తెలంగాణ

telangana

India Canada Private Talks : భారత్, కెనడా​ మంత్రుల రహస్య చర్చలు!.. ఇప్పుడైనా సమస్య కొలిక్కివచ్చేనా?

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2023, 1:59 PM IST

India Canada Private Talks : ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య వ్యవహారంతో కెనడా-భారత్​ మధ్య రాజుకున్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఇటీవలే అమెరికాలో రహస్యంగా భేటీ అయినట్లు ప్రముఖ వార్తాపత్రిక ఓ కథనం ప్రచురించింది.

India Canada Foreign Ministers Secret Meet In USA Washignton
Canada Private Talks With India

India Canada Private Talks : ఖలిస్థానీ వేర్పాటువాది, ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ హత్య వ్యవహారంతో భారత్​-కెనడా మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభనకు తెరదించేందుకు ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఇటీవలే అగ్రరాజ్యం అమెరికాలో రహస్యంగా భేటీ అయినట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ప్రముఖ ఆంగ్ల వార్తాపత్రికలో ఓ కథనం వెలువడింది. కాగా, ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం తలెత్తింది.

తెరవెనుక మంతనాలు..
కొద్ది రోజుల క్రితమే అమెరికాలోని వాషింగ్టన్‌లో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌. జైశంకర్​, కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ రహస్య సమావేశంలో పాల్గొన్నట్లు సదరు కథనం పేర్కొంది. భారత్‌తో ఏర్పడిన దౌత్య ఉద్రిక్తతలను తొలగించుకునేందుకు కెనడా సిద్ధంగా ఉన్నట్లు, అందుకనుగుణంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. ఈ క్రమంలోనే దిల్లీ కోరినట్లుగా భారత్‌లో తమ దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించుకున్నట్లు ఒట్టావా తెలిపింది. అయితే ఈ తెరవెనుక జరిగిన భేటీ గురించి ఇరు దేశాలకు చెందిన విదేశాంగ శాఖల నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

'దౌత్యపరమైన చర్చలే ఉత్తమమైన మార్గం..'
భారత్‌తో దౌత్య వివాదాన్ని తాము ప్రైవేటుగా పరిష్కరించుకోవాలనుకుంటున్నట్లు ఇటీవల కెనడా విదేశాంగ మంత్రి మెలానీ ప్రకటించారు. "మేం భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. మా దౌత్యవేత్తల భద్రతకు మేం అత్యంత ప్రాధాన్యం ఇస్తాం. ఈ వివాదం పరిష్కారం కోసం ప్రైవేటు చర్చలు కొనసాగించాలనుకుంటున్నాం. ఎందుకంటే.. దౌత్యపరమైన చర్చలు ప్రైవేట్‌గా జరిగితేనే అత్యుత్తమ ఫలితాలను ఇస్తాయని మేం భావిస్తున్నాం" అని మెలానీ తెలిపారు. మరోవైపు భారత్‌తో కొనసాగుతున్న ఈ ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరగాలని తమ దేశం కోరుకోవట్లేదని ప్రధాని జస్టిన్​ ట్రూడో కూడా ఇటీవలే వ్యాఖ్యానించారు.

అల్టిమేటం ఎఫెక్ట్​..
India Ultimatum Canada Private Talks :నిజ్జర్ హత్య కేసులో భారత్​ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ట్రూడో చేసిన సంచలన వ్యాఖ్యలతో ఇరు దేశాల మద్య దౌత్య సంబంధాలు దిగజారాయి. ఈ ఆరోపణలను భారత్‌ తీవ్రంగా తప్పుబట్టింది. అంతేగాక, తమ అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్యవేత్తలు జోక్యం చేసుకుంటున్నారంటూ ఆరోపించింది. దౌత్యవేత్తల సంఖ్య విషయంలో కెనడా సమానత్వం పాటించాలని, భారత్​లో వారి దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని ఇటీవలే దిల్లీ అల్టిమేటం కూడా జారీ చేసింది. ఈ క్రమంలోనే ఒట్టావా దాదాపు 30 మంది దౌత్య సిబ్బందిని భారత్‌ నుంచి కౌలాలంపూర్‌/మలేసియాకు తరలించినట్లు ఇటీవలే పలు వార్తలు వచ్చాయి.

Canada Reaction On Indias Ultimatum : 'భారత్​తో తెరవెనుక మంతనాలకు కెనడా సిద్ధం!'

Khalistan Nijjar Killed : 'నిజ్జర్​ హత్యలో చైనా ఏజెంట్ల ప్రమేయం.. ఇండియన్ ఇంగ్లిష్ నేర్చుకొని మరీ..'

ABOUT THE AUTHOR

...view details