సూర్యాపేట జిల్లా మోతె మండలంలోని రాఘవాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి మృతి చెందితే అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాకపోవడంతో సర్పంచ్ భర్త సాయంతో కూతురే అంతిమ సంస్కారాలు నిర్వహించింది. ఎర్రయ్య అనే వ్యక్తి కిడ్నీ సంబంధిత సమస్యతో శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఈ కరోనా సమయంలో ఎవరైనా మరణిస్తే చివరి చూపునకు రావడానికీ బంధువులు జంకుతున్నారు. అయినవాళ్లే దగ్గరకు రాని ఈ పరిస్థితుల్లో ఆ ఊరి సర్పంచ్ భర్త మాత్రం ఈ ఆపత్కాలంలో అన్నీ తానై అండగా నిలిచారు.
ఆపత్కాలంలో సర్పంచ్ భర్త మానవత్వం.. తండ్రికి కూతురే తలకొరివి!
కరోనా మహమ్మారి కారణంగా బంధువులు చనిపోతే చివరి చూపునకు నోచుకోవడం లేదు. ఇతర కారణాలతో మృతి చెందినా అంత్యక్రియలు నిర్వహించడానికీ ఎవరూ ముందుకు రావడం లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సూర్యాపేట జిల్లా రాఘవాపురం సర్పంచ్ భర్త మానవత్వం చాటుకున్నారు. మృతుడి అంత్యక్రియల కోసం పంచాయతీ సిబ్బందితో కలిసి పాడె మోశారు. అంత్యక్రియలకు ఎవరూ రాకపోవడం వల్ల కన్నకూతురే తలకొరివి పెట్టి తండ్రి రుణం తీర్చుకుంది.
ఆపత్కాలంలో సర్పంచ్ భర్త మానవత్వం.. తండ్రికి కూతురే తలకొరివి!
సర్పంచ్ మామిడి స్వాతి భర్త నాగార్జున గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి మృతుడి కూతురు వచ్చేలోపు ఏర్పాట్లు పూర్తి చేశారు. పంచాయతీ సిబ్బందితో కలిసి పాడే మోసిన సర్పంచ్ మానవత్వం ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. మృతుడి కూతురు తలకొరివి పెట్టి తండ్రి రుణం తీర్చుకుంది.
ఇదీ చదవండి:ఆపదలో నిట్టూర్పు.. అది చాల్లే వీరికి పిలుపు