తెలంగాణ

telangana

చైనాపై నిఘా కోసం భారత్​ సరికొత్త అస్త్రం!

By

Published : Aug 7, 2022, 5:50 PM IST

సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. భారత్‌ సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. వాస్తవాధీన రేఖ, హిందూ మహా సముద్రం వెంబడి చైనా కార్యకలాపాలపై నిఘా కోసం అధునాతన డ్రోన్లను హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ అభివృద్ధి చేస్తోంది. నిఘా సహా క్షిపణులు, సెన్సార్ల, ఇతర ఆయుధాలను మోసుకెళ్లగలిగేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు. చైనాతో సరిహద్దు వెంబడి అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో వ్యూహాత్మక మిషన్ల కోసం ఈ డ్రోన్లను ఉపయోగించనున్నారు.

drone lac
చైనాపై నిఘా కోసం భారత్​ సరికొత్త అస్త్రం!

సరిహద్దుల్లో తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాపై నిఘాకు సరికొత్త అస్త్రాన్ని భారత్‌ సిద్ధం చేస్తోంది. బహుళ విధాలుగా ఉపయోగపడే ఆధునాతన డ్రోన్ల తయారీకి హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ సన్నద్ధమవుతోంది. చైనాతో సరిహద్దు వెంబడి అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో వ్యూహాత్మక మిషన్ల కోసం ఈ డ్రోన్లను ఉపయోగించనున్నారు. ఈ రోటరీ-వింగ్‌ డ్రోన్‌కు క్షిపణులు, సెన్సార్ల సహా ఇతర ఆయుధాలను మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉంటుంది. 40 కిలోల బరువు ఇవి మోయగలవు. సైనిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని వీటిని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ అభివృద్ధి చేస్తోంది.

ముఖ్యంగా చైనాతో సరిహద్దు కలిగిన వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీకి ఈ డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఈ డ్రోన్లను వచ్చే ఏడాది పరీక్షించాలని భావిస్తున్నారు. తొలి దశ ప్రాజెక్టులో భాగంగా 60 డ్రోన్లను తయారు చేయనున్నారు. ఎక్కువ సమయం గగనతలంలో పయనించే సామర్థ్యాన్ని ఈ డ్రోన్లు కలిగి ఉంటాయి. సైనికులకు నిత్యావసర సరకుల సరఫరాకు కూడా వీటిని వినియోగించనున్నారు.

ఇజ్రాయెలీ హెరాన్ టీపీ డ్రోన్ల వంటి యూఏవీల తయారీకి ఉన్న అవకాశాలను కూడా హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ పరిశీలిస్తోంది. ఇందుకోసం ఆ తయారీ సంస్థతో సంయుక్త ప్రాజెక్టు చేపట్టే యోచనలో ఉంది. మధ్యస్థాయి ఎత్తులో ఎగిరే హెరాన్‌ డ్రోన్లు 45 గంటల పాటు పయనించగలవు. 35 వేల అడుగుల ఎత్తు వరకు ఇవి ఎగరగలవు.

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ-డీఆర్​డీఓతో కలిసి రెండు వేర్వేరు డ్రోన్‌ ప్రాజెక్టులపై కూడా హాల్‌ దృష్టిపెట్టింది. రానున్న ఏళ్లలో వీలైనన్ని ఎక్కువ డ్రోన్లను సమకూర్చుకోవాలని త్రివిధ దళాలు భావిస్తున్నాయి. వాస్తవాధీన రేఖ సహా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఇవి ఉపయోగపడనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details