Telangana Health Facilities: రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తయింది. కొత్త రాష్ట్రంలో వైద్యారోగ్య సేవలు మెరుగుపరిచే దిశగా ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. గడచిన ఎనిమిదేళ్లలో సర్కారు ఆస్పత్రుల పనితీరులో మార్పులు చేయటంతోపాటు ప్రజలకు ప్రభుత్వ వైద్యం పట్ల నమ్మకం పెంచేలా కృషి చేసింది. ప్రస్తుతం ప్రజారోగ్యంపై అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో తెలంగాణ మూడో స్థానంలో నిలవటం గమనార్హం. 2017లో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు పెంచే లక్ష్యంతో కేసీఆర్ కిట్‌ని ప్రారంభించిన సర్కారు... గత 8 ఏళ్లలో సుమారు 13లక్షల 29వేల మందికిపైగా కిట్‌ను అందజేసింది. 2018లో జీహెచ్ఎంసీ పరిధిలో బస్తీ వాసులకు మెరుగైన వైద్య సేవలు అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలను 15వ ఆర్థిక సంఘం ప్రత్యేకంగా ప్రశంసించింది. వైద్య పరీక్షల పేరుతో పేదల జేబుకు చిల్లు పడుతుందని గుర్తించిన ప్రభుత్వం... టీ-డయాగ్నోస్టిక్స్‌ని అందుబాటులోకి తెచ్చింది. వీటి ద్వారా సుమారు 60 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తోంది. కిడ్నీ రోగుల కోసం ఉచిత డయాలసిస్ కేంద్రాల సంఖ్యను 43కి పెంచిన తెలంగాణ సర్కారు... దేశంలోనే మొట్టమొదటి సారిగా సింగిల్ యూజ్ డయలైజర్, ట్యూబింగ్ని అందుబాటులోకి తెచ్చింది.
ప్రజలకు మెరుగైన సేవలు: గర్భవతులను యాంటీనేటల్ చెకప్‌లు, ప్రసవానంతరం ఇంటికి చేర్చేందుకు అమ్మఒడి పేరుతో ప్రత్యేక వాహనాలు, మృతదేహాల తరలింపునకు ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. కొవిడ్ కారణంగా సర్కారు వైద్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు గాను... 1,400 ఉన్న ఐసీయూ పడకలను 26 వేల 132కి పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా 24 లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులను ఏర్పాటు చేసింది. బీపీ, షుగర్ రోగులకు ఇంటికే మందులను అందించే కార్యక్రమానికి ఇటీవలే శ్రీకారం చుట్టింది. కంటి వెలుగు, హెల్త్ ప్రొఫైల్ లాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తోంది.
జిల్లాకో మెడికల్ కాలేజీ: ప్రజలకు మెరుగైన వైద్య సేవలే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోన్న సర్కారు... జిల్లాకో మెడికల్ కాలేజీ కలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో కేవలం 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా... ఇప్పటికే 4 వైద్య కళాశాలలను అందుబాటులోకి తెచ్చింది. మరో 8 నిర్మాణ దశలో ఉన్నాయి. 700 ఎంబీబీఎస్ సీట్లను 1,640కి పెంచగా... త్వరలో మరో 1,200 సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేయటంతోపాటు పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ నలుమూలల టిమ్స్ పేరుతో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, వరంగల్‌లో హెల్త్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.