తితిదే బోర్డు సభ్యుడు, సాహితీ ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ‘‘ఆయన ప్రీలాంచ్ ప్రాజెక్టుల పేరుతో 2,500 మంది నుంచి రూ.900 కోట్లు వసూలు చేశారు. అందరినీ మోసం చేశారని’’ ఆర్థిక నేరాల విభాగం అధికారులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాహితీ ఇన్‌ఫ్రా టెక్ ఎండీ లక్ష్మీనారాయణ 2019లో సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ గ్రామంలో సాహితీ శరవణి ఎలైట్ పేరుతో ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. 23 ఎకరాల్లో 38 అంతస్తులతో పది అపార్టుమెంట్లు నిర్మిస్తున్నామని, రెండు, మూడు పడక గదుల ఫ్లాట్లు ఉంటాయని చెప్పాడు. ప్రపంచస్థాయిలో వసతులతో తక్కువ ధరకే నిర్మిస్తామని, ప్రీ లాంఛ్ ఆఫర్ అంటూ 1,700 మంది నుంచి రూ.539 కోట్ల మేర వసూలు చేశాడు.
వాస్తవానికి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి హెచ్‌ఎండీఏ నుంచి ఎలాంటి అనుమతీ తీసుకోలేదు. భూసేకరణ, అనుమతులు, ప్రాజెక్టు నిర్మాణానికి కొంత సమయం పడుతుందని తొలుత చెప్పాడు. మూడేళ్లు పూర్తయినా ప్రాజెక్టు పూర్తికాకపోవడంతో కొందరు బుకింగ్ రద్దు చేసుకుంటామని, డబ్బు వెనక్కి ఇవ్వాలంటూ ఒత్తిడి చేశారు. దీంతో సేకరించిన సొమ్మును సంవత్సరానికి 15-18 శాతం వడ్డీతో తిరిగి ఇస్తానని లక్ష్మీనారాయణ హామీ ఇచ్చాడు. ఆ తర్వాత కొందరికి చెక్కులు ఇచ్చినా బౌన్స్ అవ్వడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
మరెన్నో ప్రాజెక్టులు..:లక్ష్మీనారాయణ అమీన్‌పూర్ ప్రాజెక్టుతో పాటు మరిన్ని ప్రీ లాంచ్ పథకాల పేరుతో మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సాహితీ శరవణి ఎలైట్ పేరుతో హైదరాబాద్ శివార్లలోని ప్రగతినగర్, బొంగుళూరు, కాకతీయ హిల్స్, అయ్యప్ప సొసైటీ, కొంపల్లి, శామీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. తక్కువ ధరకే ఇళ్లంటూ 2,500 మంది నుంచి రూ.900 కోట్లు వసూలు చేశారు. అమీన్‌పూర్ ప్రాజెక్టు పేరుతో వసూలు చేసిన డబ్బును 2021 సెప్టెంబరులో ఇస్తామని ప్రకటించినా.. చెల్లించకపోవడంతో బాధితులు సంఘంగా ఏర్పడ్డారు. వందలాది మంది ధర్నాకు దిగారు. మాదాపూర్, జూబ్లీహిల్స్, పేట్ బషీరాబాద్, బాచుపల్లి ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. తీవ్ర ఆర్థిక నేరం కావడంతో హైదరాబాద్ సీసీఎస్‌లోనూ కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో ఈ ఏడాది ఆగస్టులో లక్ష్మీనారాయణ సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.