Lalaguda murder case updates : హైదరాబాద్ లాలాగూడ శాంతి నగర్ బుడిదిగడ్డలో ఈ నెల 13న జరిగిన ఆటో డ్రైవర్ చిలుక రాజేష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. లాలాపేట వినోభానగర్ ప్రాంతానికి చెందిన రెడ్డపాక నాగభూషణం హత్య కేసులో మృతుడు రాజేష్ ప్రధాన నిందితుడని గోపాల పురం ఏసీపీ సుధీర్ తెలిపారు. రెడ్డపాక నాగ భూషణం కుటుంబ సభ్యులు, మృతుడు రాజేష్‌కు కక్షలు మొదలయ్యాయని.... పాతకక్షల కారణంగా ఆటో డ్రైవర్ రాజేష్ హత్యకు గురయ్యాడని వెల్లడించారు.
2020 సంవత్సరంలో నాగభూషణం అనే వ్యక్తిని మృతుడు చిలుక రాజేష్ హత్య చేశాడని... ఈ హత్య కేసులో రాజేష్ ప్రధాన నిందితునిగా శిక్ష అనుభవించి ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడని ఏసీపీ వెల్లడించారు. ఈ నెల 13న రాత్రి మృతుడు చిలుక రాజేష్ తన మిత్రుడు శ్రీనివాస్‌ను కలిసేందుకు శాంతి నగర్ వచ్చాడని... నాగభూషణం బంధువుల్లో ఒకరైన శివకుమార్ పథకం ప్రకారం ఈ ఘటనకు పాల్పడ్డారని తెలిపారు. నలుగురు నిందితులు... వారి వద్దనున్న కత్తి, స్టిక్స్‌తో పాటు గ్రానైట్ రాయితో రాజేష్‌పై దాడి చేసి... హతమార్చారని పేర్కొన్నారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారని వివరించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని... మృతుడి తండ్రి చిలుక నర్సింగ్ రావు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ఏ1- రెడ్డపాక ప్రేమ్, ఏ 2- రెడ్డపాక మహేష్, ఏ 3- రెడ్డపాక సాయికుమార్, ఏ4- గడీల శివ కుమార్‌లను అరెస్ట్ చేశామని ఏసీపీ వెల్లడించారు. నలుగురు నిందితులూ శాంతి నగర్ ఆర్యనగర్‌కు చెందిన వారని... మరో ఇద్దరు ఏ5- వినయ్, ఏ 6- సంతోష్‌లు పరారీలో ఉన్నట్లు తెలిపారు.