తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫ్రెంచ్​ ఓపెన్​: రెండో రౌండ్​కు చేరిన జకోవిచ్​

ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలవాలనే పట్టుదలతో ఉన్న టాప్‌ సీడ్‌ జకోవిచ్‌ ఆ దిశగా తొలి అడుగు వేశాడు. ప్రత్యర్థిని చిత్తు చేస్తూ అలవోకగా రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. నాలుగో సీడ్‌ మెద్వెదెవ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్‌ ప్లిస్కోవా శుభారంభం చేసింది.

Novak Djokovic Eases Into Roland Garros Second Round
ఫ్రెంచ్​ ఓపెన్​: రెండో రౌండ్​కు చేరిన జకోవిచ్​

By

Published : Sep 30, 2020, 6:41 AM IST

ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా) రొలాండ్‌ గారోస్‌లో శుభారంభం చేశాడు. ఏకపక్షంగా సాగిన తొలి రౌండ్లో అతడు 6-0, 6-2, 6-3తో మికైల్‌ మెర్‌ (స్వీడన్‌)ను మట్టికరిపించాడు. మ్యాచ్‌లో జకోవిచ్‌ రెండు ఏస్‌లు, 32 విన్నర్లు కొట్టాడు. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన అతడు.. ఐదు గేములు మాత్రమే కోల్పోయాడు. జకోవిచ్‌ తొమ్మిది సార్లు ప్రత్యర్థి సర్వీసును బ్రేక్‌చేశాడు. యూఎస్‌ ఓపెన్‌లో ఫేవరెట్‌గా ఉన్న జకో.. నాలుగో రౌండ్‌ సందర్భంగా అనుకోకుండా లైన్‌ జడ్జ్‌ను బంతితో కొట్టడం వల్ల అనర్హతకు గురైయ్యాడు.

నాలుగో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా)కు షాక్‌ తగిలింది. మొదటి రౌండ్లో అతడు 4-6, 6-7 (3-7), 6-2, 1-6తో ఫుస్కోవిచ్‌ (హంగేరి) చేతిలో కంగుతిన్నాడు. ఏడో సీడ్‌ బెరెటిని (ఇటలీ) రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. తొలి రౌండ్లో అతడు 6-3, 6-1, 6-3తో పొప్సిల్‌ (కెనడా)ను చిత్తు చేశాడు. ఇతర మ్యాచ్‌ల్లో పొల్మాన్స్‌ (ఆస్ట్రేలియా) 6-2, 6-2, 3-6, 6-3తో హంబెర్ట్‌ (ఫ్రాన్స్‌), గారిన్‌ (చిలీ) 6-4, 4-6, 6-1, 6-4తో కొచ్రీబర్‌ (జర్మనీ)పై, హారిస్‌ (దక్షిణాఫ్రికా) 6-4, 6-4, 7-6 (9-7)తో పొపిరిన్‌ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించారు. కర్బాలెస్‌ బయేనా, అండర్సన్‌, డేవిడోవిచ్‌, బెరాంకిస్‌, లజోవిచ్‌ రెండో రౌండ్లో ప్రవేశించారు.

కెనిన్‌ ముందంజ

మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్‌ ప్లిస్కోవా (చెక్‌), నాలుగో సీడ్‌ కెనిన్‌ (అమెరికా) రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. తొలి రౌండ్లో ఇద్దరూ కాస్త కష్టపడ్డారు. ప్లిస్కోవా 6-7 (9-11), 6-2, 6-4తో షెరిఫ్‌ (ఈజిప్ట్‌)పై విజయం సాధించింది. తొలి సెట్‌ను కోల్పోయాక ప్లిస్కోవా బలంగా పుంజుకుంది. మ్యాచ్‌లో ఆమె ఐదు ఏస్‌లు, 45 విన్నర్లు కొట్టింది. ఎనిమిది డబుల్‌ ఫాల్ట్‌లు కూడా చేసింది. మరో మ్యాచ్‌లో కెనిన్‌ 6-4, 3-6, 6-3తో సమ్సోనోవా (రష్యా)పై నెగ్గింది. మ్యాచ్‌లో కెనిన్‌ నాలుగు ఏస్‌లు, 26 విన్నర్లు కొట్టింది. ఇతర మ్యాచ్‌ల్లో టాసన్‌ (డెన్మార్క్‌) 6-4, 3-6, 9-7తో బ్రాడీ (అమెరికా)పై, రిబకినా (కజకిస్థాన్‌) 6-0, 6-3తో కిర్‌స్టీ (రొమేనియా)పై విజయం సాధించారు. హెదర్‌ వాట్సన్‌, కోలిన్స్‌, బొద్గాన్‌, ఉత్వాంక్‌, ఒస్తాపెంకో కూడా తొలి రౌండ్‌ను అధిగమించారు. 26వ సీడ్‌ వెకిచ్‌, 28వ సీడ్‌ కుజ్‌నెత్సొవ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు.

లారా సీగ్మండ్​

పాపం మ్లదనోవిచ్‌

లారా సీగ్మండ్‌ (జర్మనీ) 7-5, 6-3తో మ్లదనోవిచ్‌పై నెగ్గింది. అయితే ఛైర్‌ అంపైర్‌ కారణంగానే తాను ఓడానని మ్లదనోవిచ్‌ ఆరోపించింది. మ్లదనోవిచ్‌ 5-1తో సెట్‌ పాయింట్‌ ముంగిట ఉన్నప్పుడు లారా కొట్టిన షాట్‌ వివాదాస్పదంగా మారింది. బంతి రెండు బౌన్సులు పడ్డాక ఆమె రిటర్న్‌ చేసింది. అది గమనించని ఛైర్‌ అంపైర్‌ లారాకు పాయింటు కేటాయించింది. బంతి రెండుసార్లు నేలపై పడిందని మ్లదనోవిచ్‌ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అక్కడి నుంచి అసాధారణంగా ఆడిన లారా ఆ సెట్‌ను గెలుచుకోవడం సహా.. ఆ తర్వాతి సెట్‌నూ నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. "టెన్నిస్‌లోనూ ఫుట్‌బాల్‌ తరహాలో వీడియో సాంకేతికతను ప్రవేశపెట్టాలి. అంపైర్‌ ఎలా పొరపాటు చేసిందో అర్థం కావడం లేదు. టోర్నీలో లారా కొనసాగుతోంది. దురదృష్టవశాత్తు నేను నిష్క్రమించాను" అని మ్లదనోవిచ్‌ వాపోయింది.

ABOUT THE AUTHOR

...view details