రాష్ట్రంలోని దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తాం : భట్టి విక్రమార్క
Published : Jan 6, 2024, 2:15 PM IST
Bhatti Vikramarka Visit Sri Venkateswara Swamy Temple : రాష్ట్రంలోని దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాకత్‌గూడెంలో ఆయన పర్యటించారు. గ్రామానికి వచ్చిన భట్టికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి శాలువాతో డిప్యూటీ సీఎంను సన్మానించారు. అనంతరం, ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని భట్టి విక్రమార్క దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మేళతాళాల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ధనుర్మాసం పురస్కరించుకుని ఆయన ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ చరిత్రను పూజారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. అదే విధంగా ప్రసిద్ధిగాంచిన కోనేరు బావిని భట్టి సందర్శించారు. కోనేరు గొప్పతనాన్ని ఆయనకు వివరించారు. వేద ఆశీర్వచనం అందించారు. దర్శనానంతరం శాలువాతో సత్కరించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయంలో పర్యటించే క్రమంలో అక్కడున్న భక్తులతో భట్టి విక్రమార్క ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.