ప్రపంచ అటవీ దినోత్సవాన్ని రాష్ట్ర అటవీ శాఖ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అటవీ శాఖ తరపున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ కేబీఆర్ పార్కులో వాకర్స్, సందర్శకుల కుటుంబ సభ్యులు, చిన్న పిల్లలతో కలిసి అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.శోభ, అటవీ శాఖ ఉన్నతాధికారులు మొక్కలు నాటారు. నివాస యోగ్యమైన పరిసరాల కల్పన, రానున్న తరాలకు మంచి ఆరోగ్యకరమైన వాతావరణం అందించే లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని పీసీసీఎఫ్ శోభ వివరించారు. చిన్నపిల్లల్లో అడవులు, పర్యావరణం పట్ల అవగాహన కల్పించడం వల్ల సామాజిక స్పృహ పెరుగుతుందని ఆమె వెల్లడించారు.
కుటుంబంలో ఏ వేడుక జరిగినా, ఆ సందర్భంగా పిల్లలతో ఒక మొక్క నాటించి, వాటిని పెంచే సంస్కృతిని అలవాటు చేయాలని కోరారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయ ఆక్సిజన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లో జరిగిన కార్యక్రమంలో అటవీశాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫారెస్ట్ కాలేజ్, పరిశోధనా సంస్థ విద్యార్థులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి ఒక ఎకరం స్థలంలో గంధపు మొక్కలు నాటారు.