Online Betting spoils youth : కాయ్ రాజా.. కాయ్.. వంద పెట్టండి వెయ్యి గెలుచుకోండి. ఒకప్పుడు ఎక్కడో సందుగొందుల్లో గుట్టుగా సాగిపోయే ఈ బెట్టింగ్ వ్యవహారం... ఇప్పుడు పలు యూట్యూబ్ ఛానళ్లు, వెబ్‌సైట్ల ద్వారానే కాకుండా మొబైల్ యాప్‌ల రూపంలోనూ అమాయకుల జేబులు కొడుతున్నాయి. ఆన్‌లైన్‌లో తారస పడుతున్న ప్రకటనలు క్షణాల వ్యవధిలో ఖాతాలు ఖాళీ చేస్తున్నాయి. పందేల మోజులో పడి కొందరు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసుకుంటుంటే.. నష్టపోయిన మరికొందరు యువకులు మోసాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ఈ తరహా మోసాలు కలవర పెడుతున్నాయి.
నేటి ఆధునిక కాలంలో యువత తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో ఆన్‌లైన్ బెట్టింగుల్లో పెట్టుబడులు పెడుతూ క్రమంగా ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు. వీరిలో 18-40 ఏళ్ల వయసున్న వారే అధికంగా ఉంటున్నారు. స్నేహితుల మూలంగా, చరవాణి సహకారంతో చిన్నగా, సరదాగా ప్రారంభమైన ఈ మహమ్మారి ఇల్లు, గుల్ల చేసేవరకు వదలడం లేదు. తేరుకునే సరికి పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి. ఫలితంగా వీరిని నమ్ముకున్న కుటుంబీకులు దుఃఖ పీడితులు అవుతున్నారు.
ఇటీవల నల్గొండ జిల్లా చిట్యాల పట్టణానికి సమీపంలోని ఒక గ్రామంలో మురళీ అనే యువకుడు ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్, పేకాట మూలంగా ఆర్థికంగా నష్టపోయాడు. అతని తండ్రి ఎకరం వ్యవసాయ భూమిని విక్రయించి, అతను చేసిన అప్పులను తీర్చాడు. అయినా అతనిలో మార్పురాకపోగా మరోసారి బెట్టింగ్‌లకు పాల్పడి అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యకు పాల్పడి ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు.