ETV Bharat / bharat

మోదీ ట్వీట్​తో కచ్చతీవుపై దుమారం- బీజేపీ, కాంగ్రెస్​ మధ్య మాటల యుద్ధం - BJP Congress Fight On Katchatheevu

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 31, 2024, 7:40 PM IST

BJP Congress Fight Over Katchatheevu : లోక్‌సభ ఎన్నికల వేళ శ్రీలంకలో ఉన్న కచ్చతీవు ద్వీపంపై రాజకీయ దుమారం చెలరేగింది. 1974లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పాక్‌ జలసంధిలో ఉన్న కచ్చతీవు ద్వీపాన్ని పూర్తి నిర్లక్ష్యంగా శ్రీలంకకు అప్పగించిందని ఓ కథనాన్ని ఉటంకిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై చేసిన ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఈ కచ్చతీవు అంశంపై చర్చ మొదలైంది. వ్యూహాత్మకంగా కీలకమైన కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు ఇచ్చేయడం వల్ల దేశ సమగ్రత, ప్రయోజనాలను కాంగ్రెస్ బలహీనం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు.

Etv Bharat
Etv Bharat

BJP Congress Fight Over Katchatheevu : తమిళనాడులోని రామేశ్వరం సమీపంలోని భారత్‌-శ్రీలంక మధ్య ఉన్న చిన్న ద్వీపమే కచ్చతీవు. పాక్‌ జలసంధిలో ఉన్న ఈ ద్వీపం రామేశ్వరానికి 19 కిలోమీటర్లు, శ్రీలంకలోని జాఫ్నాకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాదాపు 285 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూభాగం లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయ దుమారానికి కారణమైంది. ఇక్కడ ఉన్న సెయింట్‌ ఆంటోనీ చర్చిలో ఏటా ఫిబ్రవరి-మార్చి నెలల్లో వారం రోజుల పాటు ప్రార్థనలు జరుగుతాయి.

కచ్చతీవు దీవిని శ్రీలంకకు అప్పగించాలన్న 1974లోని ఇందిరాగాంధీ సర్కారు నిర్ణయంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై ఆర్టీఐ చట్టం ద్వారా సమాచారం కోరారు. దీని ఆధారంగా ప్రచురితమైన కథనాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. కచ్చతీవు దీవి విషయంలో కాంగ్రెస్‌ వైఖరిని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తప్పుపట్టారు. ఆ పార్టీ పూర్తి నిర్లక్ష్యంగా ఆ దీవిని శ్రీలంకకు ఇచ్చేసిందని ఆయన ఎక్స్‌ వేదికగా ఆరోపించారు. ఆశ్చర్యకరమైన, దేశానికి కనువిప్పు కలిగించే అంశాలు వెల్లడవుతున్నాయని అన్నారు. కాంగ్రెస్‌ నిర్లక్ష్యంగా కచ్చతీవును వదిలేసిందని, ఇది ప్రతి భారతీయుడిలో ఆగ్రహానికి కారణమైందని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, ప్రయోజనాలను బలహీనపర్చేలా 75 ఏళ్లు కాంగ్రెస్‌ పనిచేసిందని పేర్కొంటూ ఓ కథనాన్ని ఉటంకించారు. '

ఎన్నికల వేళ వివాదం
అయితే బీజేపీ తమిళనాడులో పట్టు పెంచుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సమయంలో కచ్చతీవు దీవి అంశాన్ని ప్రధాన ఆయుధంగా ఎంచుకుంది. భారత జలాల్లో మత్స్య సంపద తగ్గిపోవడం వల్ల తమిళనాడులోని రామేశ్వరంతో పాటు పరిసర జిల్లాలకు చెందిన మత్స్యకారులు చేపలు పట్టేందుకు కచ్చతీవు ద్వీపానికి వెళుతుంటారు. ఇందుకోసం వారు అంతర్జాతీయ మారిటైమ్ బోర్డర్‌ లైన్‌ను దాటి వెళ్లి శ్రీలంక నేవికి చిక్కి కటకటాలపాలవుతుంటారు. అంటే భారత ప్రాదేశిక జలాలను దాటి వెళుతుంటడం వల్ల శ్రీలంక నేవీ తమిళనాడు జాలర్లను పట్టుకొని జైళ్లలో ఉంచుతోంది. దీంతో అక్కడ ఇది రాజకీయ సమస్యగా మారింది.

