రాష్ట్రంలోని అందరి దృష్టి హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad By Election)పై పడింది. ఇక్కడ ఎలాగైనా గెలవాలని అధికార పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. గెలుపే లక్ష్యంగా సర్వశక్తులను సమీకరించి వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందిస్తోంది. ఉపఎన్నికపై స్పష్టమైన అంచనాతో.. అన్నీ చూసుకున్న తర్వాతే ఈటల రాజేందర్(Etela Rajender)ను పార్టీ నుంచి పంపించేందుకు తెరాస సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈటల శాసనసభ్యుడిగా రాజీనామా చేసిన వెంటనే స్పీకర్ ఆమోదించారు. ఆ తర్వాత వెంటవెంటనే రాజకీయ పరిణామాలు చకచకా జరిగిపోయాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి క్యాడర్ ఈటల వెంట వెళ్లకుండా గులాబీ పార్టీ జాగ్రత్త పడింది. మంత్రి హరీశ్ రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తెర వెనక మంత్రాంగం నడుపుతున్నారు. త్వరలో ఓ మాజీ మంత్రి తెరాసలో చేరేందుకు మంతనాలు జరుగుతున్నాయి. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు.
ఈటలపై మంత్రుల మాటల యుద్ధం
ఈటలకు సానుభూతి రాకుండా తెరాస జాగ్రత్త పడుతోంది. మంత్రివర్గం నుంచి తొలగించినప్పటి నుంచే ప్రత్యక్షంగా, పరోక్షంగా విరుచుకుపడుతోంది. ఈటల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని.. మరోవైపు పార్టీకి, ప్రభుత్వానికి ద్రోహం చేశారని.. అందుకే వేటు వేశారని తెరాస జనాల్లోకి తీసుకెళ్లింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఇతర ఎమ్మెల్యేందరూ హుజూరాబాద్‌లో ప్రచారం సాగిస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో గెలుపు, ఓటములపై ప్రభావం చూపే ఎస్సీ, బీసీ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నిస్తోంది.
అభ్యర్థి ఎంపికపై ఆచితూచి
అభ్యర్థి ఎంపిక విషయంలో అనేక సమీకరణలు చేస్తూ.. ఆచితూచి వ్యవహరిస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో తెరాసకు ఈటల స్థాయి బలమైన నేత లేరనే చెప్పవచ్చు. అయితే ఎన్నిక ఏదైనా కేసీఆర్ సర్కారు అభివృద్ధి, సంక్షేమాలే గెలిపిస్తాయని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు వ్యక్తుల మధ్య ఉండవని... పార్టీల మధ్యేనని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. తెరాస, భాజపా, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని.. ఏ పార్టీ ఏం చేసిందో చెప్పుకుంటాయన్నారు. తెరాస హయాంలో జరిగిన అభివృద్ధిని ఈటల రాజేందర్ తన ఖాతాలో ఎలా వేసుకుంటారని.. ఆయన భాజపా ఏం చేసిందో మాత్రమే చెప్పాలంటున్నారు. అభ్యర్థి ఎవరైనా పార్టీని చూడాలనే కోణంలో ప్రచారం సాగుతోంది.
ఎస్సీ అభ్యర్థిని రంగంలోకి దింపుతారా..?