తెలంగాణ

telangana

మానేరుకు జలకళ .. కాళేశ్వరం వద్ద గోదావరికి భారీ వరద

By

Published : Aug 31, 2020, 8:53 AM IST

మానేరు జలాశయాలకు జలకళ వచ్చింది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యానికి చేరువలో జలాలున్నాయి. జలాశయంలోకి వరద రావడంతో గోదావరికి నీటిని విడుదల చేస్తున్నారు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద చేరుతోంది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద పుష్కర ఘాట్‌ మెట్ల వద్దకు నీటి మట్టం పెరిగింది.

godavari river
godavari river

మధ్య, దిగువ మానేరు జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. తొలుత కాళేశ్వరం ఎత్తిపోతల జలాలతో మానేరు జలాశయాలకు నీటి కళ రాగా.. ఇప్పుడు స్థానికంగా కురిసిన వర్షాలతో దిగువ మానేరు గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని వదులుతున్నారు. గతేడాది ఇదే సమయానికి దిగువ మానేరులో 3.49 టీఎంసీల నిల్వ ఉండగా.. ప్రస్తుతం పూర్తి సామర్థ్యానికి చేరువలో 23.73 టీఎంసీల జలాలున్నాయి.

దిగువకు వదులుతున్నారు

జలాశయంలోకి వరద వస్తుండటంతో దిగువన ఉన్న గోదావరికి నీరు విడుదల చేస్తున్నారు. మధ్యమానేరు జలాశయం సామర్థ్యం 25.87 టీఎంసీలకు గతేడాది ఇదే సమయానికి 14.36 టీఎంసీల నిల్వ ఉంది. ప్రస్తుతం 18.62 టీఎంసీలు ఉన్నాయి. మరోవైపు ఎగువ నుంచి శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుకు స్వల్పంగా వరద వస్తోంది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలకు గాను 82.22 టీఎంసీల జలాలు ఉన్నాయి.

మేడిగడ్డకు 2,82,800 క్యూసెక్కుల రాక

మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద చేరుతోంది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ఆదివారం ఉదయం పుష్కర ఘాట్‌ మెట్ల వరకు (9.12 మీటర్ల మేర) నీటి మట్టం పెరిగింది. ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాలతో పెన్‌గంగకు వరద పోటెత్తడంతో ఈ పరిస్థితి నెలకొందని వివరించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మి(మేడిగడ్డ) బ్యారేజీకి 2,82,800 క్యూసెక్కుల వరద వస్తుండగా మొత్తం 65 గేట్లతో అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు. సరస్వతి బ్యారేజీకి ఎగువ నుంచి 7 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా 7 గేట్ల ద్వారా నీటిని విడిచిపెడుతున్నారు. కృష్ణా పరీవాహకంలో వరద తగ్గుముఖం పట్టింది.

ABOUT THE AUTHOR

...view details