Student Unions Protest Against TSPSC Paper Leakage : రాష్ట్రంలో ప్రకంపనలు రేపిన టీఎస్‌పీఎస్సీ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నంతా విద్యార్థి సంఘాల నిరసనలతో భగ్గుమన్న టీఎస్‌పీఎస్సీ కార్యాలయ పరిసరాలు రెండోరోజూ మరోసారి నిరసనలతో హోరెత్తిపోయాయి. ఈ ఘటనకు కారణమైన బాధ్యులను కఠినంగా శిక్షించాలని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల పెద్ద ఎత్తున కార్యాలయం ముట్టడికి తరలిరావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏబీవీపీ, ఆప్, విద్యార్థి సంఘాలు టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి తరలివచ్చి నిరసన వ్యక్తం చేశాయి.
నినాదాలతో దద్దరిల్లిన టీఎస్‌పీఎస్సీ పరిసరాలు : నిన్నటి ఆందోళనల దృష్ట్యా అప్పటికే టీఎస్‌పీఎస్సీ పరిసరాలలో వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. రెండోరోజూ విద్యార్థి సంఘాల నేతలు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీఎస్‌పీఎస్సీ వద్ద ఇవాళ మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కమిషన్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు లాక్కెళ్లి వాహనాల్లో ఎక్కించి పీఎస్‌లకు తరిలించారు. పెద్ద ఎత్తున ఆందోళనలు, నినాదాలతో టీఎస్‌పీఎస్సీ కార్యాలయ పరిసరాలు బుధవారం మరోసారి దద్దరిల్లాయి.
ఈ క్రమంలో ఏబీవీపీ కార్యకర్తలను అరెస్టు చేసి బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 'ప్రశ్నాపత్రాల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేసీఆర్ రాజీనామా చేయాలి. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేయాలి. ఏవైతే ప్రశ్నాపత్రాలు లీకయ్యాయో ఆ పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి' అని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. అదే విధంగా టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నించిన ఆప్ విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి గోషామహల్‌కు తరలించారు. కమిషన్ ముట్టడికి ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు యత్నించగా పోలీసులు అడ్డుకుని బేగంబజార్ పీఎస్‌కు తీసుకెళ్లారు.
సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలి : పేపర్ లీకేజీ ఘటనపై ఓయూలోను విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీకి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలన్నారు. ప్రశ్నాపత్రాలు లీక్ చేసి అమ్ముకుంటున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆందోళన ఉద్ధృతంగా మారడంతో పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి ఓయూ పీఎస్‌కు తరలించారు. మరోవైరు వరుస ఆందోళనల దృష్ట్యా టీఎస్‌పీఎస్సీ వద్ద మోహరించిన అదనపు బలగాల భద్రతను డీసీపీ కిరణ్ కరే పర్యవేక్షిస్తున్నారు.
ఉద్యోగార్ధుల మనోబలం దెబ్బతీయవద్దు :మరోవైపు అటు జిల్లాల్లోనూ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఖమ్మంలో పీవైఎల్, పీడిఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉద్యోగార్థులు పెద్దఎత్తున నిరసనకు దిగారు. కేంద్ర గ్రంథాలయం నుంచి మయూరి కూడలి వరకు భారీ ర్యాలీ తీశారు. అనంతరం, కూడలిలో మానవ హారంతో నిరసన వ్యక్తం చేశారు. పేపర్ లీక్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఎంతో నిరుద్యోగులు అనేక కష్టాలు పడుతూ ఉద్యోగాల కోసం రాత్రింబవళ్లు చదువుతుంటే.. ఇలాంటి ఘటనలు వారి జీవితాలను నాశనం చేసేలా మారాయన్నారు. ఉద్యోగార్ధుల మనోబలం దెబ్బతీయవద్దన్నారు.
ఆదిలాబాద్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వినాయక్‌చౌక్‌లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాసేపు విద్యార్థిన సంఘాల నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. స్థానిక సెంట్రల్ లైబ్రరీలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులు... రెండో రోజు అక్కడే ఆందోళన చేపట్టారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. గ్రంథాలయ భవనం ఎదుట నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులు... పేపర్ లీకేజ్ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: