Public Schools Facing Problems: పెచ్చులూడుతున్న పైకప్పులు.. ఎప్పుడు కూలిపోతాయో తెలియని గోడలు.. తుప్పుపట్టి బయటపడిన ఇనుప ఊచలతో పగుళ్లిచ్చిన పిల్లర్లు... ఇది రాష్ట్రవ్యాప్తంగా వందలాది సర్కారు బడుల్లో ఆందోళనకర పరిస్థితి. వాటి మరమ్మతులు, కొత్త గదుల నిర్మాణాలను పట్టించుకోని విద్యాశాఖ.. కనీసం శిథిలావస్థకు చేరిన తరగతి గదులను కూల్చివేయడంపైనా దృష్టి పెట్టడం లేదు. పాఠశాల ప్రాంగణంలోనే ఆ పాడుబడిన నిర్మాణాలు ఉండటంతో.. చిన్నారులు అటువైపు వెళ్లి ఆడుకుంటున్నారు. గట్టిగా నెడితే పడిపోయే స్థితిలో ఉన్న ఆ భవనాలతో పిల్లలకు ఎప్పుడు, ఎలాంటి హాని జరుగుతుందోనని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. వారు అటు వెళ్లకుండా కాపలా కాయాల్సి వస్తోందని వాపోతున్నారు.సమస్య విద్యాశాఖ అధికారుల ముందుకు తీసుకెళ్లినా వారు జడ్పీ అధికారులకు లేఖలు రాసి ‘మమ’ అనిపించుకుంటున్నారు.
అసలే స్థలం కరవు...
రాష్ట్రవ్యాప్తంగా 2018లోనే ఏకంగా 1600 పాఠశాలల్లో శిథిలావస్థకు చేరిన భవనాలు, తరగతి గదులు ఉన్నట్లు లెక్కతేలింది. వాటిని కూల్చివేయాలని విద్యాశాఖ ఆదేశాలిచ్చినా నేటికీ అనేకచోట్ల ఎలాంటి చర్యలూ లేవు. పాడుబడిన ఆ నిర్మాణాల సంఖ్య ఇప్పటికి కనీసం 3వేలకు చేరవచ్చని అంచనా. ఆయా బడుల్లో అవసరమైతే కొత్తవి నిర్మించాలి. లేకుంటే కూల్చివేయాలి. ఈ రెంటినీ ప్రభుత్వం చేయడం లేదు. వాటిని తొలగిస్తే కొంత స్థలం అక్కరకొస్తుందని, పిల్లలు ఆటలాడుకోవడానికి వీలవుతుందని ఉపాధ్యాయులు భావిస్తున్నారు.
కూల్చడానికీ ఎంత తంతో..