తెలంగాణ

telangana

బాలీవుడ్​కు​ నో చెప్పి.. దక్షిణాదికి జైకొట్టి

By

Published : Jun 4, 2020, 5:45 PM IST

బాలీవుడ్​లో అవకాశాలు వచ్చినా ఆ స్టార్స్ వద్దనుకున్నారు. దక్షిణాదిలోనే సినిమాలు చేస్తామని, ఇప్పట్లో హిందీలోకి వెళ్లే ఆలోచన లేదని చెప్పారు. ఇంతకీ వారు ఎవరు? ఎందుకు వద్దనుకున్నారు? తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

బాలీవుడ్​కు​ నో చెప్పి.. దక్షిణాదికి జైకొట్టి
బాలీవుడ్ ఆఫర్లు వదులుకున్న దక్షిణాది స్టార్

బాలీవుడ్​లో నటించాలి.. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలి అనేది చాలా మంది కల. ఇప్పటికే ఈ విషయంలో చాలామంది దక్షిణాది నటీనటులు నిరూపించుకున్నారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి, మాధవన్, డార్లింగ్ ప్రభాస్, దుల్కర్ సల్మాన్ తదితరులు ఉన్నారు. మరెంతోమంది అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు మాత్రం బాలీవుడ్​లో ఆఫర్లు వచ్చినా, వాటిని సున్నితంగా తిరస్కరించారు. ఇంతకీ వారెవరు, ఎందుకు వద్దనుకున్నారు?

స్టైలిష్​స్టార్ అల్లు అర్జున్

'గంగోత్రి' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్.. 'ఆర్య'తో గుర్తింపు తెచ్చుకున్నారు. 'రేసుగుర్రం'తో బాక్సాఫీస్​ రికార్డులు నెలకొల్పారు. ఇటీవలే వచ్చిన 'అల వైకుంఠపురములో' చిత్రంతో అంతర్జాతీయంగానూ పేరు తెచ్చుకున్నారు. ఇందులోని 'రాములో రాములా', 'బుట్టబొమ్మ' పాటలు ఎంతలా పాపులర్​ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తనకు ఇప్పట్లో బాలీవుడ్​లోకి వెళ్లే ఆలోచన లేదని ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చారు బన్నీ. ప్రస్తుతం పాన్ ఇండియా కథతో తెరకెక్కుతున్న 'పుష్ప'లో నటిస్తున్నారు.

స్టైలిష్​స్టార్ అల్లు అర్జున్

సూపర్​స్టార్ మహేశ్​బాబు

తన లుక్స్​, ఛార్మ్​తో సినీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న మహేశ్​బాబు.. ఇప్పటివరకు తెలుగులో మాత్రమే నటించారు. అయితే కొన్నేళ్ల క్రితం 'బిజినెస్​మేన్' రీమేక్​తో బాలీవుడ్​లోకి ప్రవేశిస్తాడనే వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ పుకార్లేనని తేలింది. దీంతో తమ హీరో ఎప్పుడు బాలీవుడ్​లోకి వెళ్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇదేకాకుండా మహేశ్​, బన్నీ.. ఇప్పటివరకు రీమేక్​లు చేయకపోవడం విశేషం.

సూపర్​స్టార్ మహేశ్​బాబు

స్వీటీ అనుష్క శెట్టి

కథానాయిక ప్రాధాన్యమున్న పాత్రలు, 'బాహుబలి' లాంటి సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న భామ అనుష్కశెట్టి. దక్షిణాదిలోని తెలుగు, తమిళంలో పలు చిత్రాలు చేసిన ఈమె.. తనకొచ్చిన బాలీవుడ్​ అవకాశాలను చాలావరకు తిరస్కరించిందట. ఇప్పటికే తాను చాలా ప్రాజెక్టులు చేస్తున్నానని, అందుకే అక్కడ నటించడం కష్టమని భావించింది. ప్రస్తుతం ఈమె నటించిన 'నిశ్శబ్దం' త్వరలో విడుదల కావాల్సిఉంది.

ముద్దుగుమ్మ అనుష్క శెట్టి

నివిన్ పాలీ

నివిన్ పాలీ అంటే చాలామందికి తెలియకపోవచ్చు. కానీ మలయాళ 'ప్రేమమ్' హీరో అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. 2015లో వచ్చిన ఆ సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో కనిపించి, అలరించారు. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్​ దర్శకత్వంలో నివిన్ నటిస్తాడని గతేడాది వార్తలు వచ్చాయి. వాటిపై స్పందించిన ఈ కథానాయకుడు.. ప్రస్తుతానికి తన దృష్టంతా మలయాళంపైనే ఉందని చెప్పుకొచ్చారు.

మలయాళ నటుడు నివిన్ పాలీ

ABOUT THE AUTHOR

...view details