తెలంగాణ

telangana

ETV Bharat / opinion

అమెరికా ఓటరు ఎటువైపు? 'విజేత'పై ఉత్కంఠ..

అమెరికా అధ్యక్ష ఎన్నిక పోరు ఊపందుకుంది. ట్రంప్‌ కంటే బైడెన్‌ తొమ్మిది శాతం నుంచి పది శాతం ఆధిక్యంలో ఉన్నట్లు పలు సర్వేలు తెలుపుతున్నాయి. వైరస్‌ నియంత్రణకు ట్రంప్‌ సత్వర చర్యలు తీసుకోకపోవడం వల్ల అమెరికన్‌ ప్రజల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి క్షీణించాయని బైడెన్‌ విమర్శించారు. మరోవైపు ట్రంప్‌ తన ప్రత్యర్థి బైడెన్‌ కుటుంబాన్ని నేరగాళ్ల కుటుంబంగా వర్ణించారు. బైడెన్‌ కుమారుని వ్యాపార లావాదేవీలను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అమెరికా ఓటరు ఎటువైపో తేలాలంటే ఇంకో పది రోజులు ఆగాల్సిందే ..

america -elections-special-feature
అమెరికా ఓటరు ఎటువైపు?

By

Published : Oct 25, 2020, 9:15 AM IST

Updated : Oct 25, 2020, 11:42 AM IST

అమెరికా ప్రజాస్వామ్యం- ముఖ్యంగా ఆ దేశ ఎన్నికల ప్రక్రియ చాలా సంక్లిష్ట దశలో ఉన్నాయి. డొనాల్డ్‌ ట్రంప్‌ గద్దెనెక్కక ముందు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల మధ్య ముఖ్యమైన విధానాలపై అద్భుతమైన, అర్థవంతమైన చర్చలు జరిగేవి. న్యాయంగా, నిష్పాక్షికంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేవి. ఎన్నికల్లో జయాపజయాలు తేలిన తరవాత అధికారం శాంతియుతంగా చేతులు మారేది. అందుకే అమెరికా ఇతర దేశాలకు ప్రజాస్వామ్యం గురించి, స్వేచ్ఛాయుత ఎన్నికల గురించి ఉపన్యాసాలు దంచగలిగేది. అలాంటి అమెరికా ఎన్నికల ప్రక్రియ నేడు ఎంతగా దిగజారిపోయిందో చూసి ప్రపంచం నివ్వెరపోతోంది. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న అభ్యర్థులు ఇరువురూ ఒకరినొకరు నేరగాళ్లని, బఫూన్లని దుయ్యబట్టుకుంటున్నారు. కీలక విధానాలపై చర్చే లేకుండా దూషణభూషణ తిరస్కారాలతోనే తొలి రెండు ముఖాముఖీలు ముగిసిపోయాయి. కరోనా మహమ్మారి విజృంభణ దృష్ట్యా పెద్ద సంఖ్యలో ఓటర్లు తపాలా ద్వారా ఓటు వేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 3.5 కోట్ల ఓట్లు అలా పోలయ్యాయి. ఈ పోస్టల్‌ బ్యాలట్‌ను దుర్వినియోగపరుస్తున్నారంటూ పాలక రిపబ్లికన్‌ పార్టీ, దాని అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ దుమారం రేపుతున్నారు. పోస్టల్‌ బ్యాలట్‌ విధానంపై సుప్రీంకోర్టులో దావాలు వేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఎన్నికల ఫలితాలు వెలువడిన తరవాత తపాలా ఓటింగ్‌పై కోర్టులో సుదీర్ఘ సమరం జరగవచ్చని అనిపిస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల తరవాత శాంతియుతంగా అధికార బదిలీ జరుగుతుందని భరోసా ఇవ్వడం లేదు. ఆయన వాలకం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తోంది.

కరోనా నియంత్రణలో ట్రంప్​ విఫలం!

