తెలంగాణ

telangana

Mann Ki Baat: మోదీ మనసు గెలుచుకున్న తెలంగాణ విశేషాలివే

By

Published : Apr 29, 2023, 10:48 AM IST

Mann Ki Baat: 'మన్ కీ బాత్'.. మనసులో మాట. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ఈ కార్యక్రమం దేశ ప్రజలపై చెరగని ముద్ర వేస్తోంది. ప్రతి నెల చివరి ఆదివారం ప్రజలను ఉద్దేశించి ప్రధాని చేసే రేడియో ప్రసంగం దిగ్విజయంగా 99 ఎడిసోడ్లు పూర్తి చేసుకుంది. ఈ నెల 30న 100వ ఎపిసోడ్ జరగనుంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు సాగిన ఈ మహోత్తర కార్యక్రమంలో ప్రధాని మోదీ తెలంగాణ గురించి పంచుకున్న పలు విశేషాలను ఓసారి పరిశీలిద్దాం రండి.

Mann Ki Baat
Mann Ki Baat

Mann Ki Baat: ప్రతి నెలా చివరి ఆదివారం ఉదయం 11 గంటలు అయిందంటే చాలు అందరికీ గుర్తొచ్చే కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్‌ కీ బాత్‌. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ తన మనసులోని భావాలను వ్యక్తీకరించడానికి ఏర్పాటు చేసుకున్న ఈ వినూత్న కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. రేపు 100వ ఎపిసోడ్‌ ప్రసారం కానుంది. ఈ సందర్భంగా దేశవిదేశాల్లో ప్రజలు ఈ కార్యక్రమాన్ని వినేందుకు బీజేపీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు జరిగిన మన్‌ కీ బాత్‌లో మోదీ ప్రస్తావించిన తెలంగాణ అంశాలను ఓసారి పరిశీలిస్తే..

2015 అక్టోబర్‌ 25: స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ప్రారంభమైన నాటి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఈటీవీ, ఈనాడు సంస్థలు మనస్ఫూర్తిగా పాలు పంచుకుని ప్రజా చైతన్యం తీసుకొస్తున్నట్లు ప్రధాని మోదీ కొనియాడారు. రామోజీరావుకు వయసు మీద పడుతున్నా.. యువతను ఢీకొట్టేంత ఉత్సాహంతో ఉన్నారని ప్రశంసించారు. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని రామోజీరావు తన వ్యక్తిగత కార్యక్రమంగా తీసుకున్నారని.. ఈటీవీ ద్వారా స్వచ్ఛత గురించి విస్తృత ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మిషన్‌ కోసం తెలంగాణ, ఏపీల్లోని సుమారు 51 లక్షల మంది విద్యార్థులను ఏకతాటిపైకి తేవటంలో రామోజీ విజయవంతమయ్యారన్నారు.

2016 మే 22: రాష్ట్రంలోని రైతన్నలు మిషన్‌ భగీరథ ద్వారా కృష్ణా, గోదావరి నీటిని గరిష్ఠ స్థాయిలో ఉపయోగించుకునే ప్రయత్నం చేసినట్లు మోదీ తన మన్‌ కీ బాత్‌లో పేర్కొన్నారు.

2017 ఫిబ్రవరి 26: వరంగల్‌లో కేంద్ర తాగు నీరు, పారిశుద్ధ్య శాఖ కార్యదర్శి నేతృత్వంలో స్వచ్ఛ భారత్‌ సమావేశం జరిగిందని ప్రధాని మోదీ చెప్పారు. ఫిబ్రవరి 17, 18 తేదీల్లో హైదరాబాద్‌లో మరుగుదొడ్డి గుంతలను శుభ్రం చేయడంపై జరిగిన కసరత్తు గురించి ప్రధాని ప్రస్తావించారు.

2017 ఏప్రిల్‌ 30: సాంకేతిక పరికరాలను కాసేపు పక్కన పెట్టి.. మీకు మీరు కాస్త సమయం కేటాయించుకోవాలని ప్రజలను ఉద్దేశించి చెప్పారు. సంగీత వాయిద్య పరికరాలను నేర్చుకోవాలని సూచించారు.

2019 జూన్‌ 30: రాష్ట్రంలోని తిమ్మాయిపల్లిలో నిర్మించిన నీళ్ల ట్యాంక్‌ అక్కడి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిందని ప్రధాని మోదీ వివరించారు.

