ఆర్ఆర్ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అల్లూరి సీతారామ రాజు పాత్రలో ఆయన నటనకు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది సినీ ప్రియులు ఫిదా అయ్యారు. గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డ్స్ వేడుకలకు వెళ్లిన ఆయనను.. ఆ స్టైల్ చూసి హాలీవుడ్ హీరోలా ఉన్నారని అక్కడి మీడియా పేర్కొంది. ఇప్పుడంతా.. రామ్ చరణ్ హాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా చర్చ జరుగుతోంది.
గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డ్స్ వేదికగా హాలీవుడ్ దర్శక, నిర్మాతలతో కలిసి పని చేయాలని ఉందని రామ్ చరణ్ పేర్కొన్నారు. తన మనసులో కోరికను బయట పెట్టారు. ఆ మధ్య 'స్టార్ వార్స్' దర్శకుడు జేజే అబ్రహంను కలిశారు. దాంతో వాళ్లిద్దరూ కలిసి సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే, అందులో నిజం లేదని ఆస్కార్ వేడుకల్లో చరణ్ తెలిపారు. ''హాలీవుడ్ సినిమాలో రోల్ గురించి చర్చలు జరుగుతున్నాయి. అయితే, అది జేజే అబ్రహంతో కాదు'' అని చెప్పారు.
లేటెస్ట్ టాక్ ఏంటంటే.. హాలీవుడ్ టాప్ స్టార్ టామ్ క్రూజ్ 'టాప్ గన్ 3'లో రామ్ చరణ్ నటించే అవకాశాలు ఉన్నాయట. ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో శుక్రవారం రామ్ చరణ్ పాల్గొన్నారు. అక్కడ హాలీవుడ్ డెబ్యూ గురించి ప్రస్తావన వచ్చింది. 'హాలీవుడ్ సినిమా చేస్తున్న మాట నిజమేనా? హాలీవుడ్ సినిమా ఆఫర్ వచ్చిందని చదివా' అని అడిగితే.. ''ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. చర్చలు జరుగుతున్నాయి. మీరంతా ఆశీర్వదించండి. జరిగేలా చూస్తా'' అని రామ్ చరణ్ సమాధానం ఇచ్చారు. హాలీవుడ్ సినిమాకు సంతకం చేశారా? లేదా చేసే ప్రాసెస్‌లో ఉన్నారా? అని అడగ్గా ''ప్రాసెస్ జరుగుతోంది. జరిగే వరకు ప్రతిదీ ప్రాసెస్‌లో ఉంటుంది. హాలీవుడ్ సినిమా చేయడం అనేది తప్పకుండా జరుగుతుంది'' అని రామ్ చరణ్ పేర్కొన్నారు.
ఒక స్టార్ హీరో కుమారుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ టాలెంట్ లేకపోతే ఇక్కడ నెట్టుకు రావడం కష్టమన్నారు రామ్‌చరణ్. ప్రతిభ ఉంటేనే ప్రేక్షకులు ప్రోత్సహిస్తారని చెప్పారు. "నిజం చెప్పాలంటే.. ఈ నెపోటిజం ఏంటో నాకస్సలు అర్థం కావడం లేదు. ఇటీవల దీని గురించే అందరూ ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. బంధుప్రీతి ఉందని భావించే వాళ్ల వల్లే ఇది ఇంతటి చర్చకు దారి తీసింది. నాకు నటన అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను పరిశ్రమలోనే ఉన్నాను. సినిమానే ఊపిరిగా తీసుకుంటూ ఎంతోమంది నిర్మాతలను కలుస్తూ ప్రాజెక్ట్‌లు చేస్తున్నా. నా మనసుకు నచ్చిన పని చేయడం వల్లే 14 ఏళ్లుగా ఇక్కడ నిలబడగలిగాను. మా నాన్న వల్లే పరిశ్రమలోకి వచ్చినప్పటికీ ఈ ప్రయాణాన్ని నాకు నేనుగా ముందుకు సాగించాలి. ప్రతిభ లేకపోతే ఈ ప్రయాణం సులభం కాదు. 'సక్సెస్ లేదా ఫెయిల్యూర్.. నీకోసం పనిచేసే వాళ్లను జాగ్రత్తగా చూసుకో చాలు' అని తొలినాళ్లలో నాన్న నాతో చెప్పిన మాటను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా" అని చరణ్ వివరించారు.
దిల్లీలో శుక్రవారం రామ్ చరణ్ బిజీ బిజీగా గడిపారు. తండ్రి చిరంజీవితో కలిసి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. చరణ్ వచ్చే వరకు భారీ సంఖ్యలో అభిమానులు బేగం పేట్ ఎయిర్ పోర్టు దగ్గర ఎదురు చేశారు.