మరోవైపు కరోనా మహమ్మారి ఎంతకూ లొంగని స్థితిలో ఎన్నికలు జరుగుతున్నాయి. దీనివల్ల ఇంటింటికీ ప్రచారం, భారీ ఎన్నికల సభల వంటివి నిర్వహించడం అభిలషణీయం కాకపోయినా డొనాల్డ్‌ ట్రంప్‌ జనంలోకి వెళ్లి ప్రచారం సాగిస్తున్నారు. ఆయనకే స్వయంగా కరోనా సోకినా మొండిగా ఎన్నికల సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభల్లో మరెంతమందికి కరోనా అంటుకుందోనని భయాలు ఉన్నాయి. ట్రంప్‌ మాత్రం ప్రతిపక్ష డెమోక్రాట్‌ అభ్యర్థి జో బైడెన్‌ సభలకు జనం రావడం లేదు కాబట్టి ఆ పార్టీవారు జనంలోకి వెళ్లడం లేదని గేలి చేస్తున్నారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ట్రంప్‌ సర్కారు ఘోర వైఫల్యం పెద్ద ఎన్నికల సమస్యగా మారింది. వైరస్‌ నియంత్రణకు ట్రంప్‌ సత్వర చర్యలు తీసుకోకపోవడం వల్ల అమెరికన్‌ ప్రజల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి క్షీణించాయని, ప్రజలను కాపాడటంలో అధ్యక్షుడు దారుణంగా విఫలమయ్యారని బైడెన్‌ విమర్శించారు. ట్రంప్‌ కరోనా వైరస్‌ను చైనా వైరస్‌ అని పిలుస్తున్నారు. ఈ వైరస్‌ పుట్టుక, వ్యాప్తి గురించి చైనా సకాలంలో హెచ్చరించకపోవడం వల్లనే అమెరికాలో అధికంగా మరణాలు సంభవించాయని వివరిస్తున్నారు. కొవిడ్‌ను ఎదుర్కోవడానికి కఠినమైన లాక్‌డౌన్‌లను విధిస్తే దేశం ఆర్థికంగా దెబ్బతింటుందన్నారు. అలా చేయకపోవడం వల్లనే అమెరికా ఆర్థిక స్థితి క్రమక్రమంగా కోలుకొంటోందని ట్రంప్‌ చెప్పుకొస్తున్నారు. కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యం వల్ల ఆర్థికంగా దెబ్బతిన్న ఓటర్లు ట్రంప్‌ వాదనకు ఎలా స్పందిస్తారో చూడాలి. బహుశా ఒక వర్గం ఓటర్లకు ఈ వాదన నచ్చినా ఆశ్చర్యం లేదు. ట్రంప్‌ ఆర్థిక విధానాలకు 54 శాతం ఓటర్లు సానుకూలత ప్రదర్శిస్తున్నారని ఈ నెల ఆరంభంలో జరిపిన గ్యాలప్‌ సర్వేలో తేలింది.ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో పాలక, ప్రతిపక్ష అభ్యర్థుల వ్యక్తిత్వాల మీద ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ట్రంప్‌ అమెరికా సమాజంలో చీలికలు తీసుకొస్తున్నారని, మహిళలు, మైనారిటీలు, సమాచార సాధనాల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారని డెమోక్రాట్‌ పార్టీ ఆరోపిస్తోంది. ట్రంప్‌ను అభిశంసించడానికి డెమోక్రాట్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ట్రంప్‌ తన ప్రత్యర్థి బైడెన్‌ కుటుంబాన్ని నేరగాళ్ల కుటుంబంగా వర్ణించారు. బైడెన్‌ కుమారుని వ్యాపార లావాదేవీలను ప్రశ్నించారు. విదేశాంగ విధానపరంగా ట్రంప్‌, బైడెన్‌ల మధ్య గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నాయి. మార్చిలో ఒక పత్రికలో రాసిన వ్యాసంలో బైడెన్‌ వాతావరణ మార్పులు, వలసలు, సాంకేతిక పరిజ్ఞానం తెచ్చిపెడుతున్న తీవ్ర మార్పులు, అంటు వ్యాధులు, అవినీతి నిర్మూలన గురించి స్పష్టమైన విధానాలను ప్రకటించారు. బైడెన్‌ ఎన్నికల ప్రచార వెబ్‌సైట్‌లో ‘ముస్లిం అమెరికన్ల పట్ల బైడెన్‌ అజెండా’ అంటూ ప్రచురితమైన ఒక పత్రంలో కశ్మీర్‌ సమస్యపై ప్రతికూలంగా స్పందించారు. చైనాలో షింజియాంగ్‌ రాష్ట్రంలోని ముస్లింల నిర్బంధ శిబిరాలు, మియన్మార్‌లో రోహింగ్యా ముస్లింలపై దమనకాండ గురించి మాట్లాడుతూ, కశ్మీర్‌ సమస్యను కూడా అదే గాటన కట్టారు. బైడెన్‌ అధికారంలోకి వస్తే ఇదే పంథా కొనసాగిస్తారో లేదో చెప్పడం కష్టం.

పురోగమనంలో భారత్‌తో సంబంధాలు..

