కరోనా సమయంలో పోలీసులు అందించిన సేవలకు... వారిపై చాలా మందికి గౌరవం పెరిగింది. దీన్ని అవకాశంగా మార్చుకున్నారు సైబర్ నేరస్థులు. పోలీసుల పేర్లు, ఫొటోలతో సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టిస్తున్నారు. పోలీసుల ఖాతాలోని స్నేహితులను నకిలీ ఖాతాకు జతచేసుకుంటున్నారు. ఆపై నగదు అత్యవసరమని వెంటనే తిరిగి చెల్లిస్తామని మెసేజ్‌లు పంపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా నేరాలు ఇటీవల వెలుగుచూశాయి.
తాజాగా నల్గొండ ఎస్పీ రంగనాథ్ పేరిట నగదు అత్యవసరమంటూ రాజస్థాన్ ముఠా ఫేస్బుక్లో మెస్సేజ్‌లు పెట్టారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఏపీ విజయవాడ నగరంలో ఇలాంటి మోసాలపై సైబర్ క్రైమ్ పోలీసులకు నాలుగు ఫిర్యాదులు వచ్చాయి.
స్నేహితులే టార్గెట్
'నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను ..అత్యవసరంగా రూ. 5 వేలు అవసరం' అంటూ ఓ ఆర్ ఎస్సై ఫేస్బుక్ లో తన స్నేహితునికి మెసేజ్ పంపారు. పేటీఎంలో పంపాలని నెంబర్ ఇచ్చారు. ఆ స్నేహితుడు వెంటనే ఆర్ ఎస్సైకి ఫోన్ చేసి విషయం చెప్పేసరికి ఆయన షాక్ తిన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారమిచ్చారు. సెల్‌ఫోన్ నెంబర్ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్ లొకేషన్ ఝార్ఖండ్, పేటీఎం ఖాతా అడ్రస్ పంజాబ్‌లోని లూథియానాలో ఉన్నట్లు గుర్తించారు.