ETV Bharat / bharat

బీజేపీ నయా స్కెచ్- నోటిఫికేషన్​కు ముందే 100 మంది అభ్యర్థులతో తొలి జాబితా- మోదీ, షా సైతం!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 10:08 PM IST

BJP Lok Sabha MP Candidates List : లోక్‌సభ ఎన్నికలకు మార్చిలో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు భారతీయ జనతా పార్టీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో 370 స్థానాలకుపైగా గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న కమలంపార్టీ వచ్చే వారం వంద మందితో తొలి జాబితా ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ జాబితాలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా కీలక నేతలు పేర్లు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

BJP Lok Sabha MP Candidates List
BJP Lok Sabha MP Candidates List

BJP Lok Sabha MP Candidates List : త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సమాయత్తమవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించకముందే లోక్‌సభకు పోటీ చేయబోయే తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. తొలి విడతగా 100 మందితో జాబితాను వచ్చే వారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల సన్నాహాల్లో భాగంగా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఫిబ్రవరి 29న భేటీ కానుంది. అదే రోజు తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందులో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా పేర్లు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారణాసి నుంచి రెండుసార్లు పోటీ చేసి గెలుపొందిన ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అదే స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. 2019 ఎన్నికల్లో గాంధీ నగర్‌ నుంచి గెలుపొందిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మరోసారి అక్కడినుంచే బరిలోకి దిగే అవకాశం ఉంది. మార్చి 10 తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి.

సార్వత్రిక ఎన్నికల్లో ఒంటిరిగానే 370 సీట్లు సాధించాలని బీజేపీ ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంగా ఎన్​డీయే కూటమి 400 సీట్లలో విజయం సాధించేలా ఆ పార్టీ పావులు కదుపుతోంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే రాబోయే 100 రోజులు చాలా కీలకమని ప్రధాని మోదీ పార్టీ నేతలు, కార్యకర్తలకు ఇటీవల దిశానిర్దేశం చేశారు. కాబట్టి ప్రతి కొత్త ఓటరును చేరుకోవాలని, ప్రతి ఒక్కరి నమ్మకాన్ని చూరగొనాలని సూచించారు.

మిషన్ జ్ఞాన్​పై బీజేపీ దృష్టి
లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో సమాజంలోని కీలక వర్గాలను ఆకట్టుకునేందుకు బీజేపీ మిషన్ జ్ఞాన్​(GYAN)పై దృష్టి పెట్టింది. G అంటే గరీబ్​ (పేద), Y అంటే యువ (యువత), A అంటే అన్నదాత (రైతులు), N అంటే నారీ(మహిళలు)గా నిర్వచించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మధ్యప్రదేశ్, రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్​లో గెలిచిన తర్వాత దిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీటింగ్​లో మోదీ- ఈ GYAN ప్రస్తావన తీసుకొచ్చారు. దేశంలో పేదలు, యువత, రైతులు మహిళలను మాత్రమే నాలుగు కులాలుగా మోదీ పేర్కొన్నారు. ఇప్పుడు ఈ మిషన్​ జ్ఞాన్​తోనే ఎన్నికల్లోకి వెళ్లనున్నారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

'అభివృద్ధి కోసం దేవుడు పంపిన వ్యక్తి మోదీ'- 'ఈటీవీ భారత్'​తో శివరాజ్ సింగ్ ముఖాముఖి

'బీజేపీ అధర్మం అంతమై ధర్మం గెలుస్తుంది- దేశం వెంట దేవుడు ఉన్నాడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.