2019 జులై 28: చంద్రయాన్‌-2 గురించి మాట్లాడాలని కోరుతూ రాష్ట్రానికి చెందిన పి.అరవింద్‌ రావు అనే వ్యక్తి మై గౌవ్‌ యాప్‌ ద్వారా తనకు లేఖ రాసినట్లు ప్రధాని గుర్తు చేశారు.

2021 జనవరి 31: హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి కూరగాయల మండీ గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. (కూరగాయల వ్యర్థాల ద్వారా విద్యుత్ తయారు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.)

2021 ఫిబ్రవరి 28: రాష్ట్రానికి చెందిన చింతల వెంకట్‌ రెడ్డి అనే రైతు గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. వెంకట్‌రెడ్డి విటమిన్‌-డితో నిండిన బియ్యం, గోధుమ రకాలను కనిపెట్టి పండించినట్లు ఆయన చెప్పారు. ఇదే సమయంలో హైదరాబాద్‌కు చెందిన అపర్ణా రెడ్డి అనే మహిళ వేసిన ప్రశ్న గురించి తన ప్రసంగంలో ప్రస్తావించారు.

2021 అక్టోబరు 24: రాష్ట్రంలో డ్రోన్లతో కరోనా వ్యాక్సిన్లను తరలించిన విషయం గురించి మోదీ మన్‌ కీ బాత్‌లో ప్రస్తావించారు.

2021 డిసెంబరు 26: రాష్ట్రానికి చెందిన 84 సంవత్సరాల డాక్టర్‌ కురెల విఠలాచార్య గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. లెక్చరర్‌గా పని చేసి పదవీ విరమణ చేసిన ఆయన.. తన సొంత పుస్తకాలతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, తాను సంపాదించినదంతా దాని కోసం ధారపోసినట్లు ప్రధాని కీర్తించారు.

2022 జూన్‌ 26: పర్వతారోహకురాలు పూర్ణా మలావత్‌ గొప్పతనం గురించి మోదీ వివరించారు. 13 ఏళ్ల వయసులోనే ఎవరెస్ట్‌ శిఖరం ఎక్కిన ఘనత ఆమెకు దక్కుతుందని కీర్తించారు.

2022 జులై 31: మేడారం సమక్క-సారలమ్మ జాతర గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఇది తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి పొందిందని, గిరిజన మహిళా నాయికలు సమక్క, సారలమ్మ గౌరవార్థం ఆ జాతర జరుపుకుంటారని వివరించారు.

2022 ఆగస్టు 28: వరంగల్‌ జిల్లాలో కొత్తగా ఏర్పాటైన మంగ్త్యా వాల్య తండాలో వర్షాకాలంలో ఎప్పుడూ నీరు నిలిచిపోయే ప్రాంతాన్ని అమృత్‌ సరోవర్‌గా తీర్చిదిద్దిన విధానం గురించి మోదీ చెప్పారు.

2022 నవంబరు 27: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత సోదరుడు హరిప్రసాద్‌ తనకు చేతితో నేసిన G-20 లోగోను పంపిన విషయాన్ని మోదీ వెల్లడించారు. ఆ అద్భుత బహుమతిని చూసి ఆశ్చర్యపోయినట్లు చెప్పారు.

2023 ఫిబ్రవరి 26: తెలంగాణకు చెందిన రాజ్‌కుమార్‌ నాయక్‌ అనే వ్యక్తి రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 101 రోజుల పాటు నిర్వహించిన పేరిణి నాట్యం గురించి ప్రధాని మోదీ చెప్పారు. కాకతీయ రాజుల కాలంలో ఖ్యాతి పొందిన పేరిణీ నృత్యం ఇప్పటికీ తెలంగాణ మూలాలతో ముడి పడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీర్తించారు.

ఇవీ చూడండి..

PM Modi Mann Ki Baat : 'మన్‌ కీ బాత్‌'లో ప్రధాని నోట సిరిసిల్ల నేతన్న మాట

ప్రధాని మెచ్చిన మంగ్త్యా వాల్య తండా.. మన్ కీ బాత్​లో మోదీ ప్రశంసలు

ABOUT THE AUTHOR

...view details