ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవల పిడుగుపాటుకు ఒకేరోజు 41 మంది ప్రాణాలు కోల్పోయారు. వర్షాకాలంలో ఇటువంటి దుర్ఘటనలు ఏటా సంభవిస్తూనే ఉంటాయి. కానీ, గతంతో పోలిస్తే పిడుగుపాట్లు అసాధారణ స్థాయిలో పెరుగుతుండటం కలవరపెడుతోంది. జాతీయ నేర గణాంక నమోదు సంస్థ లెక్కల ప్రకారం దేశంలో పిడుగుపాటు వల్ల ఏటా దాదాపు 2500 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రకృతి విపత్తుల వల్ల సంభవించే మరణాల్లో మూడో వంతుకు పైగా పిడుగుపాటే కారణమని భారత వాతావరణ విభాగం అధ్యయనాలు చెబుతున్నాయి. 2019లో ప్రకృతి విపత్తుల కారణంగా 8,145 మంది మరణించగా, వారిలో 15శాతం వడగాడ్పుల వల్ల, 11శాతం వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా 35శాతం చావులకు పిడుగులే కారణమయ్యాయి.
అందులోనూ బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువ మంది అసువులుబాయగా- ఝార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్‌లు తరవాతి స్థానాల్లో ఉన్నాయి. 1960 తరవాత పిడుగుపాటు మరణాలు రెండున్నర రెట్లు పెరిగాయని పుణేలోని భారత ఉష్ణమండల వాతావరణ శాస్త్ర సంస్థ (ఐఐటీఎం) నిర్ధారించింది. అంతకు ముందుతో పోలిస్తే 1995-2014 మధ్య కాలంలో ఉరుములు, పిడుగులు 40శాతం పెరిగాయని, ఫలితంగా మృతుల సంఖ్య రెట్టింపయిందని ఐఐటీఎం పేర్కొంది. అధిక సాంద్రత కలిగిన అటవీ ప్రాంతాలతో పోలిస్తే మిగతాచోట్ల పిడుగుపాట్లు ఎక్కువగా ఉంటున్నాయని వెల్లడించింది.
గ్రామాల్లోనే అధికం
నానాటికీ అధికమవుతున్న భూతాపం ఎన్నో ప్రకృతి విధ్వంసాలకు కారణమవుతోంది. పెరుగుతున్న పిడుగుపాట్లకూ భూతాపమే కారణమని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. భూతాపం వల్ల అవనిపై తేమ పెరిగి, తద్వారా తుపానులు, పిడుగుపాట్లు సంభవిస్తున్నాయి. భూమిపై ఒక డిగ్రీ భూతాపం పెరిగితే పిడుగుపాట్లు 12శాతం అధికమవుతాయని ఒక అంచనా. దీన్నిబట్టి అమెరికా వంటి అగ్రదేశాలకు భవిష్యత్తులో పిడుగులే అతిపెద్దగా విపత్తుగా మారనున్నాయి. ఒక్కో పిడుగుకు దాదాపు 300 మిలియన్ ఓల్టుల శక్తి ఉంటుంది. ఇది సూర్యుడి ఉపరితలంపై ఉండే వేడికంటే చాలా అధికం. అందుకే పిడుగుల వల్ల ఏర్పడే నష్టం అధిక స్థాయిలో ఉంటోంది. వీటి కారణంగా వేల సంఖ్యలో పశువులూ మరణిస్తున్నాయి. విమానాల ప్రయాణాలకు ఆటంకం ఏర్పడుతోంది. విద్యుత్తును ఉత్పత్తి చేసే సౌర ఫలకాలు, పెద్ద గాలి పంకాలు వంటివీ తీవ్రంగా దెబ్బతింటున్నాయి. అడవుల్లో కార్చిచ్చూ మరో ప్రధాన సమస్యగా మారింది. దీనివల్ల భూతాపం మరింత పెరుగుతోంది. అడవుల నరికివేత, నీటి వనరులు తగ్గిపోవడం, కాలుష్యం పెరగడం వంటివన్నీ పిడుగుపాటుకు కారణమేనని నిపుణులు పేర్కొంటున్నారు.
పిడుగు నివారణ పరికరాలు..