అన్నామలై RTI దరఖాస్తుతో మొదలు
ఈ కారణంగా అసలు కచ్చతీవు ద్వీపం ఎవరి అధీనంలో ఉందో చెప్పాలని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆర్టీఐ దరఖాస్తు చేశారు. 1974లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పాక్‌ జలసంధిలోని కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు ఇచ్చేశారని కేంద్రం సమాధానం ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని అప్పటి విదేశాంగ శాఖ కార్యదర్శి కేవాల్‌ సింగ్‌, తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధికి కూడా తెలియజేసినట్లు కేంద్రం సమాధానమిచ్చింది. కచ్చతీవు ద్వీపం తమదే అని నిరూపించకోవడంలో శ్రీలంక వైఫల్యం చెందిందని కేవాల్ సింగ్‌ తమిళనాడు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. 1925 నుంచి కచ్చతీవుపై శ్రీలంక సార్వభౌమత్వాన్ని క్లెయిమ్ చేస్తోందని కేవాల్‌ సింగ్, తమిళనాడు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. కచ్చతీవు దాని పరిసరాల్లోని మత్స్య సంపదపై బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రామనాడ్ రాజుకు జమిందారీ హక్కులను ఇచ్చింది. 1875 నుంచి 1948 వరకు కచ్చతీవుపై రామనాడ్‌ రాజులు జమిందారీ హక్కులను కలిగి ఉన్నారు. జమీందారీ హక్కుల రద్దు తరువాత కచ్చదీవును మద్రాసు రాష్ట్రానికి అప్పగించారు.

1974లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కచ్చతీవు దీవిని శ్రీలంకకు అప్పగించిందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తెలిపారు. కచ్చతీవు దీవి దేశానికి ఎంత ముఖ్యమైన భాగమో తమిళనాడు పౌరులకే కాకుండా మిగతా రాష్ట్రాల పౌరులకు కూడా తెలుసని వ్యాఖ్యానించారు. తమిళనాడుకు కచ్చతీవు దీవి చారిత్రకంగా కీలకమైన ప్రదేశమన్న అన్నామలై, వేల ఏళ్లుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా తమిళులు దీవి పరిసరాల్లో చేపలు పట్టుకునే వారని చెప్పారు. అటువంటి ప్రాంతాన్ని శ్రీలంకకు ఏ ప్రాతిపదికన అప్పగించారని ప్రశ్నించారు. ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందానికి సంబంధించిన వివరాలను ఇవ్వాలని తాను విదేశాంగ శాఖను కోరినట్లు అన్నామలై పేర్కొన్నారు.

కాంగ్రెస్​ దేశ ఐక్యత, సమగ్రతకు వ్యతిరేకం : అమిత్​ షా
ఇందిరా గాంధీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా కాంగ్రెస్ పార్టీ భారతదేశ ఐక్యత, సమగ్రతకు వ్యతిరేకమని తేలిందని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ఆరోపించారు. 'కాంగ్రెస్​కు స్లో క్లాప్స్​! వారు ఇష్టపూర్వకంగా కచ్చతీవును వదులుకున్నారు. దాని గురించి పశ్చాత్తాపపడలేదు. కొన్ని సార్లు ఓ కాంగ్రెస్​ ఎంపీ దేశ విభజన గురించి మాట్లాడతారు. మరికొన్నిసార్లు వారు భారత సంస్కృతి, సంప్రదాయాలని కించపరుస్తారు. వారు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని మాత్రమే కోరుకుంటారు.' అని ఎక్స్​ వేదికగా అమిత్​ షా కాంగ్రెస్​పై మండిపడ్డారు.

