Electricity war between BRS and Congress : రైతుప్రభుత్వంగా చెప్పుకునే కేసీఆర్ సర్కార్.. రైతులకు పదకొండు గంటలకు మించి త్రీఫేస్ కరెంట్ సరఫరా చేయడం లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దుయ్యబట్టారు. 24 గంటల విద్యుత్ సరఫరా చేసినట్లు రుజువు చేసినట్లయితే తాను రాజీనామాకు సిద్ధమని మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. నిరంతరం విద్యుత్ ఇవ్వకపోతే కేటీఆర్ రాజీనామా చేయాలని సూచించారు. భువనగిరి జిల్లాలోని బండసోమారం గ్రామంలో గల విద్యుత్ సబ్‌స్టేషన్‌ను పరిశీలించారు.
విద్యుత్ ఉద్యోగులతో కరెంట్ సరఫరా విషయంపై ఆరాతీశారు. త్రీఫేస్ కరెంట్ సరఫరా రికార్డులను పరిశీలించారు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ రైతులకు ఇచ్చిన హామీలను.. ఆచరణలో పెట్టడంలేదని విమర్శించారు. తమ ప్రభుత్వంలో రెండు దఫాలుగా.. తొమ్మిది గంటలపాటు రైతులకు ఉచితంగా, నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందించిన ఘనత కాంగ్రెస్‌కు మాత్రమే దక్కుతుందని పేర్కొన్నారు. దేశంలో రైతులకు ఉచిత విద్యుత్‌ను కాంగ్రెస్‌పార్టీ ప్రవేశపెట్టిందన్నారు.
రైతులకు 24 గంటల త్రీఫేస్ కరెంటు ఏ గ్రామంలో ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఉచిత కరెంటు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని పునరుద్ఘాటించారు. విద్యుత్ సరఫరాపై రేవంత్‌రెడ్డి చేసిన వక్రీకరించి.. రాజకీయపబ్బం గడపుకోవడానికే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలకు పిలుపునిచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలో 24 గంటల త్రీఫేస్ కరెంట్ సరఫరా అంశాన్ని పొందుపరిచినట్లు తెలిపారు.