Harish Rao On Bandi Sanjay: సర్పంచ్ల గురించి మాట్లాడే హక్కు బండి సంజయ్‌కు లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. భాజపా నాయకులు ఏ ముఖం పెట్టుకుని గ్రామాల్లో తిరుగుతున్నారని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఇప్పటికే మూడు సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా... కేంద్రం స్పందించడం లేదని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి మంత్రి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్, డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు.
కేంద్రంపై విమర్శలు గుప్పించిన హరీశ్... రూ.1,400 కోట్ల ఉపాధి హామీ బిల్లులు చెల్లించకుండా నిలిపివేశారని మండిపడ్డారు. 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి రూ.9వేల కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉన్నా... ఎందుకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదో బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వని పార్టీ భాజపా అని ధ్వజమెత్తారు. కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాకుండా చేసిన ఘనత భాజపాదే అని మండిపడ్డారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారని నిలదీశారు. తెలంగాణలో ఉద్యోగ నియామకాలు భర్తీ చేస్తున్నామని ప్రకటించారు.