2019 ప్రపంచకప్ కోసం 4వ స్థానంలో ఆడించేందుకు ఎవరిని ఎంచుకోవాలా? అని సెలక్షన్ కమిటీ పడ్డ తర్జనభర్జన అంతా ఇంతా కాదు. తెలుగు ఆటగాడు అంబటి రాయుడినే ఎన్నుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను ఎంచుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. రాయుడిని పక్కన పెట్టడంపై సెలక్షన్ కమిటీ తీవ్ర విమర్శలకు గురైంది. అనంతరం సమాధానమిస్తూ ఆల్‌రౌండర్ అయిన విజయ్ శంకర్ మూడు రకాలుగా ఉపయోగపడతాడని ఎమ్మస్కే ప్రసాద్ పేర్కొన్నారు. సెలక్షన్ కమిటీ నిర్ణయంపై తీవ్రంగా కలత చెందిన అంబటి రాయుడు దీనిపై వ్యంగ్యంగా స్పందించాడు. ఆట కోసం 'త్రీడీ' అద్దాలతో ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు ఈ మధ్యే వీడ్కోలు పలికిన మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా సెలక్షన్ కమిటీ నిర్ణయంపై తాజాగా స్పందించాడు. 4 స్థానంలో రాయుడినే తీసుకుని ఉండాల్సిందిగా పేర్కొన్నాడు. రాయుడు జట్టులో ఉంటే ప్రపంచకప్ గెలిచేవాళ్లమని అన్నాడు.