Kamareddy Bandh Today: కామారెడ్డి పురపాలక సంఘానికి నూతన బృహత్ ప్రణాళికను రూపొందించే క్రమంలో.. పరిసర ప్రాంతాల్లోని 8 గ్రామాల్లో 2 వేల170 ఎకరాల సాగు భూములను పారిశ్రామిక జోన్‌లో చేర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ రైతులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. మాస్టర్ ప్లాన్‌ను నిరసిస్తూ... రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నెల రోజులుగా ఆందోళనలు చేస్తుండగా... రెండ్రోజుల క్రితం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన రైతు రాములు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఆందోళనలకు మరింత ఆజ్యం పోసినట్లైంది.
Kamareddy Municipal Master Plan Issue Update : మాస్టర్ ప్లాన్ కారణంగానే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని... ప్రభుత్వం వెంటనే ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలంటూ... నిన్న 8 గ్రామాలకు చెందిన రైతులు కుటుంబసభ్యులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ జితేశ్ వి పాటిల్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లగా... కలెక్టరేట్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, రైతులకు జరిగిన తోపులాట తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బారికేడ్లను నెట్టేసి కలెక్టరేట్‌కు వెళ్లటంతో... ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. తోపులాటలో పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. గాయపడ్డ ఐదుగురు రైతులను, ఓ కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించారు. కలెక్టర్ వచ్చి వినతిపత్రం తీసుకోవాలని అక్కడే అర్దరాత్రి దాకా బైఠాయించిన రైతులు... వంటావార్పుతో ఆందోళన కొనసాగించారు.
కొనసాగుతున్న బంద్.. మధ్యాహ్నం కామారెడ్డికి బండి సంజయ్ : మాస్టర్ ప్లాన్ ప్రతిపాదన... కలెక్టర్ తీరును నిరసిస్తూ రైతు ఐక్యకార్యాచరణ కమిటీ బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో ఉదయం నుంచి పట్టణంలో వాహనాలు రోడ్డెక్కలేదు. వ్యాపార సంస్థల మూతపడ్డాయి. నిన్నటి ఘటనల దృష్ట్యా కామారెడ్డిలో అడుగడుగునా పోలీసులు మోహరించారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా... పలువురు నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకోగా... మరికొందరిని గృహనిర్బంధం చేశారు. ఉదయం పలువురు భాజపా నేతలు ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించగా.... పోలీసులు అడ్డుకుని, వారిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు రైతుల ఆందోళనలకు కాంగ్రెస్, భాజపా మద్దతు ప్రకటించాయి. మధ్యాహ్నం బండి సంజయ్ సహా మరికొందరు భాజపా నేతలు కామారెడ్డిలో పర్యటించి... చనిపోయిన రైతు కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
కామారెడ్డికి 2 కాంగ్రెస్ బృందాలు:కామారెడ్డి రైతుల ఆందోళనను కాంగ్రెస్ తీవ్రంగా పరిగణిస్తుంది. రైతు ఐకాస పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటించింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచన మేరకు కామారెడ్డికి 2 కాంగ్రెస్ బృందాలు వెళ్లనున్నాయి. కిసాన్ కాంగ్రెస్ నుంచి కోదండరెడ్డి, అన్వేష్‌రెడ్డి నేతృత్వంలో ఒక బృందం.. సురేశ్ షెట్కార్‌తో పాటు, సీనియర్ నాయకులతో మరో బృందం ఏర్పాటైంది. రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ అండగా ఉంటుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. పార్టీ కార్యకర్తలు బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఆయన.. మాస్టర్ ప్లాన్‌పై ప్రజాక్షేత్రంలో సభలు జరిపి రైతులతో చర్చించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను వెంటనే రద్దు చేయాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సమస్య జఠిలమైందని మండిపడ్డారు.
కామారెడ్డిలో టెన్షన్ టెన్షన్.. రైతులకు మద్దతుగా బీజేపీ, కాంగ్రెస్ ఇవీ చదవండి: