Nagarjuna Sagar Project: ఆధునిక దేవాలయం నాగార్జునసాగర్ స్పిల్‌వే వోగీ గోతులమయమైంది. తెలుగు రాష్ట్రాల్లో 23 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే ఈ ప్రాజెక్టు మరమ్మతుల్లో జాప్యం కొనసాగుతోంది. సాగునీటితో పాటు భాగ్యనగర దాహార్తి తీర్చే ప్రధానమైన జలాశయమిది. ప్రమాదకరంగా తయారైన గుంతలను పూడ్చేందుకు ఏటా ఇంజినీర్లు ప్రతిపాదనలు పంపడం.. ఇంతలో వర్షాలు కురిసి వరద ప్రారంభం కావడం.. వాయిదా పడటం.. ఇదో అంతులేని కథలా సాగుతోంది. చాలా ఏళ్లుగా స్పిల్‌వేపై ప్రవాహం ధాటికి చిన్నచిన్న గుంతలు ఏర్పడ్డాయి. 2009లో వచ్చిన భారీ వరదలతో అవి మరింత పెద్దవయ్యాయి. ఇవి ప్రాజెక్టుకు ప్రమాదకరమేనని ఇంజినీరింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్పిల్‌వే వోగీపై గుంతలను పూడ్చేందుకు ఏటా ఇంజినీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపుతూనే ఉన్నారు. గత ఏడాది కూడా మరమ్మతులకు అంచనాలు పంపినా నిధులు విడుదల కాలేదు. ఇటీవల నీటిపారుదలశాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీలోనూ (ఎస్‌ఎల్‌ఎస్‌సీ) మరమ్మతులపై చర్చించి తీర్మానించినట్లు తెలిసింది. తక్షణం దాదాపు రూ.15.5 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. దీనికి సర్కారు ఆమోదించాల్సి ఉంది. కానీ మరమ్మతులకు ఈ ఏడాది కూడా సమయం చేజారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పూర్తిస్థాయి మరమ్మతులకు కనీసం నాలుగు నెలలైనా కావాలని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు నిధులు విడుదల చేసి టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించడానికి నెల రోజులైనా పడుతుంది. మే నెల రెండోవారం నాటికి పనులు ప్రారంభించినా జులై ఆఖరులోపు పూర్తి చేయాల్సిందే. భారీ వర్షాలు కురిస్తే పనులు కష్టమే. ఈలోగా కనీసం పెద్ద గుంతలనైనా పూడ్చితే కొంతవరకు మేలని నిపుణులు పేర్కొంటున్నారు. సాగర్ పూర్తిస్థాయి జలాశయ నిల్వ సామర్థ్యం 590 అడుగులు. క్రెస్టు స్థాయి (గేట్ల దిగువ) 546 అడుగులు. ప్రస్తుతం క్రెస్టు స్థాయి కన్నా దాదాపు రెండు అడుగులకు పైగానే నీళ్లున్నాయి. రానున్న 15, 20 రోజుల్లో మట్టం తగ్గనుంది. గేట్ల నుంచి నీళ్లు దిగువకు వచ్చే అవకాశాలు ఉండవు. ఈలోగా నిధుల విడుదల, టెండర్లు, ఇతర ప్రక్రియలు పూర్తిచేస్తే మరమ్మతులు చేయడానికి వీలుంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు. ఈ విషయమై నల్గొండ నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీరు శ్రీకాంత్‌రావును ‘ఈనాడు’ వివరణ కోరగా.. ఇప్పటికే ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని, నిధులు విడుదల కాగానే మరమ్మతులు చేపడతామని పేర్కొన్నారు.