Maha Shivaratri celebrations in joint nalgonda district: ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా శివాలయాలు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 'ఓం నమః శివాయ' అనే శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. ఆలయ అధికారులు దేవస్థానాలను సర్వాంగ సుందరంగా ముస్తాబుచేశారు. భక్తులు వేకువజాము నుంచే ఆ పరమేశ్వరుని సన్నిధికి చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పార్వతీ పరమేశ్వరులు కొలిస్తే ముక్తి లభిస్తుందనే నమ్మకంతో మహా శివరాత్రి ప్రత్యేక పూజలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. అంతే కాకుండా ఉపవాస దీక్షలు చేస్తారు. లింగర్చనలు, మహన్యస పూర్వక రుద్రాభిషేక పూజలు, శివజాగరణతో భక్తి భావం ఉట్టిపడేలా శైవ క్షేత్రాలు దర్శనం ఇస్తున్నాయి.
పానగల్ ఛాయా సోమేశ్వరాలయంలో అంగరంగవైభవంగా...
ముఖ్యంగా నల్గొండ పట్టణంలోని పానగల్‌లోని ఛాయా సోమేశ్వరాలయంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటలకే సర్వదర్శం... ఉదయం 4 గంటలకు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. స్వామివారి కల్యాణ మండపంలో రాత్రి 7.30 గంటలకు శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బుధవారం తెల్లవారు జామున 4.30 గంటలకు స్వామి వార్ల పల్లకి సేవ, అగ్నిగుండాల కార్యక్రమాలు చేపట్టనున్నారు. సాయంత్రం తెప్పోత్సవం, పల్లవింపు సేవ మొదలైన కార్యక్రమాలు జరపనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
పానగల్ ఛాయా సోమేశ్వరాలయానికి మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శివరాత్రి వచ్చే... భక్తలతో చెర్వుగట్టు కిక్కిరిసే...
మహాశివరాత్రి సందర్భంగా నల్గొండ జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలలో ఒక్కటైన నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టులోని శ్రీ పార్వతి సమేత జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనానికి బారులు తీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి వాహనాలను పోలీసులు అనుమతించలేదు. స్వామివారికి అర్చనలు, అభిషేకాలు చేసే మండపాలు భక్తులతో కిటకిటలాడిపోయాయి. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, త్రాగునీరు వంటి ఏర్పాట్లు చేసి ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
భక్తిశ్రద్ధలతో పరమశివునికి ప్రత్యేక పూజలు చెర్వుగట్టు దేవస్థానంలో అంత్యంత ప్రాచుర్యం ఉన్న మూడుగుండ్లపై ఉన్న శివలింగ దర్శనం కోసం భక్తులు ఎగబడ్డారు. ఈరోజు ఉపవాసదీక్షలో ఉండే భక్తులకు రాత్రి జాగరణ కోసం దేవాలయ అధికారులు కళాకారులచే ప్రత్యేక ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు. ఈ దేవస్థానంలో నకిరకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
భక్తిశ్రద్ధలతో పరమశివునికి ప్రత్యేక పూజలు 'ఈ దేవాలయం ఎంతో పవిత్రమైనది. ఈ ప్రాంత ప్రజలు, రైతులు ఎల్లప్పుడు సుఖసంతోషాలతో ఉండాలి. అలాగే ఈ రోజు మహాశివరాత్రి, బుధవారం అమావాస్య ఉన్నందున భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది, పోలీసు వారు ఏర్పాట్లు చేశారు.'
-చిరుమర్తి లింగయ్య, నకిరకల్ ఎమ్మెల్యే
శివనామ స్మరణతో వాడపల్లి మార్మోగే..
నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గంలో మహాశివరాత్రి పర్వదినాన శైవ క్షేత్రాలకు భక్తజనం పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే దేవాలయాలకు భక్తులు బారులు తీరారు. దామచర్ల మండలం వాడపల్లి కృష్ణా మూసి సంగమం వద్ద కొలువై ఉన్న శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు స్వామివారికి అభిషేకాలు,విశేష పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు.
మేళ్లచెరువులో ఘనంగా శివరాత్రి ప్రత్యేక పూజలు..
మేళ్లచెరువు మండల కేంద్రంలో శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి వారికి హుజూర్‌నగర్ అభివృద్ధి ప్రధాత, స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
'హుజూర్‌నగర్ నియోజకవర్గ ప్రజలందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. మేళ్లచెరువుకి మహాశివరాత్రికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. ఆ మహా శివుడి ఆశీస్సులు ఎల్లవేళలా రాష్ట్ర ప్రజలు, సీఎం కేసీఆర్ పై ఉండాలని మనస్ఫూర్తిగా ఆ లింగేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాం. ఎద్దుల పందాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలకు ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశాం.'
-శానంపూడి సైదిరెడ్డి, హుజూర్‌నగర్ ఎమ్మెల్యే
కొలనుపాకలో ఘనంగా శివరాత్రి పూజలు..
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం పర్యాటక కేంద్రమైన కొలనుపాకలో శ్రీచండీ సమేత సోమేశ్వరస్వామి ప్రసిద్ధ దేవాలయానికి శివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఈ ఆలయంలోని శివలింగం స్వయంభూగా ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయం కాకతీయుల కాలం నాటిదని చరిత్ర చెబుతుంది.
సోమేశ్వర ఆలయంలో ఉన్న సహస్రలింగాన్ని కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు, ఆయన సోదరి మైలాంబ ప్రతిష్ఠించారు. ఈ క్షేత్రంలోని కోటి లింగేశ్వర ఆలయానికి ఓ విశిష్టత ఉన్నది. ఆలయంలో కోటి లింగాలను ప్రతిష్ఠించే సమయంలో వెయ్యి లింగాలు తక్కువ కావడం వల్ల ఒకే రాయిపై వెయ్యి లింగాలను చెక్కి ప్రతిష్ఠించారని పూరాణాలు చెబుతున్నాయి. అదే నేడు కోటిలింగేశ్వర ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. ఈ శివలింగాన్ని పూజిస్తే కోరిన కోరికలు తీరడంతోపాటు ఆయురారోగ్యం, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ ఉన్న అన్ని ఆలయాలను భక్తులు నిత్యం సందర్శిస్తూనే ఉంటారు. ప్రతి మహాశివరాత్రికి సోమేశ్వరాలయానికి పెద్దఎత్తున భక్తులు తరలివస్తారు. చైత్ర బహుళ తదియ నుంచి పంచమి వరకు రేణుకాచార్య జయంత్యుత్సవాలు, రథోత్సవం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. కర్ణాటక నుంచి భక్తులు తిలకించేందుకు ఎక్కువగా తరలివస్తారు.
పిల్లలమర్రి శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగే...
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చారిత్రక పిల్లలమర్రి శివాలయాలను మహాశివరాత్రిని పురస్కరించుకుని విద్యుత్ కాంతులతో అలంకరించారు. ఎరుకేశ్వర స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి పెరిగింది. జిల్లా కేంద్రంలోని చౌదరి చెరువు(మినీ ట్యాంక్ బండ్) బతుకమ్మ ఘాట్ వద్ద బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో 25 అడుగుల శివలింగాన్ని ఏర్పాటు చేశారు. ఈ పురాతన పిల్లలమర్రి శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి.
ఇదీ చదవండి:శివపార్వతుల కల్యాణ ఘట్టాన్ని తిలకించే... భక్తులు జన్మ ధన్యమైందంటూ పరవశించే...