తెలంగాణ

telangana

నేలమట్టమైన దక్కన్​మాల్ భవనం.. శిథిలాల తొలగింపు వేగవంతం

By

Published : Feb 5, 2023, 10:41 AM IST

Deccan Mall Demolition Video: సికింద్రాబాద్​లో ఇటీవల అగ్నిప్రమాదానికి గురైన దక్కన్​మాల్ భవనం పూర్తిగా నేలమట్టం అయింది. ఎలాంటి అపాయం లేకుండా భవనం కూల్చివేత పూర్తి కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గత నెల 19న రాంగోపాల్‌పేటలోని ఈ దక్కన్ మాల్​లో అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే.

Deccan Mall
Deccan Mall

Deccan Mall Demolition Video: సికింద్రాబాద్‌ మినిస్టర్‌ రోడ్డులో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన దక్కన్​మాల్‌ను కూల్చి వేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా నేడు దక్కన్​మాల్ భవనం పూర్తిగా నేలమట్టం అయింది. వారం రోజులుగా కూల్చివేత పనులు జరుగుతుండగా నేటితో దక్కన్ మాల్ పూర్తిగా నేలమట్టం అయింది. నేడు ఉదయం భవనం ఒక్కసారిగా ఉన్నచోటే కుప్పకూలింది. చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. అధికారులు భవనం నేలమట్టం కావడంతో శిథిలాలను తొలగించే పనులు వేగవంతం చేశారు. ఈ భవనం కూల్చివేతలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

నేలమట్టమైన దక్కన్​మాల్ భవనం

నాలుగు రోజుల క్రితం దక్కన్ మాల్ భవనాన్ని భారీ యంత్రంతో కూల్చి వేస్తుండగా.. ఒక్కసారిగా సగం భవనం కుప్పకూలింది. 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో.. అక్కడి వారంతా భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదమే తప్పింది. ఇక చుట్టుపక్కల ఇళ్లలోని వారిని అంతకుముందే అధికారులు ఖాళీ చేయించారు. దీంతో ప్రాణపాయం జరగలేదనే చెప్పవచ్చు. ఇక భవనం చుట్టు పక్కల పరిసర ప్రాంతాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

అయితే ఈ నెల 19న దక్కన్​మాల్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. భారీ అగ్ని ప్రమాదం సంభవిచండంతో ఈ భవనం నాణ్యత లోపించడం కారణంగా దీన్ని కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. కూల్చివేతకు సంబంధించి రూ. 33.86 లక్షల అంచనా వ్యయంతో టెండరు నోటిఫికేషన్‌ ఇవ్వగా..రూ.25.94లక్షలకే పని చేస్తామని ఎస్‌.కె.మల్లు కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ పని దక్కించుకుంది. మాల్‌ కూల్చివేతకు యంత్ర సామగ్రితో సిద్ధమైంది. సాయంత్రానికి జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ విభాగం ఎస్‌.కె క్రాంటాక్టును రద్దు చేసింది. టెండరులో పాల్గొని రూ.33లక్షలకు పని చేస్తామన్న మాలిక్‌ ట్రేడర్స్‌కు పని అప్పగించింది. గుత్తేదారు పొడవైన జేసీబీని తెచ్చి పనులు ప్రారంభించారు. పనులు వేగవంతంగా చేసిన సంస్థ.. ఈరోజు ఎట్టకేలకు దక్కన్ మాల్ భవనాన్ని ఎలాంటి అపాయం లేకుండా నేలమట్టం చేశారు.

ఇక ఈ భవనంలో మంటలు అంటుకుని ముగ్గురు చనిపోయినట్లు తెలుస్తోంది. భవనం మొదటి అంతస్తు లిఫ్టు సమీపంలో శిథిలాలు తొలగిస్తుండగా ఎముకల అవశేషాలు కనిపించాయి. అగ్నిమాపక సిబ్బంది, క్లూస్‌ టీం సభ్యులు వాటిని డీఎన్‌ఏ పరీక్షల కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించారు. అయితే, ప్రస్తుతం దొరికిన ఎముకల అవశేషాలు ఒక్కరివా? ఇద్దరివా? ముగ్గురివా? ఒక్కరివే అయితే.. ఎవరివి? అన్న అంశాన్ని అంచనా వేయలేకపోతున్నారు. ఇంకా రిపోర్టు రాలేదు. గల్లంతైన వారిపై స్పష్టత లభించకపోగా డీఎన్‌ఏ ఫలితాలను విశ్లేషిస్తేనే మృతుడు ఎవరు అన్న విషయం తేలే అవకాశముంది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల పరిహారాన్ని ప్రకటించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details