స్వార్థ ప్రయోజనాలకు ప్రకృతి సంపద కనుమరుగవుతోంది. ధనార్జనే ధ్యేయంగా కొందరి ఆగడాలకు కొండలు, గుట్టలు సైతం చూస్తుండగానే స్వాహా అవుతున్నాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని తంగళ్లపల్లిలో ఇటీవల భారీ వర్షాలకు చెక్‌డ్యాం కొట్టుకుపోయింది. పునర్నిర్మాణం చేస్తున్న గుత్తేదారు సంస్థ.... చెక్‌డ్యాంలో మట్టిని నింపేందుకు సమీపంలో ఉన్న గుట్టను తవ్వేసింది. నాలుగు రోజులుగా జేసీబీలతో మట్టి తవ్వుతూ... చెక్‌డ్యాంలో నింపటమే కాకుండా ట్రాక్టర్లలో ఇతర ప్రాంతాలకు సైతం ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారు.
తంగళ్లపల్లి మోయ తుమ్మెద వాగు ఒడ్డున వేణుగోపాల స్వామి ఆలయం ఉండగా... సమీపంలో ఆలయానికి చెందిన స్థలంలో ఏపుగా పెరిగిన చెట్లతో కూడిన గుట్ట ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు కొట్టుకుపోయిన చెక్‌డ్యామ్‌ను పునర్నిర్మిస్తున్న సహ్యాద్రి గుత్తేదారు సంస్థ గుట్టను తవ్వడం మొదలు పెట్టింది. ఇలా దాదాపుగా కొండను నేలమట్టం చేశారు.