టీమ్ఇండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన ఘనత మాజీ సారథి ధోనీకి(ms dhoni) మాత్రమే దక్కుతుంది. కాగా, దాదాపు 60టెస్టులో 36 మ్యాచ్లు గెలిచి, ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయం సాధించిన రికార్డు ప్రస్తుతం కెప్టెన్ కోహ్లీది(Kohli). ఇద్దరూ గొప్ప ఆటగాళ్లు, సారథులుగా.. ఎన్నో ఘనతలను, ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే తాజాగా సోషల్మీడియాలో అభిమానులతో ముచ్చటించిన ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖేల్ వాన్.. వీరిద్దరిలో ఎవరూ గొప్ప కెప్టెన్ అనే విషయమై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. దీంతో సహా త్వరలో జరగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final), ఇంగ్లాండ్ సిరీస్(England Series) గురించి కూడా మాట్లాడాడు.
"ధోనీ.. వన్డే సిరీస్లో అన్ని నైపుణ్యాలు కలిగిన ఓ గొప్ప నాయకుడు. ముఖ్యంగా టీ20లో బెస్ట్ కెప్టెన్. టీమ్ఇండియాకు దొరికిన ఓ వరం. అయితే విరాట్ కూడా ఓ ఉత్తమ సారథి. టెస్టు జట్టును తన తెలివితేటలతో అద్భుతంగా నడిపిస్తున్నాడు. అయితే అన్ని ఫార్మట్లలో కలిపి వీరిద్దరిలో ఒకరిని ఎంపిక చేయాల్సి వస్తే మహీనే గొప్ప నాయకుడు అని నా భావన."
-మైఖేల్ వాన్,ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్.
జూన్ 18 నుంచి న్యూజిలాండ్తో జరగబోయే ప్రపంచటెస్టు ఛాంపియన్షిప్ ఫైన్లో కోసం భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. టీమ్ఇండియాకు విజయాన్ని అందించి చరిత్రలో ఉత్తమ సారథిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి కోహ్లీకి ఈ మ్యాచ్ గొప్ప అవకాశముని అన్నాడు వాన్.