కొత్త సందేశం పంపించి ఉండాల్సింది. కానీ అందులో కూడా మీరు ఘోరంగా విఫలమయ్యారు. ఈ ప్రాథమిక విషయాన్ని నేను మీకు నేర్పుతాను' అని మోదీ ప్రతిపక్షాలను దుయ్యబట్టారు.

"పార్లమెంటులో ఉన్నంతకాలం ఏదైనా మంచి చేయడానికి ప్రయత్నించాలి. వారసత్వం అనేది కాంగ్రెస్‌ దుకాణం మూసివేతకు కారణమవుతోంది. రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌షాకు సొంత పార్టీలు ఏమీ లేవు. వారసత్వ పాలనకు ఖర్గే, ఆజాద్‌ బాధితులు అయ్యారు. ఒకే నేతను కాంగ్రెస్‌ పదే పదే జనంపై రుద్దే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీలో వారసత్వ రాజకీయ బాధితులు ఉన్నారు. వారసత్వ రాజకీయాలకు ఖర్గే, ఆజాద్‌ బాధితులు అయ్యారు. ఖర్గే రాజ్యసభకు వెళ్లారు, ఆజాద్‌ ఏకంగా పార్టీ వదిలివెళ్లారు."
-- నరేంద్ర మోదీ, భారత ప్రధాని

'నెహ్రూకు భారతీయులపై విశ్వాసం లేదు'
దేశ శక్తి, సామర్థ్యాలపట్ల కాంగ్రెస్‌కు ఎప్పుడూ నమ్మకం లేదని ప్రధాని మోదీ విమర్శించారు. 'ప్రధానిగా నెహ్రూ తొలి ప్రసంగంలోనే విదేశీయులతో పోలిస్తే భారతీయులకు నైపుణ్యం లేదని అన్నారు. భారతీయుల శక్తిపై విశ్వాసం వ్యక్తం చేయలేదని చెప్పారు. భారతీయులు నెమ్మదిగా, సోమరుల్లా పని చేస్తారని నెహ్రూ అన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ చేసిన తప్పులకు కశ్మీర్ ప్రజలు, దేశం భారీ మూల్యం చెల్లించుకుంది. ఇందిరాగాంధీ కూడా నెహ్రూ కంటే ఏమీ తక్కువ కాదు. భారతీయులకు ఆత్మన్యూనత ఎక్కువ అని ఆమె అన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీకి భారతీయుల శక్తిపై అంత నమ్మకం ఉండేది కాదు. మూడో దఫాలో మేం వికసిత్‌ భారత్‌ లక్ష్యాల కోసం పని చేస్తాం' అని ప్రధాని మోదీ తెలిపారు.

'ఇండియా కూటమి అలైన్‌మెంట్‌ దెబ్బతింది'
ప్రసంగంలో తమ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి గురించి మోదీ వివరించారు. పేదల కోసం తాము 4 కోట్ల ఇళ్లు, పట్టణ పేదల కోసం 80 లక్షల ఇళ్లు నిర్మించామని తెలిపారు. ఇండియా అలయన్స్‌ అలైన్‌మెంట్‌ దెబ్బతిందని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమిలో ఒకరిపై ఒకరికి విశ్వాసం లేదని, ఆ కూటమిలోని పార్టీలను దేశ ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.

ఈడీ, సీబీఐ స్వతంత్ర సంస్థలు : మోదీ
ఈడీ, సీబీఐ వంటి స్వంతంత్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందన్ని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలపై మోదీ స్పందించారు. దర్యాప్తు సంస్థలు స్వతంత్ర సంస్థలని, వాటిని ఆ విధంగా రాజ్యాంగం ఉంచిందని తెలిపారు. వాటి చర్యలను కోర్టులు నిర్ణయించాలని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఈడీ కేవలం రూ.5000 కోట్లు సీజ్​ చేసిందని, కానీ తమ ప్రభుత్వంలో ఆ మొత్తం రూ.లక్ష కోట్లకు చేరుకుందని తెలిపారు.

'ఉపాధి అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయ్'
'కాంగ్రెస్ ఓబీసీలను అవమానించింది. మేము కర్పూరి ఠాకూర్‌కు భారత్నరత్న ఇచ్చాం. ఓబీసీలకు బీజేపీ అన్యాయం చేసిందని ఆరోపిస్తున్నారు. మేము మహిళా సాధికారతకు కృషిచేశాం. మహిళా రిజర్వేషన్‌ బిల్లు తీసుకువచ్చాం. దేశంలో ప్రతి రంగంలో మహిళలు సత్తా చాటుతున్నారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధులు తీసుకోవద్దని రైతులకు చెబుతున్నారు. ఎన్​డీఏ గెలిస్తే రైతులకు ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకుంటారని చెబుతున్నారు. 2014కు ముందు డిజిటల్‌ ఎకానమీ పరిమాణం తక్కువ. ప్రస్తుతం డిజిటల్‌ ఎకానమీలో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. దేశంలో ఉపాధి అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయి' అని మోదీ పేర్కొన్నారు.

'ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారు'- చండీగఢ్ మేయర్​ ఎన్నికల నిర్వహణపై సుప్రీం ఫైర్

'ఎన్నికల ప్రచారాల్లో చిన్నారులను ఉపయోగించవద్దు'- పార్టీలకు ఈసీ ఆదేశాలు

Last Updated : Feb 5, 2024, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.