ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు (MLA Quota MLC) తెరాస శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో.. అభ్యర్థుల ఖరారుపై గులాబీ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. పోటీ తీవ్రంగా ఉన్నందున, గతంలో ఇచ్చిన హామీతో పాటు, సామాజిక, రాజకీయ సమీకరణలతో కుస్తీ పడుతోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపటితో నామినేషన్లు (MLA Quota MLC election nominations) ముగియనున్నప్పటికీ.. అభ్యర్థుల ప్రకటనపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసి.. నామినేషన్లకు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. నేడు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
వారిద్దరికి పక్కా..!
అసెంబ్లీలో సంపూర్ణ బలం ఉన్నందున.. ఎమ్మెల్యే కోటాలో ఆరు స్థానాలను తెరాసకే దక్కనున్నాయి. సునాయాసంగా మండలిలో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి... ఎమ్మెల్యే కోటా టికెట్ కోసం తాజా మాజీలతో పాటు.. చాలా మంది నేతలు తెరాస నాయకత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. మధుసూదనచారి, కడియం శ్రీహరి (kadiyam sriHari), ఎర్రోళ్ల శ్రీనివాస్, కౌశిక్ రెడ్డి (Kaushik reddy), కోటిరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. గుత్తా సుఖేందర్ రెడ్డి (gutta sukemdar reddy), ఎల్.రమణ (l. ramana) పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. గుత్తా సుఖేందర్ రెడ్డికి మరోసారి ఎమ్మెల్సీ పదవి ఖాయమే అయినప్పటికీ.. ఏ కోటాలో అవకాశం ఇస్తారనేది వేచి చూడాల్సిందేనని పార్టీలో ప్రచారం జరుగుతోంది. సుఖేందర్ రెడ్డి, ఎల్.రమణకు గవర్నర్ కోటా లేదా స్థానిక సంస్థల కోటాలో మండలికి పంపించే అవకాశం ఉందంటున్నారు. త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇవాళ అభ్యర్థులను ప్రకటిస్తే.. నేడే కొందరు నామినేషన్లు కూడా దాఖలు చేసే అవకాశం ఉంది.
స్పష్టత రాని స్థానిక సంస్థల కోటా అభ్యర్థుల జాబితా
మరోవైపు స్థానిక సంస్థల కోటాలో (Local body quota MLC elections) రేపట్నుంచి ఈ నెల 23 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. స్థానిక సంస్థల అభ్యర్థులపై కూడా తెరాస నాయకత్వం కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా అభ్యర్థులతో పాటు స్థానిక సంస్థల కోటా అభ్యర్థులను ఒకేసారి ప్రకటించాలా లేక ఒకట్రెండు రోజులు వేచి చూడాలా అనే తర్జనభర్జన కొనసాగుతోంది. స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైన పురాణం సతీష్ కుమార్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, భూపాల్ రెడ్డి, కల్వకుంట్ల కవిత (Kavitha), బాలసాని లక్ష్మీనారాయణ (balasani Lakshmi Narayana), భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణ్ రావు, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, సుంకరి రాజు పదవీకాలం జనవరి నాలుగో తేదీతో పూర్తి కానుంది. అందరూ మరోసారి కొనసాగాలని ఆశిస్తున్నారు.