ట్రంప్‌ తన పదవీ కాలంలో విదేశాంగ విధానపరంగా మిశ్రమ ఫలితాలు సాధించారు. ఇజ్రాయెల్‌, అరబ్‌ దేశాల మధ్య వైరాన్ని తగ్గించి సహకార బంధానికి పునాది వేయడంలో ఆయన అనూహ్యంగా సఫలమయ్యారు. చైనా మీద కఠిన పంథా అనుసరించాలని చాలామంది అధ్యక్షులు భావించినా, దాన్ని అమలులో పెట్టినది ట్రంప్‌ మాత్రమే. చైనా మీద ఆయన వాణిజ్య యుద్ధం ప్రారంభించారు. తైవాన్‌ను గట్టిగా సమర్థించారు. ‘క్వాడ్‌’ను ముందుకు తీసుకెళుతున్నారు. చిరకాల మిత్రులైన ఐరోపా దేశాలను మాత్రం దూరం చేసుకున్నారు. వాతావరణ మార్పులు, కరోనాపై పోరాటం వంటి అంశాల్లో కొత్త పరిష్కారాలను చూపలేకపోయారు. భారతదేశం పట్ల ఆయన అనేకసార్లు పరుషంగా స్పందించారు. వాణిజ్య విధానాలపై విభేదిస్తూ అమెరికా ఉత్పత్తులపై భారత్‌ భారీ సుంకాలు వేస్తోందని ఆరోపించారు. భారత్‌ను టారిఫ్‌ రాజుగా వర్ణించారు. ఇటీవల ఎన్నికల ప్రచార చర్చలో భారతదేశంలో గాలి కలుషితమైందనీ, అది మహా దుర్గంధభరితమనీ నోరుపారేసుకున్నారు. అయినా ట్రంప్‌ హయాములో భారత్‌-అమెరికా సంబంధాలు పురోగమించాయి. రక్షణ రంగంలో కొత్త శిఖరాలను అందుకున్నాయి. వచ్చే నెల మూడున జరిగే ఎన్నికల్లో ఎవరు గెలిచినా, భౌగోళిక రాజకీయ, ఆర్థిక అనివార్యతలు భారత్‌-అమెరికా సంబంధాలను ముందుకు నడిపిస్తాయి. ఈ ఎన్నికలు ట్రంప్‌పైన, ఆయన విధానాలపైన జనాభిప్రాయ సేకరణ వంటివి. ట్రంప్‌ అమెరికా సంప్రదాయాలకు పూర్తి భిన్నమైన నాయకుడు. మరో నాలుగేళ్లపాటు ఆయన్ను భరించడానికి అమెరికన్‌ ఓటరు సిద్ధమా కాదా అన్నది త్వరలోనే తేలుతుంది.

'విజేత'పై ఉత్కంఠ..

ట్రంప్‌ కంటే బైడెన్‌ తొమ్మిది శాతం నుంచి పది శాతం ఆధిక్యంలో ఉన్నట్లు పలు సర్వేలు తెలుపుతున్నాయి. అయితే, కొన్ని రాష్ట్రాలు ఎవరి వైపు మొగ్గు చూపితే వారే అంతిమ విజేత అవుతారు. ఈ రాష్ట్రాల్లో ట్రంప్‌, బైడెన్‌ల మధ్య తేడా చాలా స్వల్పంగా ఉంది. ఫ్లోరిడా, నార్త్‌ కెరొలైనా, అరిజోనా రాష్ట్రాల్లో బైడెన్‌ ఆధిక్యం మూడు శాతంకన్నా తక్కువగా ఉంది. ఐయోవా, ఒహైయో రాష్ట్రాల్లో ట్రంప్‌ ఆధిక్యం రెండు శాతంకన్నా తక్కువ. ఈ తేడాలు రానున్న కొద్ది రోజుల్లో తారుమారైనా ఆశ్చర్యం లేదు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో పలు సర్వేలు ట్రంప్‌ మీద డెమోక్రాట్‌ అభ్యర్థి హిలరీ క్లింటన్‌కు ఆధిక్యం చూపినా చివరకు ట్రంపే నెగ్గారు. ఈసారి కూడా అలా జరగదని హామీ లేదు. పైగా చాలామంది ముందస్తు ఓటింగ్‌ చేపట్టడంతో పరిస్థితి మరింత జటిలమైంది.

- పులిపాక సంజయ్​ (దిల్లీలోని 'నెహ్రూ స్మారక మ్యూజియం, లైబ్రరీ'లో సీనియర్‌ ఫెలో)

Last Updated : Oct 25, 2020, 11:42 AM IST

ABOUT THE AUTHOR

...view details