Maheshbabu Sarkaru vaari paata Art director:"ఇప్పుడు కళా దర్శకులకు పేరుతో పాటు పని కూడా పెరిగింది. ప్రేక్షకులను మెప్పించేలా ఆర్ట్ వర్క్ చేయడం మరింత సవాల్‌గా మారింది" అన్నారు ఏఎస్ ప్రకాష్. 'ఆర్య', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'శ్రీమంతుడు', 'అల.. వైకుంఠపురములో'.. లాంటి ఎన్నో చిత్రాలకు తన కళా నైపుణ్యంతో ప్రాణం పోసిన కళా దర్శకుడాయన. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’కు పని చేశారు. ఈ సినిమా మే 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్లతో ముచ్చటించారాయన. ఆ విశేషాలు తన మాటల్లోనే.
మహేష్‌బాబుతో గతంలో ‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘శ్రీమంతుడు’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి విజయవంతమైన చిత్రాలకు పనిచేశా. ‘సర్కారు వారి పాట’ మా కాంబినేషన్‌లో వస్తున్న ఏడో సినిమా. పరశురామ్ కథ చెప్పినప్పుడే కమర్షియల్ ఎంటర్‌టైనర్ అనే విషయం అర్థమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే రంగంలోకి దిగాను. ఈ చిత్రానికి ‘సర్కారు వారి పాట’ అన్న పేరు ఎందుకు పెట్టారన్నది సినిమా ఆరంభంలోనే తెలిసిపోతుంది.
కథ కోసం మాకు మూడు బ్యాంక్ సెట్లు అవసరమయ్యాయి. అందులో ఒకటి 50ఏళ్ల క్రితం నాటి సెట్. అప్పట్లో బ్యాంకులు ఎలా ఉండేవి? అందులో ఫర్నీచర్ ఎలా ఉండేది? ఇలాంటివన్నీ తెలుసుకొని రూపొందించాం. ఈ సెట్లో పలు కీలక సన్నివేశాలతో పాటు ఓ పెద్ద యాక్షన్ సీన్ చిత్రీకరించారు. ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా మరో రెండు బ్యాంక్ సెట్లు నిర్మించాం. దీని కోసం మేం చాలా పరిశోధన చేశాం. చాలా ప్రాంతాలు తిరిగాం. హైదరాబాద్‌లో వైజాగ్ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఓ స్ట్రీట్ సెట్ వేశాం. గోవాలో ఓ భారీ సెట్ నిర్మించాం.