ఎవరు సినిమా తీస్తే ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుందో... అతడే పూరీ జగన్నాథ్. సినిమాను విభిన్న శైలిలో తీస్తూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడీ డైరక్టర్. మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన పూరీ.. నేడు 55వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా పూరీపై ప్రత్యేక కథనం.
పూరీ జగన్నాథ్ కామన్ డిస్ప్లే పిక్షర్ తిట్లే అతడి సినిమా టైటిల్స్..!
పోకిరి, ఇడియట్, దేశముదురు ఇలాంటి వాటిని టైటిల్స్‌గా పెట్టాలంటే ఎవరైనా ఆలోచిస్తారు. కానీ పూరీ మాత్రం వీటినే టైటిల్స్‌గా పెట్టి హిట్లు కొట్టాడు.ఇంటి పేరు పూరీ కాదు..! ఈ దర్శకుడు ఇంటి పేరు పెట్ల. కానీ పూరీ జగన్నాథ్ గానే అందరికీ సుపరిచితం. పూరీ జగన్నాథుడు ఆరాధ్య దైవం కావడం వల్లే ఆ పేరు పెట్టుకున్నాడు.
ఆర్జీవీ అసిస్టెంట్‌గా ఇండస్ట్రీలోకి
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సహాయకుడిగా సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చాడు పూరీ.
తెలుగులో పలు చిత్రాలను తెరకెక్కించిన ఈ దర్శకుడు కన్నడలోనూ పనిచేశాడు. పునీత్ రాజ్‌కుమార్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది పూరీనే కావడం విశేషం. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌తోనూ పనిచేసిన ఘనత ఈ డైరెక్టర్ సొంతం.
పవన్‌తో సినీ కెరీర్ ప్రారంభం
తన కెరీర్‌ను పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ 'బద్రి'తో ఆరంభించిన పూరీ జగన్నాథ్.. ఆ తర్వాత బాచి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, ఆంధ్రావాలా, పోకిరి, బుజ్జిగాడు, దేశముదురు, నేనింతే, గోలీమార్, బిజినెస్‌మేన్, ఇద్దరమ్మాయిలతో, హార్ట్ ఎటాక్, టెంపర్, మెహబూబూ, 'ఇస్మార్ట్ శంకర్' వంటి సినిమాలతో గుర్తింపు పొందాడు.
'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' చిత్రానికి ఉత్తమ సంభాషణ రచయితగా నంది అవార్డు గెలుచుకున్నాడు పూరీ జగన్నాథ్. 'పోకిరి' సినిమాకు ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డు, సంతోషం అవార్డు అందుకున్నాడు. 'నేనింతే' సినిమాకి ఉత్తమ సంభాషణ రచయితగా మరో నంది పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమా తీస్తున్నాడు పూరీ. ఈ చిత్రానికి 'ఫైటర్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. మరోవైపు లాక్డౌన్ సమయంలో ఆకలి, నిద్ర, భయం, చదువు, ప్రేమ, పెళ్లి తదితర సామాజిక అంశాలపై పాడ్‌కాస్ట్‌లను యూట్యూబ్ ఛానెల్లో విడుదల చేశాడు. తనదైన స్టైల్లో పూరీ చెప్పే మాటలకు యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు.