తెలంగాణ

telangana

Mimi Review: కృతి సనన్‌ 'మిమి' సందేశం ఆకట్టుకుందా?

By

Published : Jul 27, 2021, 5:27 PM IST

కృతి సనన్(KritiSanon), పంకజ్ త్రిపాఠి ప్రధానపాత్రల్లో తెరకెక్కి నెట్​ఫ్లిక్స్ వేదికగా విడుదలైన చిత్రం 'మిమి'(Mimi). ఈ నేపథ్యంలో సినిమా ఎలా ఉందో సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

KritiSanon Mimi
కృతి సనన్‌ మిమి

చిత్రం: మిమి

నటీనటులు: కృతి సనన్‌, పంకజ్‌ త్రిపాఠి, సాయి తమంకర్‌, మనోజ్‌ పవా, సుప్రియ పాఠక్‌

సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌

సినిమాటోగ్రఫీ: ఆకాశ్‌ అగర్వాల్‌

ఎడిటింగ్‌: మనీష్‌ ప్రధాన్‌

నిర్మాత: దినేశ్‌ విజాన్‌, జియో స్టూడియోస్‌

రచన: లక్ష్మణ్‌ ఉత్కర్‌, రోహన్‌ శంకర్‌

దర్శకత్వం: లక్ష్మణ్‌ ఉత్కర్‌

విడుదల: నెట్‌ఫ్లిక్స్‌

కరోనా కారణంగా ఇంకా థియేటర్లు పూర్తిగా తెరుచుకోని నేపథ్యంలో ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న పలు సినిమాలు ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి. అన్ని భాషల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. కాగా, కృతిసనన్‌(KritiSanon), పంకజ్‌ త్రిపాఠి కీలక పాత్రల్లో లక్ష్మణ్‌ ఉత్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ డ్రామా 'మిమి''(Mimi). నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? నటీనటులు ఎలా మెప్పించారు? అనే విషయాన్ని సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

కథేంటంటే?

అమెరికాకు చెందిన దంపతులు సరోగసి ద్వారా ఓ బిడ్డకు జన్మనివ్వాలని చూస్తుంటారు. అందుకోసం ఆరోగ్యవంతురాలైన మహిళ కోసం వెతుకుతుంటారు. ఈ విషయం డ్రైవర్‌ భాను ప్రతాప్‌ పాండే (పంకజ్‌ త్రిపాఠి)కి తెలుస్తుంది. దీంతో తన స్నేహితురాలైన మిమి రాఠోడ్‌(కృతి సనన్) గురించి వాళ్లకు చెబుతాడు. సరోగసి ద్వారా డబ్బు వస్తుందని చెప్పి మిమిని కూడా ఒప్పిస్తాడు. దీంతో రూ.20లక్షలకు ఇరువురి మధ్య ఒప్పందం కుదురుతుంది. మిమి డబ్బు కూడా తీసుకుంటుంది. తీరా గర్భం దాల్చాక ఆ బిడ్డ తమకు వద్దని అమెరికా దంపతులు షాకిస్తారు. అప్పుడు కడుపులో ఉన్న బిడ్డను మిమి ఏం చేసింది? మిమి గర్భవతి అన్న విషయం తెలిసి ఆమె తల్లిదండ్రులు ఏం చేశారు? కడుపులో ఉన్న ఆ బిడ్డ భవిష్యత్తు ఏమిటి?తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

కృతి సనన్‌ మిమి

మరాఠీ సినిమా రీమేక్​గా!

వైవిధ్య కథలు, ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌ బాలీవుడ్‌. 'విక్కీ డోనర్‌', 'బాలా', 'గుడ్‌ న్యూజ్‌' ఇలా చెప్పుకొంటూ పోతే ఏ చిత్రానికి అదే భిన్నమైనది. సరోగసి నేపథ్యంలో ఇప్పటికే పలు చిత్రాలు వచ్చినా, 'మిమి' కాస్త భిన్నమైంది. 2011లో వచ్చిన మరాఠా చిత్రం 'మలా ఆయ్‌ వహ్‌చే' ఆధారంగా 'మిమి'ని తెరకెక్కించారు. ఇదే సినిమా తెలుగులో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 'వెల్‌కమ్‌ ఒబామా'గా కూడా రీమేక్‌ అయింది. అయితే, మాతృకలో ఉన్న భావోద్వేగాలను కొనసాగిస్తూ, తనదైన కామెడీ టచ్‌ ఇచ్చి 'మిమి'ని తీర్చే దిద్దే ప్రయత్నం చేశాడు లక్ష్మణ్‌. హాస్య సన్నివేశాలు అలరించేలా ఉన్నా, లింగభేదం, మత విశ్వాసాలు, వర్ణ వివక్ష ఇలా ఇతర అంశాలను టచ్‌ చేయడం వల్ల అసలు పాయింట్‌ నుంచి కాస్త పక్కకు వెళ్లినట్లు అనిపిస్తుంది.

అమెరికా దంపతులు సరోగసి ద్వారా బిడ్డకు జన్మనివ్వాలనుకోవడం, అది భానుకు తెలిసి మిమి వద్దకు తీసుకురావటం, ఆమె మొదట వద్దనుకున్నా, డబ్బు అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఒప్పుకోవడం తదితర సన్నివేశాలను ప్రథమార్ధంలో చూపించాడు దర్శకుడు. పాత్రల మధ్య హాస్యాన్ని పంచుతూనే నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే అమెరికా దంపతులు గద్దె గర్భాన్ని వద్దనుకున్నారో అక్కడి నుంచి మూవీ ఎమోషనల్‌ టర్న్‌ తీసుకుంటుంది. ద్వితీయార్ధంలో పాత్రల మధ్య ఘర్షణ చూపించాడు. ఆయా సన్నివేశాలను లక్ష్మణ్‌ తనదైన శైలిలో ప్రజెంట్‌ చేశాడు. చివరి వరకూ ఆ ఎమోషన్‌ టెంపోను కొనసాగించాడు. అదే సమయంలో కథాగమనం వేగం తగ్గినట్లు అనిపిస్తుంది. నిడివి కూడా కాస్త పెరిగిందేమో అనిపిస్తుంది. ఓవరాల్‌గా ఒక ఎమోషనల్‌ డ్రామాను చూశామన్న ఫీలింగ్‌ ప్రేక్షకుడికి కలుగుతుంది.

కృతి సనన్‌

ఎవరెలా చేశారంటే?

మిమి పాత్రలో కృతిసనన్‌ ఒదిగిపోయింది. అమెరికా దంపతులు అద్దె గర్భం వద్దన్న తర్వాత ఏం చేయాలో పాలుపోని సగటు మహిళగా ఆమె చక్కని హావభావాలు పలికించింది. భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన మెప్పిస్తుంది. ఇంకా నటనకు ఆస్కారం ఉన్న పాత్ర ఆమెది. అయితే, ఆమె నుంచి ఏ స్థాయి నటన రాబట్టుకోవాలన్నది దర్శకుడి చేతిలో ఉంటుంది. ఈ ఏడాది ఆమెకు 'మిమి' గుర్తుండిపోయే చిత్రమని చెప్పవచ్చు.. ప్రస్తుతం మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలతో దూసుకెళ్తున్న బాలీవుడ్‌ భామలు తాప్సీ, ఆలియా భట్‌లకు దీటుగా నిలబడే అవకాశం ఉంది. డ్రైవర్‌ భానుగా పంకజ్‌ త్రిపాఠి మెప్పించాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో అలరించాడు. ఒక రకంగా ఈ సినిమాకు ఆయన ప్రధాన ఆయువు పట్టు అయ్యాడు. సాయి తమంకర్‌, మనోజ్‌ పవా, సుప్రియ పాఠక్‌ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ఏఆర్‌ రెహమాన్‌ మరోసారి మేజిక్‌ చేశారు. నేపథ్య సంగీతం ప్రేక్షకుడిని కథలో లీనం చేస్తుంది. ఆకాశ్‌ అగర్వాల్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌కు ఫ్రెష్‌లుక్‌ తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. మనీష్‌ ప్రధాన్‌ ఎడిటింగ్‌ ఓకే. దర్శకుడు లక్ష్మణ్‌కు ఉన్న బలం కామెడీ. ఎమోషనల్‌ బ్యాక్‌డ్రాప్‌ కలిగిన ‘మిమి’కి హాస్యం జోడించి తీర్చిదిద్దడంలో ఆయన పర్వాలేదనిపించాడు. అయితే, ఎమోషనల్‌ సన్నివేశాల్లో ఇంకాస్త గాఢత పెంచి ఉంటే బాగుండేది. అదే సమయంలో నిడివిని కూడా దృష్టిలో పెట్టుకుని ఉండాల్సింది.

కృతి సనన్‌ మిమి

బలాలు

కృతి సనన్‌, పంకజ్‌ త్రిపాఠి

ఎమోషనల్‌, కామెడీ సన్నివేశాలు

సాంకేతిక బృందం పనితీరు

బలహీనతలు

ద్వితీయార్ధంలో నెమ్మదిగా సాగే కథనం

చివరిగా: 'మిమి'.. ఎమోషనల్‌, కామెడీ బాగుంది. కానీ, సరోగసి బిడ్డ బలహీనంగా ఉంది.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ఇవీ చూడండి: పవన్- రానా మూవీ మేకింగ్ వీడియో రిలీజ్..ఫ్యాన్స్​కు పండగే

ABOUT THE AUTHOR

...view details