ETV Bharat / bharat

వీడిన ఉత్కంఠ- ఎమ్మెల్యేలతో సీఎం సోరెన్ భేటీ- ఇంటి వద్ద 144 సెక్షన్‌

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 4:19 PM IST

Hemant Soren News : ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అజ్ఞాతంలో ఉన్నట్లు జరిగిన ప్రచారానికి తెరపడింది. ఆయన రాంచీలోని తన నివాసానికి చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నం సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఇందులో సీఎం సతీమణి కల్పనా కూడా పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Hemant Soren News
Hemant Soren News

Hemant Soren News : ఝార్ఖండ్‌లో ఉత్కంఠ వీడింది. అజ్ఞాతంలో ఉన్నట్లు ప్రచారం జరిగిన ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్ రాంచీలోని తన నివాసానికి చేరుకున్నారు. భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమంత్‌ను విచారించేందుకు సోమవారం దిల్లీలోని ఆయన నివాసానికి ఈడీ అధికారులు వెళ్లారు. సోమవారం రాత్రివరకు ఎదురుచూసినా సోరెన్‌ అక్కడికి రాలేదు. సీఎంకు చెందిన రెండు కార్లు, రూ.36 లక్షల నగదు, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే సోమవారం అర్ధరాత్రి హేమంత్‌ సోరెన్ రాంచీలోని తన నివాసానికి చేరుకున్నట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఝార్ఖండ్‌ సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలంతా రాంచీ చేరుకోగా వారితో సోమవారం మధ్యాహ్నం హేమంత్‌ సోరెన్ సమావేశం నిర్వహించారు.

Hemant Soren News
సంకీర్ణ కూటమిలోని ఎమ్మెల్యేలతో సీఎం భేటీ

మరోవైపు, రాంచీ చేరుకున్న ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్​ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బాపూధామ్​లో ఉన్న మహాత్ముని విగ్రహానికి నివాళులర్పించారు. 'గాంధీ లాంటి వ్యక్తులు మన మధ్యే పుట్టి మనకు మార్గనిర్దేశం చేసినందుకు గర్విస్తున్నా.' అని తెలిపారు.

అధికారులతో గవర్నర్ మీటింగ్
దిల్లీలో సీఎం హేమంత్ సోరెన్ నివాసంలో ఈడీ సోదాలు జరిపిన నేపథ్యంలో ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రాష్ట్రంలో భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. మరోవైపు, శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, అదనంగా మరో 7 వేల మంది పోలీసులను మోహరిస్తున్నామని ఓ అధికారి తెలిపారు. సీఎం హేమంత్‌ సోరెన్ నివాసంతోపాటు రాజ్‌భవన్‌, ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించినట్లు పేర్కొన్నారు.

సీఎం గురించి సమాధానం ఇస్తే రూ.11 వేలు రివార్డు
అంతకుముందు ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అదృశ్యంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. సోరెన్​​ అకస్మిక అదృశ్యం కారణంగా రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం లాంటి పరిస్థితి ఏర్పడిందని ఝార్ఖండ్ బీజేపీ చీఫ్ బాబులాల్ మరాండీ ఆరోపించారు. సోరెన్‌ చిత్రంతో ఉన్న పోస్టర్‌ను ఎక్స్‌లో పోస్టు చేసి, ఆయన గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.11 వేల రివార్డు ప్రకటించారు. ' హేమంత్‌ సోరెన్‌ గత రెండు రోజులుగా కనిపించ్లేదని, సీఎం ఎక్కడున్నారో రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్‌ విభాగానికి తెలియకపోవడం తీవ్ర పరిణామం' అని మరాండీ అన్నారు.

'7నెలలు ఎదురుచూశాం- అయినా స్పందన లేదు'- కాంగ్రెస్​పై అభిషేక్ బెనర్జీ ఫైర్​

లాలూపై ఈడీ ప్రశ్నల వర్షం- 9గంటలకుపైగా సుదీర్ఘ విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.