US Green Card News : ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనకు ముందు.. బైడెన్ సర్కార్ అమెరికాలోని భారతీయులకు మేలు కలిగించే నిర్ణయం తీసుకుంది. అమెరికాలో శాశ్వత నివాసం జారీ చేసే గ్రీన్ కార్డు అర్హతలను సరళతరం చేసింది. ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ కోసం అర్హతలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న వారి కోరికను సాకారం చేసుకునేందుకు ఈ నిర్ణయం దోహదం చేయనుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లి అక్కడే శాశ్వతంగా స్థిరపడాలనుకునే వలసదారులకు అమెరికా పర్మనెంట్ రెసిడెంట్ కార్డ్-గ్రీన్ కార్డులను జారీ చేస్తారు.
US Eases Green Card Eligibility Norms : అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం.. ప్రతియేటా సుమారు 1,40,000 గ్రీన్ కార్డులను జారీచేస్తారు. అయితే, ఒక్కో దేశానికి నిర్ణీత సంఖ్యలో మాత్రమే గ్రీన్ కార్డులను జారీ చేస్తారు. ప్రస్తుతం మొత్తం దరఖాస్తుల్లో ఒక్కో దేశానికి కేవలం 7% మాత్రమే కేటాయిస్తున్నారు. ఈఏడీ అర్హతలు ఉన్నవారికి మాత్రమే ప్రస్తుతం గ్రీన్ కార్డు జారీ చేస్తున్నారు. తాజాగా ఈఏడీ నిబంధనలను సడలించిన నేపథ్యంలో అమెరికాలో సవాళ్లతో కూడిన పరిస్థితులు ఎదుర్కొంటున్న వారికి ఉపశమనం కలగనుంది. గ్రీన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే కాకుండా రెన్యువల్ చేసుకునే వారికి కూడా నూతన మార్గదర్శకాలు వర్తింపచేయనున్నట్లు అమెరికా వెల్లడించింది. అమెరికాలో చట్టబద్ధంగా పనిచేసేవారి సంఖ్యను పెంపొందించేందుకు తాజా నిర్ణయం దోహదం చేస్తుందని భావిస్తున్నారు.