మా సినిమా స్క్రిప్టు దశలో ఉంది. మా సినిమా సెట్స్‌పై ఉంది, లేదంటే నిర్మాణానంతర పనుల్లో ఉందనే మాటలు చిత్ర పరిశ్రమలో తరచూ వినిపించేవే. అలా హీరోయిన్ల ఎంపిక కసరత్తుల్లో ఉండే సినిమాల జాబితా కూడా చాంతాడంత. కథలు సిద్ధంగా ఉంటాయి. హీరోలూ పచ్చజెండా ఊపేస్తారు. ఎప్పుడంటే అప్పుడు సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు నిర్మాత ఎదురు చూస్తుంటాడు. కానీ హీరోయిన్ ఎంపికే ఎంతకీ పూర్తవ్వదు. అలా జోడీ కుదరక నెలలు నెలలు వాయిదాలు పడే సినిమాలు ఎక్కువే.
ఒక సినిమాకు కథానాయిక ఎంపిక పూర్తయితే తప్ప కలయిక కుదిరినట్టు కాదు. హీరోకు తగిన జోడీ అనిపించాలి. వెనక విజయాలు.. ప్రేక్షకుల్ని ఆకర్షించే గ్లామర్ ఉన్నాయో లేవో చూసుకోవాలి. సదరు హీరోయిన్ను ఎంపిక చేస్తే ఆ ప్రాజెక్ట్‌కు క్రేజ్ వస్తుందో లేదో లెక్కలేసుకోవాలి. ఇలా కథానాయికల ఎంపిక వెనక ఎన్నెన్నో సమీకరణలు ఉంటాయి. పారితోషికం.. కాల్షీట్ల సర్దుబాటు సంగతులు సరే సరి! కథానాయికను ఖరారు చేయకుండానే కొన్ని సినిమాలు పట్టాలెక్కుతాయంటే కారణం అదే. ఏటా వందల సంఖ్యలో కొత్త కథానాయికలు పరిశ్రమకు వస్తుంటారు. కానీ వాళ్లలో స్టార్ హోదాకు చేరుకునేవాళ్లు ఒకరిద్దరే. అందుకే స్టార్ సినిమాలకు నాయికల ఎంపిక అనేది కత్తిమీద సాములా మారింది. చిత్రసీమలో కార్యకలాపాలు ఊపందుకోగానే వీరి ఎంపికపై దృష్టిపెట్టాయి పలు చిత్రబృందాలు. బాలకృష్ణ, ఎన్టీఆర్, పవన్‌కల్యాణ్, గోపీచంద్ తదితరుల చిత్రబృందాలు ప్రస్తుతం నాయికల ఎంపికపైనే కసరత్తులు చేస్తున్నాయి.
* 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నారు. అందులో హీరోయిన్గా కియారా అడ్వాణీ, పూజా హెగ్డేల్లో ఒకరు ఖాయం అని తెలుస్తోంది. మరి ఆ ఒక్కరు ఎవరనేది ఇంకో వారంలో ఖరారయ్యే అవకాశాలున్నాయి.
* పవన్‌కల్యాణ్ - హరీశ్ శంకర్ కలయికలో రూపొందనున్న సినిమాకూ నాయిక ఎంపికను పూర్తి చేయాల్సి ఉంది. ఒకట్రెండు వారాల్లోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.