YS Sharmila Letter to Governor Tamilisai: ఆర్టికల్ 317 ప్రకారం టీఎస్ఎస్సీ బోర్డు రద్దుకు రాష్ట్రపతికి సిఫార్సు చేయాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను.. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే కొత్త బోర్డు వెంటనే ఏర్పాటు చేసేలా చూడాలని కోరారు. సంతలో సరుకులు అమ్మినట్లుగా కీలకమైన పరీక్షా పేపర్లు అమ్మారని ఆరోపించారు. ఫలితంగా 30లక్షల మంది జీవితాలతో చెలగాటం ఆడారని వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తంచేశారు.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకుల వెనుక బోర్డు చైర్మన్, సభ్యులు, ఉద్యోగుల నుంచి.. రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రుల వరకు హస్తం ఉందని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు ఆమె బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తి విశ్వసనీయతను కోల్పోయిందని విమర్శించారు. పేపర్ లీకేజీపై రాష్ట్ర సర్కార్ నియమించిన సిట్ పనితీరు నమ్మశక్యంగా లేదని వైఎస్ షర్మిల అన్నారు.
సూత్రధారులను తప్పించే విధంగా దర్యాప్తు:ఈ కేసులో పాత్రధారులను మాత్రమే దోషులుగా తేలుస్తూ.. సూత్రధారులను తప్పించే విధంగా దర్యాప్తు సాగుతోందని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈ క్రమంలోనే రాజ్యాంగంలోని ఆర్టికల్ 317 ప్రకారం టీఎస్‌పీఎస్సీ రద్దు విషయమై రాష్ట్రపతికి సిఫారసు చేయాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం ప్రకారం ఈ నిర్ణయం తీసుకొనే బాధ్యత గవర్నర్‌కి ఉందని గుర్తు చేశారు. 30 లక్షల మంది జీవితాలు.. మీ నిర్ణయం మీద ఆధారపడి ఉన్నాయని వైఎస్ షర్మిల లేఖలో ప్రస్తావించారు.
అసలేం జరిగిదంటే:రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించాయి. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల కూడా స్పందించారు. నిరుద్యోగుల పక్షాన పోరాడేందుకు ప్రతిపక్ష పార్టీలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే వివిధ పార్టీల అధ్యక్షులకు, నాయకులకు ఆమె లేఖలు రాశారు.