Akhand Bharat Mohan Yadav : అఖండ భారత్ కల సాకారం అయ్యేందుకు అయోధ్య రామ మందిరం ఒక ముందడుగు అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అన్నారు. అఫ్గానిస్థాన్ వరకు అఖండ భారత్ విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
"రామ మందిర నిర్మాణం 'అఖండ భారత్' దిశగా భారీ ముందడుగుగా ఉండాలని భగవంతుడి కోరిక. 30-32 ఏళ్ల పోరాటం తర్వాత ఆలయ నిర్మాణం జరుగుతోంది. ఇది దేశ ప్రజలందరి అదృష్టం. అంతకుముందు, 500 ఏళ్ల పాటు ఎన్నో తరాలుగా ఆలయం కోసం పోరాటం జరిగింది. గతంలో ఇక్కడ ఉన్న రామ మందిరాన్ని విక్రమాదిత్య నిర్మించారు. ఇది శత్రువుల కంటిలో నలుసుగా మారింది. దేశంలో పరిస్థితులు బాగాలేని సమయంలో నిరంకుశులు ఆ ఆలయాన్ని కూల్చేశారు.
అదేవిధంగా సింధు, పంజాబ్‌లను కూడా భారత్ కోల్పోయింది. 1947లో భారత్, పాకిస్థాన్ విభజన తర్వాత వాటిని దేశం నుంచి వేరు చేశారు. దేవుడు కోరుకుంటే అఖండ భారత్ మళ్లీ ఏర్పడుతుంది. ఈ రోజు కాకపోతే రేపు అయినా ఇది జరుగుతుంది. సింధు, పంజాబ్ వరకే కాదు అఫ్గానిస్థాన్ వరకు అఖండ భారత్ విస్తరిస్తుంది. నన్కానా సాహిబ్‌ను మనం చూసే రోజు వస్తుందని ఆశిస్తున్నా."
- మోహన్ యాదవ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి
నన్కానా సాహిబ్ సిక్కుల పవిత్ర స్థలం. పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో ఈ ప్రాంతం ఉంది.
అఖండ భారత్ అంటే?
భారత్‌తో పాటు ప్రస్తుత అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, మయన్మార్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక దేశాలతో కూడిన విస్తృత భౌగోళిక ప్రదేశాన్ని అఖండ భారత్‌గా వ్యవహరిస్తారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో కేఎం మున్షీ అఖండ భారత్ ప్రతిపాదన చేశారు. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, శివసేన, బీజేపీ వంటి సంస్థలతో పాటు హిందూ జాతీయవాదుల నుంచి అఖండ భారత్ డిమాండ్ వినిపిస్తుంటాయి.
పార్లమెంట్లో అఖండ భారత్!
కాగా, నూతన పార్లమెంట్ భవనంలో 'అఖండ భారత్'ను ప్రతిబింబించే మ్యాప్‌ను నెలకొల్పడం అప్పట్లో చర్చనీయాంశమైంది. పురాతన భారతదేశాన్ని సూచించే విధంగా ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ప్రాంతాలను ఇందులో చూపించారు. అఖండ భారత్ సంకల్పాన్ని ఈ మ్యాప్ సుస్పష్టం చేస్తోందని పేర్కొంటూ కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషీ అప్పట్లో ట్వీట్ చేశారు. ఆ ఫొటోను చూసేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
mohan bhagwat news: 'దేశ విభజనకు ముఖ్య కారణం అదే'
రాముడికి కానుకగా 400 కేజీల తాళం- రూ.1.65 లక్షల రామాయణం ప్రదర్శన