తెలంగాణ

telangana

కరోనా రాసిన స్క్రిప్ట్‌ ఇది! బై.. బై 2020

By

Published : Dec 24, 2020, 11:25 AM IST

2020 ఘనంగా మొదలైంది. ఆరంభంలోనే బాక్సాఫీసు దగ్గర మెరుపులు కనిపించాయి. ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. సినీ ప్రేమికుడు ఒకటి తలిస్తే, కరోనా మరో రకంగా స్క్రిప్టు రాసేసింది. ఫలితంగా వినోదం వాయిదా పడింది. లేదంటే 2020 బోలెడన్ని రికార్డులకి వేదికయ్యేది. ఇంతకీ ఈ ఏడాది వాయిదా పడిన ఆ వినోదం సంగతేమిటో చూద్దాం.

which movies are postponed in 2020 in telugu film industry
కరోనా రాసిన స్క్రిప్ట్‌ ఇది! బై.. బై 2020

కొత్త ఏడాది వస్తోందంటే చాలు.. 'అగ్రతారల సినిమాలు ఏమేం రాబోతున్నాయి?' అంటూ ఆరా తీయడం మొదలు పెడతారు సినీ ప్రేమికులు. సంక్రాంతి హీరోలు ఎవరు? వేసవికి ఎవరు మురిపిస్తారు? దసరా బుల్లోడు అనిపించుకునేది ఎవరు? దీపావళి సందడి ఎలా ఉంటుంది? ఏడాది క్లైమాక్స్‌ మాటేమిటి? అంటూ ఆయా సీజన్లు, విడుదలయ్యే సినిమాలు, తెరపై సందడి చేసే తారల గురించి ఆసక్తిగా ఎదురు చూడటం షురూ అవుతుంది. తారల సినిమాలు సృష్టించే రికార్డులతో అభిమానులు సంతోషంలో మునిగి తేలుతుంటారు.

రికార్డులు.. లాభనష్టాల మాటెలా ఉన్నా - ఏటా చిత్రసీమ ఏదో ఒక రకంగా ఎదుగుతూ ఉంటుంది. అందుకే ఫలితాలతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహాన్ని కూడగట్టుకుని ముందడుగు వేస్తుంటుంది. కానీ, కరోనా ప్రభావం వల్ల ఈ ఏడాదిలో ఆ వినోదాల సరదాకు దూరమయ్యారు తెలుగు సినీ అభిమానులు. చాలా సినిమాల వాయిదాపడ్డాయి. మరి ఆ వాయిదా పడిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

అగ్రతారల సినిమాలకూ బ్రేక్​..

సంఖ్య పరంగా అగ్ర తారల సినిమాలు తక్కువే. కానీ వాటికున్న బలమే వేరు. అందుకే అభిమానులతోపాటు.. పరిశ్రమకీ ఆ సినిమాలపై చాలా ఆశలు, అంచనాలుంటాయి. అలా కొండంత ఆశలతోనే 2020 సినిమా క్యాలెండర్‌ మొదలైంది. సంక్రాంతి సినిమాలు 'అల వైకుంఠపురములో', 'సరిలేరు నీకెవ్వరు' మొదలుకొని.. 'ఆర్‌.ఆర్‌.ఆర్‌', 'రాధేశ్యామ్‌', 'ఆచార్య', బాలకృష్ణ - బోయపాటి చిత్రం, 'వకీల్‌సాబ్‌', 'వైల్డ్‌ డాగ్‌', 'నారప్ప'.. ఇలా ప్రేక్షకుల్ని ఊరించిన సినిమాలెన్నో. ప్రతి సీజన్‌లోనూ సినిమాలు కనిపించాయి. సినీ ప్రేమికుడు ఒకటి తలిస్తే, కరోనా మరో రకంగా స్క్రిప్టు రాసేసింది. దాంతో విడుదలలే కాదు, చిత్రీకరణలూ ఆగిపోయాయి. కరోనా లేకపోయుంటే ఈ సినిమాలన్నీ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చేవి. అవి సాధించిన రికార్డులు.. వాటిలో తప్పొప్పులు, మంచి చెడుల గురించి మాట్లాడుకుంటూ కొత్త ఏడాదివైపు చూసేవాడు ప్రేక్షకుడు.

