తెలంగాణ

telangana

చిత్రీకరణలో అడుగుపెట్టిన అందాల భామలు

By

Published : Sep 8, 2020, 6:53 AM IST

కరోనాతో వచ్చిన అనూహ్య విరామానికి దాదాపు శుభం కార్డు పడినట్లే. లాక్‌డౌన్‌తో కళ తప్పిన సినీ పరిశ్రమ తిరిగి కోలుకుంటోంది. చిత్రీకరణలు మొదలు కావడం వల్ల.. సినీతారలంతా ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. ముఖ్యంగా ఇన్నాళ్లూ వంటింట్లో గరిటెలు తిప్పుతూ.. ఆన్‌లైన్‌ క్లాస్‌లు, ఓటీటీ వినోదాలతో కాలక్షేపం చేసిన నాయికలంతా మేకప్‌ వేసుకొని ఉత్సాహంగా సెట్లోకి అడుగుడుతున్నారు. మరి ప్రస్తుతం చిత్రీకరణల్లో సందడి చేస్తోన్న స్టార్‌ నాయికలెవరు.? త్వరలో సెట్స్‌పైకి రానున్న అందాల భామలెవరు? చూద్దాం...

The heroines participating in the filming after the lock-down break
చిత్రీకరణలో అడుగుపెట్టిన అందాల భామలు

హీరోలతో పోల్చితే.. హీరోయిన్‌ల డైరీల్లో 'తీరిక' అనే పదానికి చాలా తక్కువ చోటు ఉంటుంది. అగ్ర కథానాయకులు ఏడాదికి ఒకటి రెండు చిత్రాలకే పరిమితమైతే.. స్టార్‌ నాయికలు పలు భాషల్లో ఏడాదికి కనీసం నాలుగైదు చిత్రాలతో బిజీగా గడిపేస్తుంటారు. ఒకవేళ ఎప్పుడైనా కాస్త సమయం దొరికితే ఫొటో షూట్లు, వాణిజ్య ప్రకటనలతో కాలక్షేపం చేసేస్తుంటారు. అందుకే కరోనా - లాక్‌డౌన్‌ పరిస్థితులతో దొరికిన విరామాన్ని వెండితెర చక్కనమ్మలు మరింతగా ఆస్వాదించే ప్రయత్నం చేశారు. కొందరు వంటింట్లో దూరి పాకశాస్త్రంలో పావీణ్యం సంపాదించే ప్రయత్నం చేస్తే.. మరికొందరు ఆన్‌లైన్‌ క్లాస్‌లు, ఓటీటీ వినోదాలతో కాలక్షేపం చేశారు. ఇప్పుడు చిత్రీకరణల సందడి మొదలు కావడం వల్ల.. తిరిగి పనిలో దిగేందుకు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు అందాల భామలు.

నిజానికి ఈ కరోనా పరిస్థితులు చూశాక.. "అగ్ర కథానాయికలు అంత త్వరగా సెట్స్‌లోకి అడుగుపెట్టే సాహసం చేస్తారా?" అనే అనుమానాలు అందరిలోనూ తలెత్తాయి. కానీ, "మేం బెదిరేది లేదు.. చూపిస్తాం జోరు" అంటూ.. కీర్తి సురేశ్​, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ లాంటి స్టార్‌ నాయికలు ఇప్పటికే సెట్స్‌లోకి అడుగు పెట్టడం చిత్రసీమలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

కీర్తీ సురేశ్​

గుడ్​లఖ్​ కీర్తి

ప్రస్తుతం కీర్తి సురేశ్​ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'గుడ్‌లక్‌ సఖీ'. ఈ సినిమా భాగ్యనగరంలోనే శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. నగేష్‌ కునూర్‌ దర్శకుడు. ఇప్పటికే తుది దశ చిత్రీకరణకు చేరుకుంది. మరికొద్ది రోజుల్లో షూటింగ్​ పూర్తి చేసి సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

రకుల్​ప్రీత్​ సింగ్​

ట్రెక్కింగ్​ చేస్తూ షూటింగ్​కు

క్రిష్‌ దర్శకత్వంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తున్న కొత్త చిత్రం వికారాబాద్‌ అడవుల్లో చిత్రీకరణ జరుపుకొంటోంది. ఇందులో ఆమె యువ హీరో వైష్ణవ్‌ తేజ్‌కు జోడీగా నటిస్తోంది. ఈ సినిమా కోసం రోజూ సరదాగా దాదాపు రెండు కిలోమీటర్లు ట్రెక్కింగ్‌ చేస్తూ.. చిత్రీకరణ ప్రాంతానికి చేరుకుంటోందట రకుల్‌. అక్టోబరు కల్లా షూటింగ్​ పనులన్నీ పూర్తి చేసి.. సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని భావిస్తోంది చిత్రబృందం .

నభా నటేష్​

సాయితేజ్​తో నభా

లాక్‌డౌన్‌లో పెయింటింగ్‌లు, ఆన్‌లైన్‌ క్లాస్‌లతో కాలక్షేపం చేసిన యువ నాయిక నభా నటేష్‌.. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో సందడి చేస్తోంది. ప్రస్తుతం ఆమె సాయి తేజ్‌కు జోడీగా నటిస్తోన్న చిత్రం 'సోలో బ్రతుకే సో బెటరు'. ఈ సినిమా పాటల చిత్రీకరణ ఫిల్మ్‌ సిటీలోనే జరుగుతోంది.

సాయి పల్లవి
సయామీ ఖేర్​

తుదిదశలో చిత్రీకరణలు

నాగార్జున నటిస్తోన్న 'వైల్డ్‌డాగ్‌' చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది. భాగ్యనగరంలోనే జరుగుతోన్న ఈ చిత్రీకరణలో నాయికలు దియా మీర్జా, సయామీ ఖేర్‌ పాల్గొంటున్నారు. సోమవారం 'ఎ1 ఎక్స్‌ప్రెస్‌' చిత్రం కోసం సెట్లోకి అడుగుపెట్టింది లావణ్యా త్రిపాఠి. 'క్రాక్‌' చిత్రీకరణ కోసం నాయిక శ్రుతిహాసన్‌ ఇప్పటికే హైదరాబాద్​ చేరుకోగా.. ఈ వారాంతంలోనే 'లవ్‌స్టోరీ' చిత్రం కోసం భాగ్యనగరానికి రాబోతుంది కథానాయిక సాయిపల్లవి. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు తుది దశ చిత్రీకరణలోనే ఉన్నాయి.

శ్రుతి హాసన్​
దియా మీర్జా

ABOUT THE AUTHOR

...view details