తప్పుడు ప్రచారాలు ఆపండి : నిర్మలా సీతారామన్
కచ్చతీవు అంశంపై తమిళనాడు అధికార డీఎంకే తప్పుడు సమాచారాన్ని ఆపాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ అన్నారు. ఆర్టీఐ ద్వారా వచ్చిన రిప్లై గురించి అధికారికంగా మాజీ ముఖ్యమంత్రి జయలలిత తమిళనాడు అసెంబ్లీలో చెప్పారని ఎక్స్​లో పోస్టు చేశారు. తమిళనాడు మత్య్సకారులు ముందు ఈ ద్వీపానికి వేటకు వెళ్లేవారని, కానీ ఇందిరా గాంధీ ప్రభుత్వం హయాంలో శ్రీలంకతో భారత్​ కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా వారు అటువైపు వెళ్లకుండా నిరోధించిందని బీజేపీ ప్రతినిధి సుధాన్షు త్రివేది తెలిపారు.

కచ్చతీవును తిరిగి పొందేందుకు మీరేం చర్యలు తీసుకున్నారు? : ఖర్గే
ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తిప్పికొట్టారు. ఆయన పదేళ్ల హయాంలో కచ్చతీవును తిరిగి పొందేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ సున్నితమైన అంశాన్ని ఎన్నికల ముందు లేవనెత్తడం ఆయన నిరాశకు నిదర్శనమని అన్నారు. తూర్పు లద్ధాక్​లోని గల్వాన్​ లోయలో 20మంది ధైర్యవంతులు(సైనికులు) వారి ప్రాణాలను త్యాగం చేసిన తర్వాత, మోదీ చైనాకు ఎందుకు 'క్లీన్​ చిట్​' ఇచ్చారని ప్రశ్నించారు. నేపాల్​, భూటాన్, మల్దీవులతో సహా పొరుగు దేశాలకు సంబంధించి విదేశాంగ విధానాన్ని ఖర్గే ప్రశ్నించారు.

"మీ విదేశాంగ విధాన వైఫల్యం వల్లే పాకిస్థాన్​, రష్యా నుంచి ఆయుధాలను కొనుగోలు చేయడం చరిత్రలో ఇదే మొదటి సారి. మీ ప్రభుత్వ హయాంలో స్నేహం కారణంతో భారత్​ నుంచి 111 ఎన్​క్లేవ్​లను బంగ్లాదేశ్​కు బదిలీ చేశారు. 55 ఎన్​క్లేవ్​లు భారత్​కు వచ్చాయి. ఇదే విధంగా 1974లో కచ్చతీవుకు సంబంధించిన శ్రీలంకతో ఇదే విధమైన ఒప్పందం కుదిరింది"
--మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు

మేం దాన్ని వ్యతిరేకించాం : DMK
తాము కచ్చతీవు ఒప్పందాన్ని వ్యతిరేకించామని డీఎంకే తెలిపింది. అంతేకాకుండా భారత భూభాగంలోకి చైనా చొరబాటుకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ప్రధాని మోదీకి ఆయన సాధించిన విజయాలు ఏవీ లేవని, కేవలం అబద్ధాలు మాత్రమే ప్రచారం చేస్తున్నారని డీఎంకే కార్యదర్శి ఆర్​ఎస్ భారతి విమర్శించారు. ఒక అంశానికి సంబంధించిన పూర్తి చరిత్ర గురించి తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. 1974లో కచ్చతీవును శ్రీలంకకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ, ఖండిస్తూ డీఎంకే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించిందని తెలిపారు. పదేళ్లలో మోదీ ఎందుకు తిరిగి పొందేందుకు ప్రయత్నాలు చేయలేదని ప్రశ్నించారు.

సౌత్​​ సపోర్ట్​తో NDA టార్గెట్ రీచ్- దేశంలో బీజేపీకే ఎక్కువ TRP : నితిన్‌ గడ్కరీ - Nitin Gadkari On NDA Target 400

లోక్​సభ ఎన్నికల్లో మోదీ మ్యాచ్​ ఫిక్సింగ్- ఆ ఐదుగురితో కలిసి!: రాహుల్​ - Rahul Gandhi Fires On BJP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.