ఖాతా తెరవనేలేదు

ఈ ఏడాదికి రెండు సినిమాలైనా పూర్తి చేయాల్సిందే అనే లెక్కలతోనే క్యాలెండర్‌ని ఆరంభిస్తారు కథానాయకులు. ట్వంటీ ట్వంటీల్లో ఆటలాగే అదరగొట్టాలనే మన స్టార్లు ఈ ఏడాది ఆరంభంలో జోరుమీద కనిపించారు. 'అల వైకుంఠపురములో' చిత్రంతో అదరగొట్టిన అల్లు అర్జున్, ఆ వెంటనే సుకుమార్‌ చిత్రం కోసం రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఈ ఏడాదిలోనే ఆయన రెండో చిత్రమూ విడుదలవుతుందని అనుకున్నారంతా. 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత మహేష్‌ అంతే వేగంతోనే కనిపించారు. కానీ వీరి ప్రణాళికల్ని కరోనా తారుమారు చేసింది. అయితే వీళ్లైనా ఖాతాని ఆరంభించారు. మిగిలిన తారలు అదీ లేదు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్న 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'ని ఈ ఏడాది జులై 30న విడుదల చేయాలనుకున్నారు. కరోనావల్ల ఆ సినిమా మరోసారి వాయిదా పడింది. దాంతో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు బాక్సాఫీసు దగ్గర స్కోరేమీ నమోదు చేయకుండానే ఈ ఏడాదిని పూర్తి చేశారు. ఎన్టీఆర్‌ నుంచి గతేడాది సినిమాలేవీ రాలేదు. ప్రభాస్‌ 'రాధేశ్యామ్‌'ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. కరోనాతో అది సాధ్యం కాలేదు. అలా సినిమాలు లేని మరో సంవత్సరం పూర్తి చేశారు. లాక్‌డౌన్‌ తర్వాత మాత్రం ఆయన కొత్త సినిమాల ప్రకటనలతో అభిమానుల్లో సంతోషాన్ని నింపారు.

ప్రభాస్​, ఎన్టీఆర్​, రామ్​ చరణ్​

మరి సీనియర్లు?

అగ్రకథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ల నుంచీ ఈ ఏడాది సినిమాలేమీ రాలేదు. కరోనా లేకపోయుంటే ఆ నలుగురూ ఈ ఏడాదిలో కొత్త చిత్రాలతో సందడి చేసేవారే. చిరంజీవి కథానాయకుడిగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య'ని దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకున్నారు. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమానీ దసరా లేదంటే డిసెంబరులో విడుదల చేయాలనుకున్నారు. వెంకటేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న 'నారప్ప' చిత్రీకరణ జోరు చూశాక వేసవిలోనే విడుదల కావొచ్చని అంచనా వేశారు. నాగార్జున 'వైల్డ్‌డాగ్‌' అంతే వేగంగా షూటింగ్‌ జరిగింది. ఇవన్నీ కరోనాతో ఆగిపోయాయి. నాగార్జున మాత్రమే తన 'వైల్డ్‌డాగ్‌' సినిమాని పూర్తి చేశారు. మిగిలినవాళ్లంతా కొత్త ఏడాదిలోనే పూర్తి చేసి విడుదల చేయబోతున్నారు. పవన్‌ కల్యాణ్‌ కాస్త విరామం తర్వాత కెమెరా ముందుకొచ్చారు. పవన్‌ రీ ఎంట్రీ ఇవ్వడం వల్ల ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ 'వకీల్‌సాబ్‌' గురించి ఎదురు చూశారు. ఈ ఏడాది వేసవిలోనే ఆ సినిమా విడుదల కావల్సి ఉండగా, కరోనా దెబ్బ కొట్టింది.

పవన్​ కల్యాణ్​, బాలకృష్ణ, నాగార్జున

కుర్రకారు జోరుకి బ్రేక్‌

ఏటా రెండు మూడు సినిమాలతో సందడి చేసే కథా నాయకుడు నాని. ఈసారీ అదే ప్రణాళికలతో సంవత్సరాన్ని ఆరంభించారు. ఆయన 'వి' ఓటీటీ వేదికపై విడుదలైంది. నితిన్‌ 'భీష్మ'తో ఈ ఏడాది విజయాన్ని నమోదు చేశారు. 'రంగ్‌దే', 'చెక్‌' రావల్సి ఉండగా, అవి వచ్చే ఏడాదికి వాయిదాపడ్డాయి. అఖిల్‌ 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌', వరుణ్‌తేజ్‌ బాక్సింగ్‌ చిత్రం, విజయ్‌ దేవరకొండ 'ఫైటర్‌(వర్కింగ్‌ టైటిల్‌)', శర్వానంద్‌ 'శ్రీకారం', వైష్ణవ్‌ తేజ్‌ 'ఉప్పెన' ఇలా పలు కీలకమైన చిత్రాలు విడుదల కావల్సి ఉండగా అవన్నీ వాయిదా పడ్డాయి. సాయి తేజ్‌ 'సోలో బ్రతుకే సో బెటర్‌' మాత్రం ఈ క్రిస్మస్‌ సందర్భంగా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆ సినిమా మంచి ఫలితం సాధిస్తే పరిశ్రమ కూడా కరోనాతో ఎదురైన చేదు అనుభవాన్ని మరిచిపోయి, కొత్త ఏడాదిలోకి ఉత్సాహంగా అడుగు పెట్టే అవకాశాలున్నాయి.

ఇదీ చూడండి:ఓటీటీ.. నీకు ఇంత క్రేజ్ ఎందుకమ్మా?

ABOUT THE AUTHOR

...view details