జిల్లా స్థాయి వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు ఎనిమిది గంటల పాటు జరిగిన సమావేశంలో అన్ని జిల్లాలకు చెందిన అధికారుల అభిప్రాయాలు తెలుసుకున్నా సీఎం... వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమం విషయంలో రెండు శాఖలు నిర్వహించాల్సిన బాధ్యతలను విడమర్చి చెప్పారు.
కనీవినీ ఎరుగని విజయాలు...
అమెరికా, చైనా, రష్యా, జపాన్, ఇజ్రాయిల్ లాంటి దేశాల్లోని విజయగాథలను ఇంతవరకు విన్నామని... కానీ, ఇప్పుడు ఆ అవసరం లేకుండా తెలంగాణ రాష్ట్రమే కనీవినీ ఎరుగని ఎన్నో అద్భుత విజయాలు సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. మిషన్ భగీరథ, 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్, రెవెన్యూలో అత్యంత జటిలమైన సమస్యల పరిష్కారం, ధరణి ద్వారా వ్యవసాయ భూములు రికార్డుల నిర్వహణ- రిజిస్ట్రేషన్లు, పల్లె ప్రగతి ఇలా ప్రతి రంగంలోనూ రాష్ట్రం ఎన్నో అద్భుత విజయాలు సాధించిందని కేసీఆర్ అన్నారు.
విప్లవాత్మక మార్పులు...
అదే తరహాలో వ్యవసాయరంగంలో కూడా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన నాడు ఏడాదికి కేవలం 35 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే పండించేవారని, కానీ నేడు కోటి పది లక్షల టన్నుల ధాన్యం రాష్ట్రంలో పండిస్తున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల కోటీ పాతిక లక్షల ఎకరాలకు సాగునీరు అందించుకుంటామని, బోర్ల ద్వారా మరో 40 లక్షల ఎకరాలకు పైగా నీరు వస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.
వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ...
ఏడాదికి నాలుగో కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ రూపాంతరం చెందుతోందని అన్నారు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ ఎంతో బలోపేతం కావాలన్న సీఎం... వ్యవసాయాధికారులు అడుగడుగునా రైతులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రెండు శాఖల పనితీరులో గుణాత్మక, గణనీయమైన మార్పు రావాలని పిలుపునిచ్చారు.
వ్యవసాయంలో పంటల మార్పిడి విధానం, యాంత్రీకరణ, ఆధునిక సాగు పద్ధతులు పెంపొందించేందుకు వ్యవసాయశాఖ తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు పండించిన పంటలను మార్కెట్లో అమ్ముకునేందుకు సరైన పద్ధతులు అవలంభించే బాధ్యత మార్కెటింగ్ శాఖపై ఉందని ముఖ్యమంత్రి చెప్పారు.
పంట మార్పిడి విధానం...
రైతులు ఎప్పుడూ ఒకే పంట వేసే విధానం పోయి పంట మార్పిడి విధానం రావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పంట మార్పిడి వల్ల ఉత్పత్తి పెరిగి లాభాలు వస్తాయని అన్నారు. పంటల సాగులో ఆధునిక పద్ధతులు రావాల్సిన అవసరం ఉందన్న సీఎం... ఈ అంశాలపై రైతులకు వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,600 క్లస్టర్లలో నిర్మించిన రైతువేదికలను వెంటనే వినియోగంలోకి తీసుకొచ్చి రైతులతో సమావేశాలు నిర్వహించాలని చెప్పారు.