ప్రపంచం ఆందోళన పడినట్లే జరుగుతోంది. తైవాన్‌పై చైనా రణ నినాదం చేస్తోంది. తైవాన్ అధ్యక్షురాలు సయ్ ఇంగ్ వెన్, అమెరికా పర్యటనపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్న చైనా.. ఆ దేశాన్ని అన్నివైపుల నుంచి దిగ్బంధిస్తోంది. అమెరికా హౌస్ స్పీకర్ మెక్ కార్తీతో సమావేశమైన తైవాన్ అధ్యక్షురాలు.. తమది స్వయం పాలిత ప్రజాస్వామ్య దేశమని చేసిన ప్రకటనతో డ్రాగన్‌లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇప్పటికే అమెరికా తైవాన్ సంబంధాలపై ఆగ్రహంగా ఉన్న జిన్‌పింగ్.. తైవాన్ చుట్టూ యుద్ధ నౌకలు, పెద్ద సంఖ్యలో ఫైటర్ జెట్‌లను మోహరిస్తున్నారు. ఎనిమిది యుద్ధనౌకలు, 42 ఫైటర్ జెట్‌లు, తైవాన్ సరిహద్దులో మోహరించినట్లు తెలుస్తోంది. 29 యుద్ధ విమానాలు తమ భూభాగంలోకి వచ్చాయని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ విమానాల్లో చెంగ్డు జె-10, షెన్యాంగ్ జె-11, షెన్యాంగ్ జె-16 వంటి అధునాతన జెట్ ఫైటర్లు ఉన్నాయని తైవాన్ వెల్లడించింది.
తైవాన్ సరిహద్దుల్లో చైనా సైన్యం.. మిలటరీ డ్రిల్స్..
చైనా యుద్ధ చర్యలు.. తైవాన్‌పై సైనిక చర్యకు దిగే విధంగా ఉన్నాయని ప్రపంచ దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. చైనా తమ జలాల్లో యుద్ధ నౌకలు, గగనతలం వైపు యుద్ధ విమానాలు, భూతలం వైపు యుద్ధ ట్యాంకులు మోహరించిందని తైవాన్ వెల్లడించింది. తైవాన్ సరిహద్దుల్లో మూడు రోజుల పాటు చైనా సైన్యం.. మిలటరీ డ్రిల్స్ నిర్వహించనున్నట్లు డ్రాగన్ వెల్లడించింది. అధునాతన యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, ట్యాంకులు సహా డ్రాగన్ సైనిక సత్తాను చాటేలా ఈ యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఈ డ్రిల్ యుద్ధానికి ముందస్తు సంసిద్ధతతన్న ఆందోళన నెలకొంది.
అమెరికా హౌస్ స్పీకర్ మెక్ కార్తీతో తైవాన్ అధ్యక్షురాలి పర్యటన..
చైనా పక్కా ప్రణాళిక ప్రకారమే తైవాన్ సరిహద్దుల్లో ఈ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు.. ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. తైవాన్ జలసంధి సహా తైవాన్‌కు ఉత్తరం, దక్షిణం, తూర్పున వ్యూహాత్మక ప్రాంతాల్లో.. డ్రాగన్ ఈ సైనిక విన్యాసాలు చేయాలని ప్రణాళిక రచించింది. తైవాన్ అధ్యక్షురాలు అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన మరుసటిరోజే.. చైనా మూడు రోజుల సైనిక విన్యాసాలు నిర్వహించాలని నిర్ణయించింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తూర్పు కమాండ్ ఈ సైనిక విన్యాసాలు చేపడుతోంది.